గోండుల దేవుడు రాముడు కాదు రావణుడు!
విభిన్నం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి ఆనుకుని ఉంటుంది విదిశ జిల్లా. ఆ జిల్లా కేంద్రానికి 40 కి.మీ.ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. దాని పేరు రావణ్. ఇది కన్యాకుబ్జ బ్రాహ్మణులు, గోండులు నివసించే గ్రామం. వీరి ఆరాధ్యదైవం రావణుడు.
ఆ ఊళ్లో అందరికీ వారి దేవుడంటే అమితమైన భక్తి. ఊళ్లో ఎవరికి పెళ్లి కుదిరినా తొలి ఆహ్వాన పత్రిక అందుకునేది ఆ దేవుడే. వధూవరుల తల్లిదండ్రులు ఆహ్వానపత్రికను దేవుడి పాదాల ముందు పెట్టి తమ బిడ్డల వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోయేటట్లు ఆశీర్వదించమని వేడుకుంటారు. ఇదంతా చూస్తే ఆ దేవుడు రాముడేమో అనిపిస్తుంది. కానీ రాముడు కాదు. అయితే కథానాయకుడిగా రాముడి పాత్రను హీరోచితంగా చూపించడానికి దోహదపడిన ప్రతినాయకుడు రావణుడే ఇక్కడ దేవుడు. గోండుల ఆరాధ్యదైవం రావణుడు.
రావణ్ గ్రామస్థులకు రావణుడు హీరో. స్కూలు పిల్లలు ఆలయం పక్క నుంచి వెళ్లేటప్పుడు ‘జై లంకేశ్’ అంటూ హుషారుగా సాగిపోతుంటారు. ఈ గ్రామస్థులు దేశంలో అందరిలాగానే అన్ని పండుగలనూ చేసుకుంటారు. కానీ దసరా పండుగను చేయరు. దసరాని రాముని విజయ వేడుక అని భావించరు. రామరావణ యుద్ధాన్ని... ఆర్యులు భారత దేశం మీదకు దండెత్తి గోండుల రాజ్యాలను ఆక్రమించుకునే క్రమంలో జరిగిన ఘర్షణగానే భావిస్తారు. స్థానికులను ఆర్యుల దాడి నుంచి కాపాడడానికి ప్రాణాలొడ్డి పోరాడిన వీరుడిగా రావణుడిని గౌరవిస్తారు.
మరో విశేషం ఏమిటంటే... రావణ్ గ్రామంలోని రావణుడి ఆలయంలో విగ్రహం పడుకుని ఉన్న భంగిమలో ఉంటుంది. ఆ విగ్రహాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తే వైపరీత్యాలు సంభవిస్తాయని వారి నమ్మకం.
భారతదేశంలో రావణుడికి ఆలయం ఉండడమే విశేషం. అనుకుంటే అది ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పటికి మూడు ఆలయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా రావణ్ గ్రామంలోని ఆలయం. రెండవది రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌కు సమీపంలో ఉంది. జోధ్‌పూర్ రాజ్యానికి ప్రాచీన కాలంలో మాండోర్ నగరం రాజధాని. అది రావణుడి భార్య మండోదరి పుట్టినిల్లని స్థానికుల అభిప్రాయం. అక్కడ ముద్గల్ గోత్రీకుల కుటుంబాలు ఇప్పటికీ వందకు పైగా ఉన్నాయి.
వారంతా రామరావణ యుద్ధం తర్వాత శ్రీలంక నుంచి జోధ్‌పూర్‌కు వచ్చి స్థిరపడిన వారి వారసులమని చెబుతారు. వారితోపాటు ఇతర గోత్రికులు కూడా కొంతమంది ఉన్నట్లు సమాచారం. వారు కూడా రావణుడిని గొప్ప వీరుడిగానే గౌరవిస్తారు. మూడవది కాన్పూర్‌లో ఉంది. ఇందులో ఓ వైవిధ్యం ఉంది. ఈ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరుస్తారు. ఆ రోజు రావణుడికి విశేష పూజలు చేస్తారు.
రాముడి పేరుతో ఊళ్లుంటాయి. రాముడికి ఆలయం ఉంటుంది. మనదేశంలో రాముడి గుడి లేని ఊరు లేదనేటంత అతిశయోక్తిలో చెప్పుకుంటారు కూడా. ఇది సహజం. సర్వసాధారణం. అయితే రావణుడి ఆలయం ఉండడంలో కొంత భిన్నత్వం, వైవిధ్యం దాగి ఉందనే చెప్పాలి. ప్రతి విషయానికీ, విజయానికీ రెండో కోణం ఉంటుంది. ఆ రెండో కోణానికి ప్రతీకలు ఈ ఆలయాలు.