షార్‌‌కల నోట... పగడాల వేట! | Great Barrier Reef | Sakshi
Sakshi News home page

షార్‌‌కల నోట... పగడాల వేట!

Published Tue, Sep 27 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

షార్‌‌కల నోట... పగడాల వేట!

షార్‌‌కల నోట... పగడాల వేట!

గ్రేట్ బారియర్ రీఫ్
పగడపు దీవులుంటాయని ఎక్కడో చందమామ, బాలమిత్ర కథల్లో చదివారా? మరి ఆ కథలు కళ్లెదురుగా నిలబడితే!! ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు వెళితే జరిగేది అదే. 2,600 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పగడపు దిబ్బల్లో... ఈత కొట్టడమే కాదు. స్నోర్కెలింగ్, సెయిలింగ్, స్కూబా డైవింగ్ వంటి రకరకాల సాహసాలు చేయొచ్చు. కాదనుకుంటే క్రూయిజ్ బోట్‌లోనో, స్పీడ్‌బోట్‌లోనో వెళుతూ అవన్నీ చూడొచ్చు. సీ ప్లేన్‌లో వెళుతూ కిందనున్న పగడపు దిబ్బల్ని క్లిక్ చేయొచ్చు. ఇక డే డ్రీమ్ ఐలాండ్‌లో... ప్రమాద కరమైన స్టింగ్ రేకు అతి సమీపంలోకి వెళ్లొచ్చు. గుడ్డులోంచి బయటకు వచ్చే తాబేళ్లనూ చూడొచ్చు.
 
ఇవన్నీ కేవలం గ్రేట్ బారియర్ రీఫ్‌లోనే సాధ్యం. ఆస్ట్రేలియాకు ఈశాన్యంగా ఉండే క్వీన్స్‌లాండ్ తీరం పొడవునా విస్తరించిన గ్రేట్ బారియర్ రీఫ్‌ను... భువిపై అతిపెద్ద జీవమున్న వస్తువుగా చెబుతారు. దాదాపు 600 రకాల పగడాలతో తయారైన వందల కొద్దీ దీవులు, వేల పగడపు దిబ్బలు అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయట. ఇక రకరకాల చేపలతో పాటు డాల్ఫిన్లు, షార్క్‌లకు కూడా కొదవుండదు.
 
క్వీన్స్‌లాండ్‌ను చేరుకునేదెలా?
* విమానంలో వెళ్లాలనుకుంటే క్వీన్స్‌లాండ్‌లోని హామిల్టన్ ఐలాండ్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి.
* హామిల్టన్‌కు... రాజధాని మెల్‌బోర్న్‌తో పాటు సిడ్నీ, పెర్త్ వంటి నగరాల నుంచి విమానాలున్నాయి.
* ఇండియా నుంచి వెళ్లేవారు తొలుత ఢిల్లీ, ముంబైల నుంచి సిడ్నీ చేరుకుని, అక్కడి నుంచి హామిల్టన్ వెళ్లటమే ఉత్తమం.
* ఇండియా నుంచి సిడ్నీకి, అక్కడి నుంచి హామిల్టన్‌కు... తిరుగు ప్రయాణ ఛార్జీలు ముందుగా బుక్ చేసుకుంటే రూ.55వేల నుంచి 80 వేల మధ్య ఉంటాయి.
* చౌక విమాన సర్వీసులు నడిపే ఎయిర్ ఏసియా వంటివి కూడా సిడ్నీకి విమానాలు నడుపుతున్నాయి. దీంతో ఒకరికి రూ.50 వేలల్లో కూడా ఒకోసారి టిక్కెట్ దొరుకుతుంది.
* సిడ్నీ నుంచి గ్రేట్ బారియర్ రీఫ్ టూరిజానికి ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయి.
* లోకల్ ప్యాకేజీలు ఒక మనిషికి రెండు రోజులకు రూ.8వేల నుంచి మొదలవుతాయి. చేసే యాక్టివిటీస్‌ను బట్టి ఈ మొత్తం పెరుగుతుంది.
* సిడ్నీ నుంచి విమానం, హోటల్ కలిపి ప్యాకేజీలుంటాయి. ఇవి మనిషికి ఒకరికి రూ.20వేల నుంచి (3 రోజులకు) మొదలవుతాయి.
 
ఏ సీజన్ అనుకూలం?

ఏప్రిల్ - మే: చక్కని సీజన్. కాస్త డిస్కవుంట్లు దొరుకుతాయి. వర్షాలుండవు. నీళ్లు క్లియర్‌గా ఉంటాయి. డైవింగ్‌కు పరిస్థితులు బాగుంటాయి.
     
జూన్ - అక్టోబర్ : డిమాండు, రద్దీ రెండూ ఎక్కువే. అమెరికాలో ఇది వేసవి. ఆస్ట్రేలియాలో చలికాలం. అమెరికన్లంతా ఇక్కడికొస్తుంటారు. రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది.
     
నవంబరు - మార్చి:
యాత్రికులు తక్కువ. దీంతో డిస్కౌంట్లు బాగానే ఇస్తారు. విపరీతమైన వర్షాలు పడతాయి. నీళ్లు క్లియర్‌గా ఉండవు. జెల్లీ ఫిష్‌ల సంచారమూ ఎక్కువ. ప్రధాన బీచ్‌లలో స్విమింగ్ కష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement