శ్రీకరా..శుభకరా...క్షేమకరా..! | Lessons of True Leadership from Lord Ganesh | Sakshi
Sakshi News home page

శ్రీకరా..శుభకరా...క్షేమకరా..!

Published Sun, Sep 8 2013 11:42 PM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

శ్రీకరా..శుభకరా...క్షేమకరా..!

శ్రీకరా..శుభకరా...క్షేమకరా..!

శ్రీగణేశ అనే సంస్కృత పదానికి ప్రారంభం అని అర్థం.  అందుకే వినాయకుడు ఆదిదేవుడ య్యాడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. దేవతాగణాలు ఉద్భవించి సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిపురుషునిగా పూజలందుకుంటున్నట్లుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణుస్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ శ్లోకం సూచిస్తుంది.
 
దేజతలలో ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ప్రథమపూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్టవసువులకు కూడా ప్రభువు. ప్రణవనాద స్వరూపుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది.

గణపతి సకల విద్యలకూ అధిదేవత. ప్రణవస్వరూపంగా, శుద్ధబ్రహ్మగా, ఆనంద స్వరూపంగా విరాజిల్లే దేవదేవుడు వినాయకుడు. నాయకుడు లేని సర్వ స్వతంత్రుడాయన. ‘గణపతి’ అనే పదంలో ‘గణ’ అనే శబ్దానికి వాక్కు అని అర్థం. కాబట్టి వాగధిపతి గణపతియే!

వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధివీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు.

తొలిపూజతో ఆరాధనా ఫలం


వినాయకుడిని పూజించడం వలన శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుందని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వశుభాలనూ చేకూరుస్తుంది. త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధంతో ఇందుమతీ రాణి గణపతి మట్టి విగ్రహాన్ని చేసి చవితినాడు పూజించి, తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగి పొందింది. కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగంతో జన్మించినవాడై గణేశుని ఆరాధించి సర్వాంగ సుందరుడై విరాజిల్లాడు. రుక్మిణీదేవి గణేశుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయకచవితినాడు గణపతిని ఆరాధించేవారు ఆరోగ్యప్రదజీవనం గడుపుతారు. సద్బుద్ధినీ, అనుకూల మిత్రత్వాన్నీ, కార్యసాధననూ అనుగ్రహించగల దే వుడు గణనాథుడు.

నిమజ్జనలోని ఆంతర్యం


తొమ్మిదిరోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపి వేయడం బాధగానే ఉంటుంది. కాని అది ఒక సంప్రదాయం. 3, 5, 9 రోజుల పూజ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.ఎన్నో అలంకరణలతో, మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలలో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందేననే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది.


 - ఇట్టేడు అర్కనందనాదేవి

 

గణేశుడికి గరిక పూజ అంటే ఇష్టం ఎందుకు?

ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడికి మంత్రయుక్తంగా పూజ చేసి, దూర్వాయుగ్మం అంటే రెండు గరికలతో పూజ చేస్తారు. దీనికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. యమధర్మరాజుకు అనలాసురుడనే కొడుకు ఉన్నాడు. అతను తన రాక్షస ప్రవృత్తితో దేవతలను అనేక విధాల బాధలకు గురిచేస్తున్నాడు. దేవతల ప్రార్థనను ఆలకించిన గణపతి ఆ రక్కసుని ఒక ఉండగా చేసి మింగివేశాడు. ఆ అనలాసురుడు గణపతి గర్భంలో చేరి ఆయనకు అధిక తాపం కలిగించగా, ఆ తాప నివారణార్థం దేవతలు ఎంతగానో శీతలోపచారాలు చేశారు కాని ఫలితం లేకపోయింది. వారందరూ గంగాధరుని ప్రార్థించగా ఆయన సాక్షాత్కరించి ఒక్కొక్కరు ఇరవైఒక్క గరిక పోచలు తెచ్చి ఇరవై ఒక్క మార్లు వినాయకుని శరీరంపై కప్పమని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా చేసిన తర్వాత గణపతికి తాపం తగ్గింది. నాటినుండి వినాయకునికి గరికపూజ ప్రీతిపాత్రంగా మారిందని పురాణగాథ. అంతేగాక గరికపోచలలో ఔషధీ గుణం ఉంది. సర్పి, చిడుము మొదలైన వాటికి మంత్రించే వారు గరికపోచలు వాడేది అందుకే.
 - డి.ఎస్.ఆర్. ఆంజనేయులు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement