the gods
-
కోష్ఠ దేవతలు
మానవుడి దేహంలో శిరసు ఎంత ప్రాధాన్యమో గర్భగుడి అంత ముఖ్యమైనది. గర్భగుడికి దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలో దేవకోష్ఠములనే పేరుతో అలంకారయుతంగా గూడును ఏర్పాటు చేసి అందులో దేవతలను ప్రతిష్ఠిస్తారు. ఆ దేవతలను కోష్ఠ దేవతలంటారు. గర్భగృహం అంతర్భాగమే కాదు బహిర్భాగం కూడా దేవతా నిలయమే. శివాలయాల్లో కోష్ఠదేవతలుగా దక్షిణంలో దక్షిణామూర్తి, పశ్చిమాన లింగోద్భవమూర్తి లేక విష్ణువు, ఉత్తరంలో బ్రహ్మ ఉంటారు. విష్ణ్వాలయంలో దక్షిణభాగంలో దక్షిణామూర్తి లేదా నరసింహస్వామి, పశ్చిమంలో వైకుంఠమూర్తి, ఉత్తరాన వరాహమూర్తి ఉంటారు. అమ్మవారి ఆలయంలో బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ అనే దేవతలు ఉంటారు. ఇలా ఏ ఆలయమైనా మూడు దిక్కులలోని ముగ్గురు దేవతలు సాత్త్విక, రాజస, తామస గుణాలకు అధిదేవతలు. భక్తుడు ఒక్కో ప్రదక్షిణ చేస్తూ ఒక్కో దేవుణ్ణి దర్శిస్తూ ఒక్కో గుణాన్ని ఉపశమింప జేసుకుంటూ... త్రిగుణాతీతుడైన, గర్భగుడిలో నెలకొని ఉన్న దైవాన్ని దర్శించుకోవడానికి సన్నద్ధం అవుతాడు. అంతేగాక ఒక్కోదేవుడూ ఒక్కోరకమైన తాపాన్ని అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాలనే తాపత్రయాలను తీరుస్తారు. ఆ త్రిగుణాలను ఉపశమింపజేసి, తాపత్రయాలను దూరం చేసి అమృతమయమైన భగవద్దర్శనం కలిగేందుకు అనుగ్రహిస్తారు. కోష్ఠదేవతలు వేరైనా నిజానికి ఆ స్థానాలు త్రిమూర్తులకు చెందినవి. అందుకే ఆ సంబంధమైన దేవతావిగ్రహాలు అక్కడ కొలువుతీరి ఉంటాయి. ఆలయానికి వెళ్లే ప్రతిభక్తుడూ ఈ కోష్ఠదేవతలను దర్శించుకొని, వీలుంటే ఆరాధించుకొని వెళ్లడం ఆలయ సంప్రదాయాలలో ముఖ్యమైన విధి. గర్భగుడికి ముందున్న అంతరాలయానికి కూడా కోష్ఠాలను ఏర్పరచి దేవతలను ప్రతిష్ఠించి పూజిస్తారు. దక్షిణభాగంలో నృత్యం చేస్తున్న వినాయకుడు, ఉత్తర భాగంలో విష్ణుదుర్గా ఉంటారు. ఈ ఐదుగురు దేవతలను కలిపి పంచకోష్ఠదేవతలంటారు. ఈ కోష్ఠదేవతలను దర్శించి భక్తులు ఇష్టార్ధాలు పొందుతారు. ఆలయం అనేక సంకేతాలకు కూడలి. ఆ సంకేతాలను శోధిస్తూ భగవదనుగ్రహాన్ని సాధిస్తే ఆలయమంత పుణ్యనిధి మరొకటి లేదు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య. ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
అదే అమ్మవారి దర్శనం
‘‘హిమాద్రిసుతే పాహి మాం వరదే పరదేవతే/సుమేరు మధ్య వాసినీ అంబ శ్రీకామాక్షి.....’’ అన్న కీర్తనలో శ్యామశాస్త్రి గారు ‘సుమేరు మధ్య వాసినీ’ అనడంలో అమ్మవారు నివాసం ఉండే స్థానాన్ని ప్రస్తావిస్తూ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. అమ్మ ఎప్పుడూ ఎక్కడుంటుంది ? ఆమె పరమశివుని ఎడమ తొడమీద కూర్చుని ఉంటుంది. అమ్మా! శివకామేశ్వరాంకస్థవమయిన నువ్వుండే గృహమెక్కడో తెలుసా? అంటున్నారు ఆయన. అంటే– మేరు పర్వతానికున్న నాలుగు శిఖరాలలో మధ్యన ఒక శిఖరం ఉంటుంది. అదే శ్రీచక్రంలో బిందు స్థానం. ఆ త్రికోణం కింద చూస్తే తూర్పుకు ఒక శిఖరం, నైరుతికి ఒకటి, వాయవ్యానికి ఒకటి ఉన్నాయి. ఈ మూడు శిఖరాలమీద ముగ్గురు దేవతలున్నారు. వాళ్ళే సృష్టి, స్థితి, లయలు చేసే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురికీ కావలసిన శక్తి స్వరూపాలయిన సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే మూడు శక్తులను ముగ్గురు మూర్తులకు ఇచ్చిన మూల పుటమ్మవై ఈవేళ ఆ మధ్యలో ఉండే శిఖరంమీద కూర్చుని ఉన్నావమ్మా..’– ఇది బాహ్యంలో అర్థం. అంతరంలో!!! అందుకే ఆయన కీర్తనల్ని కదళీఫలంతో పోల్చారు. మేరు అంటే–మనకు వెన్నెముక ఉంటుంది. అలాగే భూమండలానికి, పాలపుంతకు, బ్రహ్మాండానికీ మేరువుంటుంది. ఆ మేరుకు మధ్యలో అమ్మవారు ఉండడం అంటే....ఆ మేరు అన్న మాటను విడదీయండి. అం+ఆ+ఇ+ఉ+రు. ఇందులో మొదటి రెండు, చివరి రెండు అక్షరాలు పర–పశ్యంత–మధ్యమ–వైఖరి అనే నాలుగు వాక్కులు. మధ్యలో ఉన్న ‘ఇ’కారం ‘ఈమ్’ అమ్మవారి బీజాక్షరం. ఆ ‘ఇ’కారం అమ్మవారి నాద స్వరూపం. సృష్టి ఆరంభం శూన్యం. ఆకారమొక్కటే ఉంటుంది. భూతములన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. అందులోంచి మొట్టమొదట వాయువు వస్తుంది. ఆకాశం శబ్దగుణకం కాబట్టి శబ్దం వస్తుంది. అదే ప్రణవం..‘ఓంకారం’ అంటాం.అలాగే మనిషిలోంచి కూడా శబ్దం బయటికొచ్చేముందు– లోపల ఒక నాదం ఉంటుంది. ఆ నాదమే అమ్మవారు. నాదాన్ని ఉపాసన చేయడమే అమ్మవారి దర్శనం చేయడం. అది పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యం కోసం. అంతే తప్ప, దాన్ని అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించుకోవడానికి కాదు. ఆ నాదోపాసనకు సంబంధించిన ‘ఇ’ అక్షరానికి అటు ఉన్న పర–పశ్యంతి, ఇటు ఉన్న మధ్యమ, వైఖరి..అంటే ఒక వాక్కు నోట్లోంచి బయటకు రావాలనుకోండి...అమ్మవారిని ‘హిమాద్రిసుతే’ అనాలనిపించడానికి ముందు సంకల్పం కలుగుతుంది. సహస్రార చక్రంలో..అలా కలిగితే దాన్ని ‘పర’ అంటారు. ‘హిమాద్రిసుతే’ అనడానికి అనాహత చక్రం దగ్గర వాయువు కదులుతుంది. అలా కదిలితే దానిని ‘పశ్యంతి’ అంటారు. కంఠం దగ్గరకు రాగానే అక్కడ ‘విశుద్ధ చక్రం’ దగ్గర ‘ర్’ అనే రేఫం తో కలిసి అగ్ని చేత సంస్కరింపబడి పరిశుద్ధమై అది నాలుకకు, పెదవులకు తగులుతుంది. లోపల ఉన్న వాయువు సొట్టలు పడి–అక్షరాలై, పదాలై, చరణాలై లోపల సహస్రారంలో కదలిన మాట ‘వైఖరి’ రూపుగా లోపల ఉన్న నాదం ఉపాసన చేస్తున్న స్వరూపంగా బయటికి రావాలి. అలా రావాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. సహస్రారంలో కలిగిన సంకల్పం..ౖ వెఖరీ వాక్కయి బయటికొచ్చి ఆకాశంలో ప్రయాణించి నీ చెవిలోకి వెడితే.. అక్కడ సహస్రారంలో కలిగిన భావన ఇక్కడ సహస్రారానికి అందుతుంది. అలా అందించగలిగిన నాదస్వరూపిణి అయిన అమ్మవారు ‘ఇ’కారం. ఆవిడే ‘సుమేరు మధ్య వాసిని’. -
బాహుబలి (గోమఠేశ్వరుడు)
జైన సంప్రదాయంలో ప్రధానమైన దేవతలను తీర్థంకరులు అంటారు. వారు ఇరవైనాలుగుమంది. వీరిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. ఇతడే జైనమత స్థాపకుడు. ఇతనికి ఇద్దరు కుమారులు. వారు భరతుడు, బాహుబలి. చక్రవర్తి అయిన ఋషభనాథుడు తన రాజ్యాన్ని పెద్ద కుమారుడైన భరతునికిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు. అప్పటికే బాహుబలి పోదనపురానికి రాజుగా ఉన్నాడు.భరతుని బహురాజ్యకాంక్షతో అన్ని రాజ్యాలనూ జయిస్తూ వచ్చాడు. కానీ బాహుబలి అతనికి లొంగకుండా యుద్ధం చేశాడు. యుద్ధంలో బాహుబలి విజయం సాధించాడు కానీ, విరక్తుడై భరతుడికి తన రాజ్యాన్ని ఇచ్చివేసి తాను నిలుచునేంత స్థలాన్ని దానంగా పొంది కాయోత్సర్గవిధిలో తపస్సు చేస్తూ నిలుచున్నాడు.(నిటారుగా నిలుచుని రెండు చేతులనూ రెండు వైపులా సమానంగా కిందకు చాపి కదలిక లేకుండా నిలుచోవడమే కాయోత్సర్గం.) ఆ తర్వాత ఈయనకు గోమఠేశ్వరుడు అనే పేరు వచ్చింది. కర్ణాటకలో హాసన్ జిల్లాలో ఉన్న శ్రావణబెళగొళలో గోమఠేశ్వరుడి అరవై అడుగుల అద్భుతమైన విగ్రహం చెక్కబడి ఉంది. ఈ విగ్రహాన్ని క్రీస్తుశకం 974 – 984 మధ్యలో గంగరాచమల్లుని దండనాయకుడైన చావుండరాయుడు చెక్కించాడు. ఈ విగ్రహాన్ని మలచిన విధానంలో ఒక విశేషం ఏమిటంటే ఇంద్రగిరి కొండనే విగ్రహంగా మలిచారు. కొండ పైనుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చారు.మరో విశేషమేమిటంటే విగ్రహం పాదపీఠం దగ్గర ఒక కొలబద్దను చెక్కారు. అది మూడు అడుగుల నాలుగు అంగుళాల కొలతను చూపిస్తోంది. దీనికి పద్దెనిమిది రెట్లు అంటే అరవై అడుగుల విగ్రహం ఉంది. దిగంబరంగా ఉన్న విగ్రహంలో గోమఠుడి శరీరానికి తీగలు అల్లుకుని ఉంటాయి. ఈ మూర్తికి జరిగే మహామస్తకాభిషేకం జగద్విఖ్యాతి కలిగింది. ఏటా జైనులు ఈ గోమఠేశ్వరుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో శ్రావణ బెళగొళను సందర్శిస్తారు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
ఒకడొచ్చి కత్తి చూపించి గణేష్ చందా అడిగాడు
హ్యూమర్ ప్లస్ వినాయక యాత్రా స్పెషల్ ‘‘మూషి బంగారం’’... డ్రైవర్ని బుజ్జగించాలనుకున్నప్పుడు వినాయకుడు ఇలాగే పిలుస్తాడు.‘‘కొండని తవ్వి ఎలకని పట్టకండి. కాలం మారింది. అయినా వుండ్రాళ్లు తినితిని ఒబెసిటీకి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యారు. ఏనుగుని మోసిమోసి ఎలుకని కాస్త చిట్టెలుకనయ్యాను. నా శ్రమని కూడా ఎవరూ గుర్తించడం లేదు. మిమ్మల్ని మోయడం గ్రాఫిక్స్ అనుకుంటున్నారు’’. ‘‘డ్రైవర్‌కి మరీ ఇంత వోవర్ పనికిరాదు.’’ ‘‘వోవర్ డ్యూటీ నావల్ల కాదు. క్యాబ్ బుక్ చేయండి. నేను కూడా మీతోపాటు వస్తాను.’’ కైలాసంలో చలి ఎక్కువై వినాయకుడికి భూలోకం చూడాలని కోరిక పుట్టింది. లైవ్ వెహికిల్ మూషికానికి వాట్సప్ మెసేజ్ పెట్టాడు.‘‘ఎర్న్డ్ లీవ్‌లో ఉన్నాను’’ అని రిప్లయ్ వచ్చింది. ‘‘లీవ్ క్యాన్సిల్. దిసీజ్ గణేష్ ఆర్డర్’’ ‘‘ఆర్డర్లు ఎక్కువైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. మా వాహన సంఘం అధ్యక్షుడు ఆదిశేషుడు గారికి కంప్లయింట్ చేస్తా. ఆయన పడగ విప్పి కోర్టులో వాదిస్తాడు.’’ ‘‘వైకుంఠ చట్టాలు కైలాసంలో పనికిరావు. ఇక్కడ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’’. ‘‘నేను చీమని కాను ఎలకని. అయినా నందీశ్వరుడే ఈమధ్య రంకెలేసి శివయ్య మీద స్ట్రయిక్ చేశాడు. ఈశ్వరుడంతటివాడే నడవలేక టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. కింద మంచు, నెత్తిన గంగ... పెద్దాయనే తడిసి ముద్దవుతున్నాడు. ‘‘మూషి బంగారం’’... డ్రైవర్ని బుజ్జగించాలనుకున్నప్పుడు వినాయకుడు ఇలాగే పిలుస్తాడు. ‘‘కొండని తవ్వి ఎలకని పట్టకండి. కాలం మారింది. అయినా వుండ్రాళ్లు తినితిని ఒబెసిటీకి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యారు. ఏనుగుని మోసిమోసి ఎలుకని కాస్త చిట్టెలుకనయ్యాను. నా శ్రమని కూడా ఎవరూ గుర్తించడం లేదు. మిమ్మల్ని మోయడం గ్రాఫిక్స్ అనుకుంటున్నారు’’. ‘‘డ్రైవర్‌కి మరీ ఇంత వోవర్ పనికిరాదు.’’ ‘‘వోవర్ డ్యూటీ నావల్ల కాదు. క్యాబ్ బుక్ చేయండి. నేను కూడా మీతోపాటు వస్తాను.’’ ‘‘కైలాసానికి క్యాబ్ వస్తుందా?’’ ‘‘లాభం వస్తుందనుకుంటే నరకానికి కూడా వచ్చి యముడి దున్నపోతుని కూడా రిప్లేస్ చేస్తారు. గ్లోబలైజేషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తప్ప ఇక దేనికీ అకౌంటబులిటీ వుండదు.’’ కుబేరుడి దగ్గర రోజువారీ వడ్డీకి అప్పు తీసుకుని క్యాబ్ బుక్ చేశాడు వినాయకుడు. ‘‘ఇన్‌టైంలో అప్పు తీర్చకపోతే తొండం, ఏకదంతం రెండూ లాక్కెళతా’’ అని హెచ్చరించి మరీ ఇచ్చాడు కుబేరుడు. ఎలుక ఫుల్ సూట్లో వినాయకుడి దగ్గర ప్రత్యక్షమైంది. ‘‘ఈ డ్రస్సేంటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు వినాయకుడు. ‘‘డ్రస్సుని బట్టి మన అడ్రస్ని అంచనా వేస్తారు. సూట్‌ని, సూట్‌కేస్‌ని గౌరవించే కాలమిది. గ్రాస్ గురించి తప్ప, మీకు గ్రాస్ రూట్స్ తెలియవు కదా’’ క్యాబ్వాడు వచ్చాడు. ‘‘ఇంత తొందరగా ఎలా వచ్చావ్?’’ అడిగాడు వినాయకుడు. ‘‘పక్కనే వైకుంఠంలో డ్రాప్ వుండింది సార్. విష్ణువు గారిని తిరుపతి నుంచి పికప్ చేసుకొచ్చా’’ చెప్పాడు డ్రయివర్.‘‘గరుడ సర్వీస్ వుందిగా?’’ ‘‘పొల్యూషన్ ఎక్కువై ముక్కుల్లో ఎలర్జీ వచ్చింది. పొడుగాటి ముక్కులుంటే ఇదే సమస్య’’ చెప్పింది మూషికం. ‘‘దేవుళ్ళకి కూడా సమస్యలొస్తాయా?’’ అడిగాడు వినాయకుడు. ‘‘మనుషులు తమ సమస్యలు చెప్పుకుని చెప్పుకుని దేవుళ్ళని కూడా సమస్యలపాలు చేశారు. ఈమధ్య బ్రహ్మకి తలపోటు ఎక్కువై ఒక తలకి అల్జిమర్స్ వ్యాధి వచ్చింది. దాంతో ఆయన మనుషుల్ని జంతువుల్ని కలగలిపి తయారుచేసేశాడు. కాంబినేషన్ మిస్ కావడం వల్ల మనిషే సాటి మనిషిని జంతువులాగా పీక్కు తింటున్నాడు’’ వివరించింది మూషికం. ‘‘అయినా అందరూ ఆయన్ని చూడడానికి తిరుపతికెళితే, విష్ణువు ఎవర్ని చూడడానికి తిరుపతికెళ్లాడు’’? ‘‘సార్‌ని అక్కడెవరూ గుర్తుపట్టలేదు. ఆయన విగ్రహాన్ని చూడడానికి తోసుకుని తొక్కుకున్నారు గానీ, సాక్షాత్తూ ఆయనే ఎదురై పలకరించినా ఎవరూ పట్టించుకోలేదు. హర్టయ్యి వెంటనే క్యాబ్ ఎక్కేశారు’’ చెప్పాడు క్యాబ్ డ్రైవర్. ‘‘వాళ్ళంతే, మీ బొమ్మ కనిపిస్తే దండం పెడతారు. మీరే కనిపిస్తే వేషం అనుకుంటారు’’ చెప్పింది మూషికం. జిపిఎస్ ప్రకారం భూలోకంలో దింపాడు డ్రైవర్. ఎక్కడ చూసినా తన విగ్రహాలే కనిపించేసరికి వినాయకుడికి సంతోషమేసింది. ఇంతలో జనం పాలగ్లాసులతో పోలోమంటూ పరిగెత్తుతూ కనిపించారు. ‘‘వినాయకుడి విగ్రహం పాలు తాగుతూ వుందని పరిగెత్తుతున్నారు. మీరు అడిగి చూడండి. ఒక చుక్క కూడా ఇవ్వరు’’ చెప్పింది మూషికం. ఒకరిద్దరిని ఆపి వినాయకుడు అడిగి చూశాడు. పట్టించుకోకుండా విగ్రహాల వైపు పారిపోయారు. వినాయకుడు చిన్నబుచ్చుకున్నాడు. ‘‘దేవుడు రాయే తప్ప మనిషి కాదని వాళ్ళ నమ్మకం’’ చెప్పింది మూషికం. ఇంతలో ఒక పిల్లి కనిపించి ఎలుకతో షేక్‌హ్యాండ్ తీసుకుని వెళ్లింది. ‘‘ప్రపంచీకరణ అంటే శత్రువులు చేతులు కలుపుకోవడం, మిత్రులు కత్తులు దూసుకోవడమే. పిల్లికి ఎలుకకి మధ్య అమెరికా వాళ్లు స్నేహ ఒడంబడికని కుదిర్చారు’’ చెప్పింది మూషికం. ‘‘అమెరికా అంటే?’’ ‘‘మీకు తెలియకుండా మిమ్మల్ని అమ్మడం.’’ ‘‘నీకింత నాలెడ్జి ఎలా వచ్చింది?’’ ‘‘క్యాట్ కోర్స్ చదివాను’’ ఒక రాజకీయ నాయకుడు కనిపించి వినాయకుడికి దండం పెట్టాడు. ‘‘షూటర్ కంటే నేను ఓటరుకే ఎక్కువ భయపడతా. మీ ఓటు నాకే’’ అన్నాడు. ‘‘నేను వినాయకుణ్ణి’’ ‘‘నేను నాయకుడ్ని. వి అంటే మీ ఇంటిపేరా?’’ ‘‘వీడు అజ్ఞానిలాగున్నాడు’’ మూషికంతో అన్నాడు వినాయకుడు. ‘‘అందుకే రాజకీయాల్లో ఉన్నాడు’’ ఒకచోట సినిమా షూటింగ్ జరుగుతూ కనిపించింది. ‘‘మూషికా, నాకు ఎప్పట్నుంచో సినిమాల్లో నటించాలని కోరిక’’ ‘‘సినిమాల్లోకంటే బయటే జనం బాగా నటిస్తున్నారు. అలా నడుస్తూ వెళితే బోలెడు సినిమాలు చూడొచ్చు.’’ ‘‘వినాయకుడు నేరుగా డెరైక్టర్ దగ్గరికెళ్లి వేషమడిగాడు. ‘‘మనుషులంతా మారువేషాలతో జీవిస్తున్న ఈరోజుల్లో వేషం అడిగావంటే నీకు ఆవేశం ఎక్కువని అర్థమైంది. మేకప్ లేకుండా వేస్తే వేషమిస్తా’’ అన్నాడు డెరైక్టర్. ‘‘ఇది మేకప్ కాదు, నాచురల్’’ ‘‘నాచురాలిటీ, తెలుగు సినిమా రెండూ వేర్వేరు విషయాలు. మాకింకా అంత మెచ్యూరిటీ రాలేదు.’’ వినాయకుడు, మూషికం నడుస్తూ వెళుతూ వుంటే ఒకాయన లాప్టాప్ చూస్తూ తనలో తాను గొణుక్కుంటూ కనిపించాడు ‘‘ఆయన జోలికెళ్లకండి. అతను కవి. కాశ్మీర్లో బుల్లెట్లు పెల్లెట్లు గురితప్పుతాయేమో కానీ ఆయన అక్షరాలు విసిరితే గురి తప్పవు. గరళాన్ని మింగిన మీ డాడీ శివయ్యే, కవి కనిపిస్తే చాలు పులి చర్మం సర్దుకుని, త్రిశూలం చంకన పెట్టుకుని నందికి కూడా చెప్పకుండా పారిపోతాడు. పార్వతి మేడం గూగుల్ సెర్చ్‌లో వెతికివెతికి పట్టుకుంటారు’’ వినాయకుడి చెవులు వణికాయి. దారిలో మొగుడు పెళ్లాం గొడవపడుతూ కనిపించారు. ‘‘సంసారమనేది గొడవల పడవ. మునిగినప్పుడు తేలిందనుకుంటాం. తేలినప్పుడు మునిగిందనుకుంటాం’’ అన్నాడు వినాయకుడు. ‘‘పంచ్ వేశారా స్వామీ’’ అడిగింది ఆశ్చర్యంగా మూషికం. ‘‘చిన్నప్పటినుంచి పంచె కట్టినవాణ్ణి. ఆమాత్రం పంచ్ వేయలేనా?’’ ఇంతలో ఒకడొచ్చి కత్తి చూపించి గణేష్ చందా అడిగాడు. అక్కడ్నుంచి ఇద్దరు పారిపోయి క్యాబ్ బుక్ చేసుకుని కైలాసం చేరారు. కుబేరుడి రికవరీ ఏజెంట్లు వచ్చి వడ్డీ కట్టమన్నారు. ‘‘ఓనర్‌కి మించిన తెలివితేటలు డ్రైవర్‌కి వుంటే డేంజర్. వడ్డీ కట్టేవరకూ ష్యూరిటీగా మూషికాన్ని తీసుకెళ్ళండి’’ అన్నాడు వినాయకుడు. ‘‘అన్యాయం’’ అని అరిచింది ఎలుక. ‘‘జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కువ డైలాగులు చెప్పకూడదు. ఏనుగు ముందు ఎలుక ఎలుకలాగే వుండాలి.’’ ‘‘ఒక్క ట్రిప్పుకే మీకు భూలోకం బుద్ధులు వచ్చాయి’’ అని ఆక్రోశించింది మూషికం. - జి.ఆర్. మహర్షి -
శ్రీకరా..శుభకరా...క్షేమకరా..!
శ్రీగణేశ అనే సంస్కృత పదానికి ప్రారంభం అని అర్థం. అందుకే వినాయకుడు ఆదిదేవుడ య్యాడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. దేవతాగణాలు ఉద్భవించి సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిపురుషునిగా పూజలందుకుంటున్నట్లుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణుస్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ శ్లోకం సూచిస్తుంది. దేజతలలో ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ప్రథమపూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్టవసువులకు కూడా ప్రభువు. ప్రణవనాద స్వరూపుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి సకల విద్యలకూ అధిదేవత. ప్రణవస్వరూపంగా, శుద్ధబ్రహ్మగా, ఆనంద స్వరూపంగా విరాజిల్లే దేవదేవుడు వినాయకుడు. నాయకుడు లేని సర్వ స్వతంత్రుడాయన. ‘గణపతి’ అనే పదంలో ‘గణ’ అనే శబ్దానికి వాక్కు అని అర్థం. కాబట్టి వాగధిపతి గణపతియే! వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధివీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు. తొలిపూజతో ఆరాధనా ఫలం వినాయకుడిని పూజించడం వలన శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుందని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వశుభాలనూ చేకూరుస్తుంది. త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధంతో ఇందుమతీ రాణి గణపతి మట్టి విగ్రహాన్ని చేసి చవితినాడు పూజించి, తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగి పొందింది. కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగంతో జన్మించినవాడై గణేశుని ఆరాధించి సర్వాంగ సుందరుడై విరాజిల్లాడు. రుక్మిణీదేవి గణేశుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయకచవితినాడు గణపతిని ఆరాధించేవారు ఆరోగ్యప్రదజీవనం గడుపుతారు. సద్బుద్ధినీ, అనుకూల మిత్రత్వాన్నీ, కార్యసాధననూ అనుగ్రహించగల దే వుడు గణనాథుడు. నిమజ్జనలోని ఆంతర్యం తొమ్మిదిరోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపి వేయడం బాధగానే ఉంటుంది. కాని అది ఒక సంప్రదాయం. 3, 5, 9 రోజుల పూజ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.ఎన్నో అలంకరణలతో, మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలలో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందేననే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది. - ఇట్టేడు అర్కనందనాదేవి గణేశుడికి గరిక పూజ అంటే ఇష్టం ఎందుకు? ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడికి మంత్రయుక్తంగా పూజ చేసి, దూర్వాయుగ్మం అంటే రెండు గరికలతో పూజ చేస్తారు. దీనికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. యమధర్మరాజుకు అనలాసురుడనే కొడుకు ఉన్నాడు. అతను తన రాక్షస ప్రవృత్తితో దేవతలను అనేక విధాల బాధలకు గురిచేస్తున్నాడు. దేవతల ప్రార్థనను ఆలకించిన గణపతి ఆ రక్కసుని ఒక ఉండగా చేసి మింగివేశాడు. ఆ అనలాసురుడు గణపతి గర్భంలో చేరి ఆయనకు అధిక తాపం కలిగించగా, ఆ తాప నివారణార్థం దేవతలు ఎంతగానో శీతలోపచారాలు చేశారు కాని ఫలితం లేకపోయింది. వారందరూ గంగాధరుని ప్రార్థించగా ఆయన సాక్షాత్కరించి ఒక్కొక్కరు ఇరవైఒక్క గరిక పోచలు తెచ్చి ఇరవై ఒక్క మార్లు వినాయకుని శరీరంపై కప్పమని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా చేసిన తర్వాత గణపతికి తాపం తగ్గింది. నాటినుండి వినాయకునికి గరికపూజ ప్రీతిపాత్రంగా మారిందని పురాణగాథ. అంతేగాక గరికపోచలలో ఔషధీ గుణం ఉంది. సర్పి, చిడుము మొదలైన వాటికి మంత్రించే వారు గరికపోచలు వాడేది అందుకే. - డి.ఎస్.ఆర్. ఆంజనేయులు