ఒకడొచ్చి కత్తి చూపించి గణేష్ చందా అడిగాడు
హ్యూమర్ ప్లస్
వినాయక యాత్రా స్పెషల్
‘‘మూషి బంగారం’’... డ్రైవర్‌ని బుజ్జగించాలనుకున్నప్పుడు వినాయకుడు ఇలాగే పిలుస్తాడు.‘‘కొండని తవ్వి ఎలకని పట్టకండి. కాలం మారింది. అయినా వుండ్రాళ్లు తినితిని ఒబెసిటీకి బ్రాండ్ అంబాసిడర్‌లా తయారయ్యారు. ఏనుగుని మోసిమోసి ఎలుకని కాస్త చిట్టెలుకనయ్యాను. నా శ్రమని కూడా ఎవరూ గుర్తించడం లేదు. మిమ్మల్ని మోయడం గ్రాఫిక్స్ అనుకుంటున్నారు’’. ‘‘డ్రైవర్‌కి మరీ ఇంత వోవర్ పనికిరాదు.’’ ‘‘వోవర్ డ్యూటీ నావల్ల కాదు. క్యాబ్ బుక్ చేయండి. నేను కూడా మీతోపాటు వస్తాను.’’
కైలాసంలో చలి ఎక్కువై వినాయకుడికి భూలోకం చూడాలని కోరిక పుట్టింది. లైవ్ వెహికిల్ మూషికానికి వాట్సప్ మెసేజ్ పెట్టాడు.‘‘ఎర్న్‌డ్ లీవ్‌లో ఉన్నాను’’ అని రిప్లయ్ వచ్చింది. ‘‘లీవ్ క్యాన్సిల్. దిసీజ్ గణేష్ ఆర్డర్’’ ‘‘ఆర్డర్లు ఎక్కువైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. మా వాహన సంఘం అధ్యక్షుడు ఆదిశేషుడు గారికి కంప్లయింట్ చేస్తా. ఆయన పడగ విప్పి కోర్టులో వాదిస్తాడు.’’ ‘‘వైకుంఠ చట్టాలు కైలాసంలో పనికిరావు. ఇక్కడ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’’. ‘‘నేను చీమని కాను ఎలకని. అయినా నందీశ్వరుడే ఈమధ్య రంకెలేసి శివయ్య మీద స్ట్రయిక్ చేశాడు. ఈశ్వరుడంతటివాడే నడవలేక టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. కింద మంచు, నెత్తిన గంగ... పెద్దాయనే తడిసి ముద్దవుతున్నాడు. ‘‘మూషి బంగారం’’... డ్రైవర్‌ని బుజ్జగించాలనుకున్నప్పుడు వినాయకుడు ఇలాగే పిలుస్తాడు.
‘‘కొండని తవ్వి ఎలకని పట్టకండి. కాలం మారింది. అయినా వుండ్రాళ్లు తినితిని ఒబెసిటీకి బ్రాండ్ అంబాసిడర్‌లా తయారయ్యారు. ఏనుగుని మోసిమోసి ఎలుకని కాస్త చిట్టెలుకనయ్యాను. నా శ్రమని కూడా ఎవరూ గుర్తించడం లేదు. మిమ్మల్ని మోయడం గ్రాఫిక్స్ అనుకుంటున్నారు’’. ‘‘డ్రైవర్‌కి మరీ ఇంత వోవర్ పనికిరాదు.’’ ‘‘వోవర్ డ్యూటీ నావల్ల కాదు. క్యాబ్ బుక్ చేయండి. నేను కూడా మీతోపాటు వస్తాను.’’ ‘‘కైలాసానికి క్యాబ్ వస్తుందా?’’ ‘‘లాభం వస్తుందనుకుంటే నరకానికి కూడా వచ్చి యముడి దున్నపోతుని కూడా రిప్లేస్ చేస్తారు. గ్లోబలైజేషన్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తప్ప ఇక దేనికీ అకౌంటబులిటీ వుండదు.’’
కుబేరుడి దగ్గర రోజువారీ వడ్డీకి అప్పు తీసుకుని క్యాబ్ బుక్ చేశాడు వినాయకుడు. ‘‘ఇన్‌టైంలో అప్పు తీర్చకపోతే తొండం, ఏకదంతం రెండూ లాక్కెళతా’’ అని హెచ్చరించి మరీ ఇచ్చాడు కుబేరుడు. ఎలుక ఫుల్ సూట్‌లో వినాయకుడి దగ్గర ప్రత్యక్షమైంది. ‘‘ఈ డ్రస్సేంటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు వినాయకుడు. ‘‘డ్రస్సుని బట్టి మన అడ్రస్‌ని అంచనా వేస్తారు. సూట్‌ని, సూట్‌కేస్‌ని గౌరవించే కాలమిది. గ్రాస్ గురించి తప్ప, మీకు గ్రాస్ రూట్స్ తెలియవు కదా’’ క్యాబ్‌వాడు వచ్చాడు.
‘‘ఇంత తొందరగా ఎలా వచ్చావ్?’’ అడిగాడు వినాయకుడు. ‘‘పక్కనే వైకుంఠంలో డ్రాప్ వుండింది సార్. విష్ణువు గారిని తిరుపతి నుంచి పికప్ చేసుకొచ్చా’’ చెప్పాడు డ్రయివర్.‘‘గరుడ సర్వీస్ వుందిగా?’’ ‘‘పొల్యూషన్ ఎక్కువై ముక్కుల్లో ఎలర్జీ వచ్చింది. పొడుగాటి ముక్కులుంటే ఇదే సమస్య’’ చెప్పింది మూషికం. ‘‘దేవుళ్ళకి కూడా సమస్యలొస్తాయా?’’ అడిగాడు వినాయకుడు. ‘‘మనుషులు తమ సమస్యలు చెప్పుకుని చెప్పుకుని దేవుళ్ళని కూడా సమస్యలపాలు చేశారు. ఈమధ్య బ్రహ్మకి తలపోటు ఎక్కువై ఒక తలకి అల్జిమర్స్ వ్యాధి వచ్చింది. దాంతో ఆయన మనుషుల్ని జంతువుల్ని కలగలిపి తయారుచేసేశాడు. కాంబినేషన్ మిస్ కావడం వల్ల మనిషే సాటి మనిషిని జంతువులాగా పీక్కు తింటున్నాడు’’ వివరించింది మూషికం.
‘‘అయినా అందరూ ఆయన్ని చూడడానికి తిరుపతికెళితే, విష్ణువు ఎవర్ని చూడడానికి తిరుపతికెళ్లాడు’’? ‘‘సార్‌ని అక్కడెవరూ గుర్తుపట్టలేదు. ఆయన విగ్రహాన్ని చూడడానికి తోసుకుని తొక్కుకున్నారు గానీ, సాక్షాత్తూ ఆయనే ఎదురై పలకరించినా ఎవరూ పట్టించుకోలేదు. హర్టయ్యి వెంటనే క్యాబ్ ఎక్కేశారు’’ చెప్పాడు క్యాబ్ డ్రైవర్. ‘‘వాళ్ళంతే, మీ బొమ్మ కనిపిస్తే దండం పెడతారు. మీరే కనిపిస్తే వేషం అనుకుంటారు’’ చెప్పింది మూషికం. జిపిఎస్ ప్రకారం భూలోకంలో దింపాడు డ్రైవర్. ఎక్కడ చూసినా తన విగ్రహాలే కనిపించేసరికి వినాయకుడికి సంతోషమేసింది. ఇంతలో జనం పాలగ్లాసులతో పోలోమంటూ పరిగెత్తుతూ కనిపించారు.
‘‘వినాయకుడి విగ్రహం పాలు తాగుతూ వుందని పరిగెత్తుతున్నారు. మీరు అడిగి చూడండి. ఒక చుక్క కూడా ఇవ్వరు’’ చెప్పింది మూషికం. ఒకరిద్దరిని ఆపి వినాయకుడు అడిగి చూశాడు. పట్టించుకోకుండా విగ్రహాల వైపు పారిపోయారు. వినాయకుడు చిన్నబుచ్చుకున్నాడు. ‘‘దేవుడు రాయే తప్ప మనిషి కాదని వాళ్ళ నమ్మకం’’ చెప్పింది మూషికం. ఇంతలో ఒక పిల్లి కనిపించి ఎలుకతో షేక్‌హ్యాండ్ తీసుకుని వెళ్లింది. ‘‘ప్రపంచీకరణ అంటే శత్రువులు చేతులు కలుపుకోవడం, మిత్రులు కత్తులు దూసుకోవడమే. పిల్లికి ఎలుకకి మధ్య అమెరికా వాళ్లు స్నేహ ఒడంబడికని కుదిర్చారు’’ చెప్పింది మూషికం. ‘‘అమెరికా అంటే?’’ ‘‘మీకు తెలియకుండా మిమ్మల్ని అమ్మడం.’’ ‘‘నీకింత నాలెడ్జి ఎలా వచ్చింది?’’ ‘‘క్యాట్ కోర్స్ చదివాను’’ ఒక రాజకీయ నాయకుడు కనిపించి వినాయకుడికి దండం పెట్టాడు.
‘‘షూటర్ కంటే నేను ఓటరుకే ఎక్కువ భయపడతా. మీ ఓటు నాకే’’ అన్నాడు. ‘‘నేను వినాయకుణ్ణి’’ ‘‘నేను నాయకుడ్ని. వి అంటే మీ ఇంటిపేరా?’’ ‘‘వీడు అజ్ఞానిలాగున్నాడు’’ మూషికంతో అన్నాడు వినాయకుడు. ‘‘అందుకే రాజకీయాల్లో ఉన్నాడు’’ ఒకచోట సినిమా షూటింగ్ జరుగుతూ కనిపించింది. ‘‘మూషికా, నాకు ఎప్పట్నుంచో సినిమాల్లో నటించాలని కోరిక’’ ‘‘సినిమాల్లోకంటే బయటే జనం బాగా నటిస్తున్నారు. అలా నడుస్తూ వెళితే బోలెడు సినిమాలు చూడొచ్చు.’’ ‘‘వినాయకుడు నేరుగా డెరైక్టర్ దగ్గరికెళ్లి వేషమడిగాడు. ‘‘మనుషులంతా మారువేషాలతో జీవిస్తున్న ఈరోజుల్లో వేషం అడిగావంటే నీకు ఆవేశం ఎక్కువని అర్థమైంది. మేకప్ లేకుండా వేస్తే వేషమిస్తా’’ అన్నాడు డెరైక్టర్. ‘‘ఇది మేకప్ కాదు, నాచురల్’’ ‘‘నాచురాలిటీ, తెలుగు సినిమా రెండూ వేర్వేరు విషయాలు. మాకింకా అంత మెచ్యూరిటీ రాలేదు.’’
వినాయకుడు, మూషికం నడుస్తూ వెళుతూ వుంటే ఒకాయన లాప్‌టాప్ చూస్తూ తనలో తాను గొణుక్కుంటూ కనిపించాడు ‘‘ఆయన జోలికెళ్లకండి. అతను కవి. కాశ్మీర్‌లో బుల్లెట్లు పెల్లెట్లు గురితప్పుతాయేమో కానీ ఆయన అక్షరాలు విసిరితే గురి తప్పవు. గరళాన్ని మింగిన మీ డాడీ శివయ్యే, కవి కనిపిస్తే చాలు పులి చర్మం సర్దుకుని, త్రిశూలం చంకన పెట్టుకుని నందికి కూడా చెప్పకుండా పారిపోతాడు. పార్వతి మేడం గూగుల్ సెర్చ్‌లో వెతికివెతికి పట్టుకుంటారు’’
వినాయకుడి చెవులు వణికాయి. దారిలో మొగుడు పెళ్లాం గొడవపడుతూ కనిపించారు. ‘‘సంసారమనేది గొడవల పడవ. మునిగినప్పుడు తేలిందనుకుంటాం. తేలినప్పుడు మునిగిందనుకుంటాం’’ అన్నాడు వినాయకుడు. ‘‘పంచ్ వేశారా స్వామీ’’ అడిగింది ఆశ్చర్యంగా మూషికం. ‘‘చిన్నప్పటినుంచి పంచె కట్టినవాణ్ణి. ఆమాత్రం పంచ్ వేయలేనా?’’ ఇంతలో ఒకడొచ్చి కత్తి చూపించి గణేష్ చందా అడిగాడు. అక్కడ్నుంచి ఇద్దరు పారిపోయి క్యాబ్ బుక్ చేసుకుని కైలాసం చేరారు. కుబేరుడి రికవరీ ఏజెంట్లు వచ్చి వడ్డీ కట్టమన్నారు. ‘‘ఓనర్‌కి మించిన తెలివితేటలు డ్రైవర్‌కి వుంటే డేంజర్. వడ్డీ కట్టేవరకూ ష్యూరిటీగా మూషికాన్ని తీసుకెళ్ళండి’’ అన్నాడు వినాయకుడు. ‘‘అన్యాయం’’ అని అరిచింది ఎలుక. ‘‘జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కువ డైలాగులు చెప్పకూడదు. ఏనుగు ముందు ఎలుక ఎలుకలాగే వుండాలి.’’ ‘‘ఒక్క ట్రిప్పుకే మీకు భూలోకం బుద్ధులు వచ్చాయి’’ అని ఆక్రోశించింది మూషికం.
- జి.ఆర్. మహర్షి