
ఇటాలియన్ తల్లిదండ్రులకు క్యూబాలో జన్మించాడు ఇటాలో కాల్వీనో(1923–1985). తమ దేశ మూలాలను మరిచిపోకూడదన్న పట్టింపుతో ఇటాలో అని నామకరణం చేసింది తల్లి. తన పేరు మరీ రణాభిముఖమైన జాతీయవాదపు పేరుగా వినబడుతుందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు ఇటాలో. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికుడిగా పనిచేశాడు కూడా. పిల్లాడిగా ఉన్నప్పుడే ఇటాలో తల్లిదండ్రులు ఇటలీకి తిరిగొచ్చారు. తల్లిదండ్రులిద్దరూ విద్యాధికులే. శాస్త్రవిజ్ఞానాలంటే ఎక్కువ ఆదరముండే ఇంట్లో, సాహిత్యాన్ని ప్రేమించడం ఇటాలోను అధముడిగా పరిగణించేలా చేసింది. చాలా సందేహాల మధ్య సాహిత్యం వైపు మరలాడు. రీజన్‌కు ప్రాధాన్యత ఇచ్చే రచయిత. రాసిందానికంటే కొట్టేసేది ఎక్కువ, అంటాడు. ‘అవర్ ఆన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘ఇన్విజిబుల్ సిటీస్’, ‘ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్’ నవలలు ఆయన రచనల్లో పేరెన్నికగన్నవి. ‘కాస్మియోకామిక్స్’, ‘ద క్రో కమ్స్ లాస్ట్’, ‘నంబర్స్ ఇన్ ద డార్క్’, ‘ఆడమ్, వన్ ఆఫ్టర్‌నూన్’ లాంటివి కథాసంకలనాలు. పాత్రికేయుడిగా పనిచేశాడు. కొంతకాలం కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. 1956లో హంగెరీ మీద సోవియట్ రష్యా దండెత్తడంతో పార్టీ మీద భ్రమలు తొలగి రాజీనామా చేశాడు. చనిపోయేనాటికి అతి ఎక్కువగా అనువాదమైన ఇటాలియన్ రచయిత కాల్వీనో.