ఎంతో రుచిరా..!
కదళీఫలం (అరటిపండు) మధురం.
ఖర్జూరం మృదు మధురం.
నవరస పరమాన్న నవనీతాలు మధురాతి మధురం.
కానీ భక్తరామదాసు ఒప్పుకోడు!
రామనామాన్ని మించిన మధురం లేదంటాడు.
ఎందుకు లేదూ... ఉంది!
శ్రీరాముడిపై రామదాసు భక్తి!!
ఇవాళ శ్రీరామనవమి.
భక్తితో పానకం చేసినా, అరటి పూరీ చేసినా అది మధురమే.
పానకం
కావలసినవి: బెల్లం తురుము - 3 కప్పులు; నీళ్లు - 5 కప్పులు; శొంఠి పొడి - అర టీ స్పూను; మిరియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; నిమ్మరసం - టేబుల్ స్పూను;
తయారీ: ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కరిగే వరకు కలపాలి ఉప్పు, నిమ్మరసం వేసి మరో మారు కలపాలి శొంఠి పొడి, మిరియాల పొడి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి గ్లాసులలో అందించాలి.
దోసకాయ కోసుమల్లి
కావలసినవి: పెసర పప్పు - అరకప్పు; దోసకాయ లేదా కీర దోస కాయ - 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); నిమ్మరసం - 3 టీ స్పూన్లు; ఉప్పు - అర టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి); నెయ్యి - టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; తాజా కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు.
తయారీ పెసర పప్పును శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టి సుమారు పది నిమిషాలు అలాగే ఉంచేయాలి. (పూర్తిగా నీళ్లు పోవాలి) ఒక పాత్రలో తరిగిన దోసకాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి చిన్న గుంట గరిటెలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఇంగువ జత చేసి బాగా కలిపి దోసకాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేయాలి తాజాకొబ్బరి తురుముతో అలంకరించి అందించాలి.
అరటిపండు పూరీ
కావలసినవి: అరటిపండ్ల గుజ్జు - అర కప్పు; పంచదార - అర కప్పు; నెయ్యి - టేబుల్ స్పూను (కరిగించినది); ఏలకుల పొడి - పావు టీ స్పూను; ఉప్పు - చిటికెడు; బాదం పప్పుల తురుము - 3 టేబుల్ స్పూన్లు; గోధుమపిండి - ముప్పావు కప్పు; మైదా పిండి - ముప్పావు కప్పు; నూనె - వేయించడానికి తగినంత.
తయారీ ఒక పాత్రలో అరటిపండ్ల గుజ్జు, పంచదార, బాదం పప్పుల తురుము, కరిగించిన నెయ్యి, ఉప్పు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి గోధుమపిండి, మైదా పిండి జత చేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా తయారుచేసి సుమారు రెండు గంటల సేపు పక్కన ఉంచాలి చేతికి నూనె కాని నెయ్యి కాని రాసుకుని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, చిన్న చిన్న పూరీల మాదిరిగా అప్పడాల పీట మీద ఒత్తాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. (ఇవి ఒక్కొక్కటీ వేగడానికి సుమారు రెండు నిమిషాలు పడుతుంది) వీటిని వేడివేడిగా అందించాలి.