Sri Mahalakshmi
-
తిరుమల శ్రీవారి పాదరక్షలు ఎందుకు అరిగిపోయి ఉంటాయి?
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పాదరక్షలకోసం ఏటేటా తిరుమలకు ఉత్తరాన గల శ్రీకాళహస్తి గ్రామం, దక్షిణానగల కాంచీపుర గ్రామాలలోని చర్మకారులకు శ్రీవారి పాదముద్రలు ఇస్తారు. వారిరువురు విడివిడిగా ఆ పాదముద్రల కొలతలతో పాదరక్షలను చేసి వాటిని శిరస్సున పెట్టుకుని, ఊరూరా తిరిపమెత్తుకుంటూ వచ్చి అలిపిరి పూజ చేసి ఆ పాదరక్షను పూజామందిరంలో ఉంచుతారు. ఈ కొత్తపాదరక్షలు తయారై వచ్చే సమయానికి పాత పాదరక్షలు చాలావరకు అరిగిపోయి ఉంటాయి. శ్రావణ శనివారాలు ఉపవాసం ఉండి, పిండి తళిగలు వేస్తారు. ఆ పిండిమీద శ్రీవారి పాదముద్రలు వేస్తారు. ఆ రెండు పాదముద్రలను ఒకరికి తెలియకుండా మరొకరికి ఇస్తారు. శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన ఎందుకు? సిరులను, సంపదలను, సకలైశ్వర్యాలను కోరగానే భక్తులకు అందించే శ్రీమహాలక్ష్మికి పూవులన్నా, గాజులన్నా, కుంకుమన్నా బహుప్రీతి. విష్ణుమూర్తి అలంకారపియుడు కావడానికి బహుశ ఇదే కారణమేమో! పరమేశ్వరునికి పాలతో, ఉదకంతో అభిషేకం చేయడం, ఆంజనేయునికి సింధూరం పూత పూయడం, విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం ఎంతటి సత్ఫలితాలను ఇస్తుందో, శ్రీ మహాలక్ష్మికి కుంకుమతో చేసే పూజ అంతటి దివ్యసంపదలను అందిస్తుంది. త్వరిత గతిన శుభాలను చేకూరుస్తుంది. -
మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు
-
శ్రీ మహాలక్ష్మిదేవిగా విజయవాడ కనకదుర్గ
-
శ్రీ వ్రతం సంపదలిచ్చే మాసం సిరులిచ్చే వ్రతం
పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన విష్ణుచిత్తులవారికి సంతానం లేదు. ఆయన భక్తికి మెచ్చి, సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మీ దేవియే పసిపాపగా ఆయనకు తులసివనంలో దొరికింది. ఆ పాపకు కోద అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకున్నాడాయన. కోద అంటే పూలమాల అని అర్థం. పసితనం నుంచి శ్రీ రంగనాథునే చిత్తంలో నిలుపుకుని ఆరాధిస్తున్న కోద యుక్తవయస్కురాలైంది. ఫలితంగా ఆమెకు తన ఆరాధ్యదైవాన్నే పతిగా పొందాలన్న కోరిక కలిగింది. అయితే ఆ మాటను ఆమె తండ్రికి చెప్పలేదు. వచ్చిన సంబంధాలన్నింటినీ తిరస్కరించేది. ఇది ఇలా ఉండగా స్వామివారికి రకరకాల పూలతో అందమైన మాలకట్టేవాడు విష్ణుచిత్తుడు. మాలలు కట్టే పనిని కోద తనంత తానుగా తండ్రి నుంచి స్వీకరించింది. రోజూ ఆమె తాను కట్టిన మాలను తానే తలలో పెట్టుకుని చూసి మురిసిపోతుండేది. అది తెలియని విష్ణుచిత్తుడు వాటినే స్వామికి సమర్పించేవాడు. ఒకరోజు ఆమె కట్టిన మాలలో పొడవాటి వెంట్రుక కనిపించింది విష్ణుచిత్తునికి. దాంతో అనుమానం వచ్చి కూతురిని నిలదీశాడు. తాను చేసిన పనిని అంగీకరించింది కోద. అపరాధభావనతో విష్ణుచిత్తుడు ఆ రోజు కట్టిన మాలను స్వామికి సమర్పించలేదు. అంతేకాదు, ఆ రోజు పూజ కూడా సరిగా చేయలేకపోయాడు. వ్యాకులచిత్తంతో ఉన్న విష్ణుచిత్తునికి కలలో శ్రీ రంగనాథుడు కనిపించి, కోద ధరించిన పూలమాల అంటే తనకెంతో ఇష్టమని చెప్పి, ఇకముందు కూడా ఆమె ధరించిన తర్వాతనే తాను పూలమాలను స్వీకరిస్తానని చెప్పాడు. నిద్ర మేలుకొన్న విష్ణుచిత్తుడు జరిగినదంతా కుమార్తెకు చెప్పాడు. అంతవరకూ తెలియక చేసిన పనిని సాక్షాత్తూ శ్రీరంగనాథుడే మెచ్చుకునేసరికి తానంటే స్వామికి కూడా ఇష్టమేమోననే భావన కలిగి కోదకు సిగ్గుతో చెంపలు కెంపులయ్యాయి. ఆ రోజు స్వామిని తలచుకుంటూ కలతనిద్రపోయింది. ఆ నిద్రలో తాను రంగనాథుని వివాహం చేసుకున్నట్లు అద్భుతమైన కల కనింది. ఆ కలను సాఫల్యం చేసుకునేందుకు ఒక వ్రతం చేయాలని ఆమె సంకల్పించింది. ఆ వ్రతమే శ్రీవ్రతం. నైమిశారణ్యంలో సూతమహాముని శౌనకాది మునులకు ఈ వ్రతవిధానం బోధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీవ్రతాన్ని ధనుస్సంక్రమణం మొదలు మకర సంక్రమణం వరకు ఆచరించాలి. దీనినే గోపికలు కాత్యాయనీ వ్రతంగా ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందారని పురాణ వచనం. ఇదీ ఈ వ్రతవిధానం సూర్యుని కన్నా ముందే నిద్ర మేల్కొనాలి. నిత్యకర్మలను పూర్తి చేసుకుని ఈ వ్రతంపై శ్రద్ధఉంచి విష్ణువును పూజించాలి. అందుకోసం శక్తిమేరకు ఒక ప్రతిమను తయారు చేయించి, దానికి మధుసూదనుడు అని పేరు పెట్టి అర్చామూర్తిగా నిలపాలి. ఈ విగ్రహంలోనికి నారాయణుని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. విగ్రహ ప్రతిష్ఠాపన చేసింది మొదలు ప్రతిరోజూ పంచామృతస్నానం చేయించాలి. తులసీదళాలతో అలంకరించాలి. అష్టోత్తర శత నామాలతో అర్చనచేయాలి. నైవేద్యంగా నెయ్యి ఓడేలా బియ్యం, పెసరపప్పు సమపాళ్లలో తయారు చేసిన పప్పు పొంగలిని సమర్పించాలి. మొదటి పదిహేను రోజులూ ముద్గాన్నాన్ని అంటే పప్పు పొంగలిని, తరువాతి పదిహేనురోజులూ దానితోబాటు దధ్యోదనాన్ని నివేదించాలి. చివరిగా మంత్రపుష్ప, నీరాజనాదులిచ్చి, ఆత్మ ప్రదక్షిణ చేసి, తీర్థప్రసాదాలను స్వీకరించాలి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాచరణ చేసిన కోద రోజుకో పాశురంతో స్వామిని స్తుతించేది. ఆమె భక్తికి మెచ్చిన రంగనాథుడు ఆమెను పత్నిగా స్వీకరించాడు. ఆమే ఆండాల్. - డి.వి.ఆర్. భాస్కర్ వ్రతనియమాలేమిటి? ఈ వ్రతమంతటినీ సూర్యోదయానికి పూర్వమే పూర్తిచేయడం ఉత్తమం. ఆవునేతితో వెలిగించిన అఖండదీపం శ్రీహరికి అత్యంత ప్రీతికరం. ఈనెలరోజులూ శ్రీహరి చరితామృతాన్ని వినాలి. గానం చేయాలి. తులసి, గోపూజలు చేయాలి. విష్ణుపురాణ పఠనం, శ్రవణం శుభఫలితాలనిస్తుంది. అర్హతలేమిటి? నియమాలను పాటించేందుకు ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ వ్రతాన్ని ఆచరించేందుకు అర్హులే. భక్తి, శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఇంటిలోనే వ్రతాన్ని ఆచరించవచ్చు. అందుకు కుదరనివారు సమీపంలోని ఏదైనా దేవాలయంలోగాని, భాగవతోత్తముల ఇండ్లకు వెళ్లిగాని ఆచరించవచ్చు. ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ప్రయోజనాలేమిటి? వివాహం కాని వారు ఈ మార్గళీ వ్రతాన్ని ఆచరిస్తే శీఘ్రంగా వివాహమవుతుందని, సౌభాగ్యవతులు వ్రతాచరణ చేసి తమ సంసారంలోని చిక్కులను రూపుమాపుకోవచ్చునని, భగవంతునిపై భక్తితో వ్రతాచరణ చేస్తే శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని ఫలశ్రుతి చెబుతోంది. -
శ్రీకరా..శుభకరా...క్షేమకరా..!
శ్రీగణేశ అనే సంస్కృత పదానికి ప్రారంభం అని అర్థం. అందుకే వినాయకుడు ఆదిదేవుడ య్యాడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. దేవతాగణాలు ఉద్భవించి సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిపురుషునిగా పూజలందుకుంటున్నట్లుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణుస్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ శ్లోకం సూచిస్తుంది. దేజతలలో ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ప్రథమపూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్టవసువులకు కూడా ప్రభువు. ప్రణవనాద స్వరూపుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి సకల విద్యలకూ అధిదేవత. ప్రణవస్వరూపంగా, శుద్ధబ్రహ్మగా, ఆనంద స్వరూపంగా విరాజిల్లే దేవదేవుడు వినాయకుడు. నాయకుడు లేని సర్వ స్వతంత్రుడాయన. ‘గణపతి’ అనే పదంలో ‘గణ’ అనే శబ్దానికి వాక్కు అని అర్థం. కాబట్టి వాగధిపతి గణపతియే! వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధివీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు. తొలిపూజతో ఆరాధనా ఫలం వినాయకుడిని పూజించడం వలన శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుందని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వశుభాలనూ చేకూరుస్తుంది. త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధంతో ఇందుమతీ రాణి గణపతి మట్టి విగ్రహాన్ని చేసి చవితినాడు పూజించి, తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగి పొందింది. కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగంతో జన్మించినవాడై గణేశుని ఆరాధించి సర్వాంగ సుందరుడై విరాజిల్లాడు. రుక్మిణీదేవి గణేశుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయకచవితినాడు గణపతిని ఆరాధించేవారు ఆరోగ్యప్రదజీవనం గడుపుతారు. సద్బుద్ధినీ, అనుకూల మిత్రత్వాన్నీ, కార్యసాధననూ అనుగ్రహించగల దే వుడు గణనాథుడు. నిమజ్జనలోని ఆంతర్యం తొమ్మిదిరోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపి వేయడం బాధగానే ఉంటుంది. కాని అది ఒక సంప్రదాయం. 3, 5, 9 రోజుల పూజ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.ఎన్నో అలంకరణలతో, మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలలో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందేననే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది. - ఇట్టేడు అర్కనందనాదేవి గణేశుడికి గరిక పూజ అంటే ఇష్టం ఎందుకు? ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడికి మంత్రయుక్తంగా పూజ చేసి, దూర్వాయుగ్మం అంటే రెండు గరికలతో పూజ చేస్తారు. దీనికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. యమధర్మరాజుకు అనలాసురుడనే కొడుకు ఉన్నాడు. అతను తన రాక్షస ప్రవృత్తితో దేవతలను అనేక విధాల బాధలకు గురిచేస్తున్నాడు. దేవతల ప్రార్థనను ఆలకించిన గణపతి ఆ రక్కసుని ఒక ఉండగా చేసి మింగివేశాడు. ఆ అనలాసురుడు గణపతి గర్భంలో చేరి ఆయనకు అధిక తాపం కలిగించగా, ఆ తాప నివారణార్థం దేవతలు ఎంతగానో శీతలోపచారాలు చేశారు కాని ఫలితం లేకపోయింది. వారందరూ గంగాధరుని ప్రార్థించగా ఆయన సాక్షాత్కరించి ఒక్కొక్కరు ఇరవైఒక్క గరిక పోచలు తెచ్చి ఇరవై ఒక్క మార్లు వినాయకుని శరీరంపై కప్పమని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా చేసిన తర్వాత గణపతికి తాపం తగ్గింది. నాటినుండి వినాయకునికి గరికపూజ ప్రీతిపాత్రంగా మారిందని పురాణగాథ. అంతేగాక గరికపోచలలో ఔషధీ గుణం ఉంది. సర్పి, చిడుము మొదలైన వాటికి మంత్రించే వారు గరికపోచలు వాడేది అందుకే. - డి.ఎస్.ఆర్. ఆంజనేయులు -
విశ్వవ్యాపకుడు... భక్తసులభుడు
వైకుంఠం శ్రీమన్నారాయణుని నిత్య నిజనివాసం. శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలంపై విరాజిల్లుతుంది. ఆ తల్లికి చిహ్నంగా శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఆ దేవదేవుని వక్షస్థలాన్ని అలంకరిస్తుంది. విరాట్పురుషునిగా వేదం కొనియాడిన చతుర్మూర్తి విష్ణుభగవానుడు. శంఖ, చక్ర, గదా, పద్మాలు హరి నాలుగు బాహువులనూ అలంకరించి ప్రాణికోటికి ఆ శబ్దస్పర్శరూపరసగంధాలనూ, ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదించే నాలుగు వరాలై అలరారుతున్నాయి. అమృతం నిండిన రెక్కలతో, వాయువేగంతో సంచరించే సుపర్ణుడు గరుడుడు. సప్తలోకాల్లో అమృతం పంచిపెట్టే అమృతహృదయుడైన శ్రీహరి వాహనమే గరుత్మంతుడు. విశ్వవృక్షానికి వేదాలు ఆకులవంటివి. ఈ మహావృక్షంపై రెండు పక్షులుంటాయి. అందులో ఒకటి కమ్మని పండ్లను ఆరగిస్తుంది. మరొక పక్షి అది చూసి ఆనందిస్తుంది. ఆనందాన్ని గ్రోలే పక్షియే సుపర్ణం. అదే ఆ దేవదేవుని దివ్యవాహనం. పంచభూతాలతో కూడిన పార్థివ శరీరమే పాంచజన్యం. అదే పరిసరాలను పావనం చేసే సామర్థ్యం గల పరంధాముడు వినిపించే శంఖధ్వని. లోకాన్నంతా ఆనందనిలయంగా మార్చే దివ్యమైన ఆయుధం నందకం అనే ఖడ్గం. ధర్మసంస్థాపనే ఖడ్గసృష్టికి సార్థకం. ప్రపంచ వలయంలోని చలనాన్ని, గమనాన్ని, అరవింద సుందర సౌందర్యాన్ని, హరి అరచేతిలో చిటికెనవేలి చివరన ఆవిష్కరించగలిగేదే సుదర్శనచక్రం. సంసార చక్రంలోని సారమంతా సుదర్శనచక్రంలో ప్రస్ఫుటమవుతుంది. శారఙ్గం అనే ధనువు ద్వారా బ్రహ్మపదార్థమనే లక్ష్యాన్ని ఆత్మ అనే బాణంతో ఛేదించి ఆత్మానుభూతి కలిగించే మహా ప్రహరీణాయుధుడు గోవిందుడు. పరబ్రహ్మ నోట వెలువడిన వాక్కే కౌమోదకి గద. ప్రపంచంలోని తియ్యని నాదాలకు ఆమోదమై, కువలయానికి మోదమై, పరంధాముని చేతిలో ఒప్పారే దివ్యాయుధం కౌమోదకి. లోకయాత్రకు అనుగుణంగా అనేక రథాలను సృష్టించి రథచక్రాలను తన చేతిలో అట్టిపెట్టుకునే రథాంగపాణి శ్రీమహావిష్ణువు. సంసార గమనాన్ని నిశ్చలంగా నడిపించే సర్వలోకసారథియై వెలిగే పరంజ్యోతి. సమస్తాన్నీ ప్రపంచానికి అందించే జగజ్జేత శ్రీమన్నారాయణునికి ఫలం పత్రం పుష్పం తోయం ఏదైనా భక్తితో సమర్పిస్తే తృప్తిగా స్వీకరించే భక్తసులభుడు. కానీ ఎక్కడ తలచుకుంటే అక్కడ ప్రభవించే విష్ణుదేవుని స్మరిస్తే చాలు... జన్మ సంసారబంధం తొలగిపోతుందట. విశ్వమంతటా వ్యాపించిన విభుడు శ్రీ మహావిష్ణువు దివ్యలీలా ప్రాభవం అవాజ్ఞ్మానస గోచరం. - ఇట్టేడు అర్కనందనాదేవి