మానవుడి దేహంలో శిరసు ఎంత ప్రాధాన్యమో గర్భగుడి అంత ముఖ్యమైనది. గర్భగుడికి దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలో దేవకోష్ఠములనే పేరుతో అలంకారయుతంగా గూడును ఏర్పాటు చేసి అందులో దేవతలను ప్రతిష్ఠిస్తారు. ఆ దేవతలను కోష్ఠ దేవతలంటారు. గర్భగృహం అంతర్భాగమే కాదు బహిర్భాగం కూడా దేవతా నిలయమే. శివాలయాల్లో కోష్ఠదేవతలుగా దక్షిణంలో దక్షిణామూర్తి, పశ్చిమాన లింగోద్భవమూర్తి లేక విష్ణువు, ఉత్తరంలో బ్రహ్మ ఉంటారు. విష్ణ్వాలయంలో దక్షిణభాగంలో దక్షిణామూర్తి లేదా నరసింహస్వామి, పశ్చిమంలో వైకుంఠమూర్తి, ఉత్తరాన వరాహమూర్తి ఉంటారు.
అమ్మవారి ఆలయంలో బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ అనే దేవతలు ఉంటారు. ఇలా ఏ ఆలయమైనా మూడు దిక్కులలోని ముగ్గురు దేవతలు సాత్త్విక, రాజస, తామస గుణాలకు అధిదేవతలు. భక్తుడు ఒక్కో ప్రదక్షిణ చేస్తూ ఒక్కో దేవుణ్ణి దర్శిస్తూ ఒక్కో గుణాన్ని ఉపశమింప జేసుకుంటూ... త్రిగుణాతీతుడైన, గర్భగుడిలో నెలకొని ఉన్న దైవాన్ని దర్శించుకోవడానికి సన్నద్ధం అవుతాడు. అంతేగాక ఒక్కోదేవుడూ ఒక్కోరకమైన తాపాన్ని అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాలనే తాపత్రయాలను తీరుస్తారు. ఆ త్రిగుణాలను ఉపశమింపజేసి, తాపత్రయాలను దూరం చేసి అమృతమయమైన భగవద్దర్శనం కలిగేందుకు అనుగ్రహిస్తారు.
కోష్ఠదేవతలు వేరైనా నిజానికి ఆ స్థానాలు త్రిమూర్తులకు చెందినవి. అందుకే ఆ సంబంధమైన దేవతావిగ్రహాలు అక్కడ కొలువుతీరి ఉంటాయి. ఆలయానికి వెళ్లే ప్రతిభక్తుడూ ఈ కోష్ఠదేవతలను దర్శించుకొని, వీలుంటే ఆరాధించుకొని వెళ్లడం ఆలయ సంప్రదాయాలలో ముఖ్యమైన విధి. గర్భగుడికి ముందున్న అంతరాలయానికి కూడా కోష్ఠాలను ఏర్పరచి దేవతలను ప్రతిష్ఠించి పూజిస్తారు. దక్షిణభాగంలో నృత్యం చేస్తున్న వినాయకుడు, ఉత్తర భాగంలో విష్ణుదుర్గా ఉంటారు. ఈ ఐదుగురు దేవతలను కలిపి పంచకోష్ఠదేవతలంటారు. ఈ కోష్ఠదేవతలను దర్శించి భక్తులు ఇష్టార్ధాలు పొందుతారు. ఆలయం అనేక సంకేతాలకు కూడలి. ఆ సంకేతాలను శోధిస్తూ భగవదనుగ్రహాన్ని సాధిస్తే ఆలయమంత పుణ్యనిధి మరొకటి లేదు.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య. ఆగమ, శిల్పశాస్త్ర పండితులు
Comments
Please login to add a commentAdd a comment