గోలీలాట గుర్తొస్తుంది..! | Gurtostundi golilata ..! | Sakshi
Sakshi News home page

గోలీలాట గుర్తొస్తుంది..!

Published Sat, Sep 6 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

గోలీలాట గుర్తొస్తుంది..!

గోలీలాట గుర్తొస్తుంది..!

గ్లాస్గోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఓ క్రీడ చాలా మంది భారతీయులకు ఆశ్చర్యం కలిగించింది. ఇదేదో.. మన పల్లెల్లో పిల్లలు ఆడే గోలీల ఆటలా ఉందే అనుకున్నారు. పరీక్షించి చూస్తే.. పచ్చని మైదానం.. చుట్టూ గట్టు కట్టినట్లుగా ఏర్పాటు. మైదానానికి ఓ వైపున ఆటగాళ్లు నిలుచుని మరోవైపున గల ఓ చిన్న బంతిని లక్ష్యంగా చేసుకొని బంతుల్ని దొర్లిస్తున్నారు. ఈ బంతులు కొన్ని అవతలి వైపున గల బంతికి తగులుతుండగా, మరికొన్ని దాని సమీపంలోకి వెళ్తున్నాయి. చివరికి దీన్ని ‘లాన్ బౌల్స్’ అంటారని, మనవాళ్లూ ఇందులో ఆడుతున్నారని అర్థమైంది. ఇంతకీ ఏంటీ లాన్ బౌల్స్..!
 
క్రీడలంటేనే శరీర దారుఢ్యం, ఫిట్‌నెస్‌లపై ఆధారపడివుంటాయి. కానీ, క్రీడాకారులకు ఉండాల్సిన ఫిట్‌నెస్ లేకపోయినా, శరీర పరిమాణం ఏ స్థాయిలో ఉన్నా, అంగవైకల్యం ఉన్నవారైనా.. వయసులో తేడాలున్నా.. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడగలిగే క్రీడ లాన్ బౌల్స్. లాన్ (మైదానం)లో నిలుచున్న స్థానం నుంచి బంతిని లక్ష్యానికి దగ్గరగా బౌల్ (దొర్లించడం) చేయడమే ఈ ఆట.
 
అటు జాక్.. ఇటు బాల్
 
చతురస్రాకారంలో ఉన్న, చుట్టూ తక్కువ ఎత్తులో గోడ నిర్మించిన మైదానంలో లాన్ బౌల్స్ క్రీడను ఆడతారు. మైదానం మధ్యలో బంతిని దొర్లించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని ‘రింక్’ అని, లక్ష్యంగా పేర్కొంటూ మరో వైపున ఉంచే బంతిని ‘జాక్’ అని పిలుస్తారు. ఆటగాడు మైదానం గోడ అంచున ప్లాస్టిక్ మ్యాట్‌పై నిలబడి జాక్ దిశగా బంతిని దొర్లిస్తాడు. అది సింగిల్స్ మ్యాచ్ అయితే ఇద్దరు ఆటగాళ్లు నాలుగు చొప్పున బంతుల్ని బౌల్ చేస్తారు. తొలి ఆటగాడు నాలుగు బంతుల్ని బౌల్ చేశాక ప్రతి బంతికి, జాక్‌కు మధ్య దూరాన్ని కొలుస్తారు.

ఆ తరువాత రెండో ఆటగాడు తన బంతుల్ని దొర్లిస్తాడు. జాక్‌తో అతని బంతులకు మధ్య గల దూరాన్ని కొలిచాక.. మొత్తంగా ఎవరు జాక్‌కు అతి సమీపంగా బౌల్ చేయగలిగారో, వారే విజేత అవుతారు. ఇందులో సింగిల్స్‌తోపాటు డబుల్స్, ట్రిపుల్స్, నలుగురు ఆటగాళ్లు తలపడే కేటగిరీలు ఉంటాయి. ఆయా కేటగిరీలను బట్టి ఆటగాళ్లు బౌల్ చేసే బంతుల సంఖ్య ఉంటుంది. ఓస్.. ఇంతేనా! అనుకుంటే కుదరదు. ఇందులో ఉపయోగించే బంతులు క్రికెట్ బంతుల్లా అంత తేలిగ్గా దొర్లుకుంటూ వెళ్లవు.
 
బంతులకు రింగులు...

 
లాన్‌పై బౌల్ చేసే బంతులు ప్రత్యేకంగా తయారవుతాయి. బంతికి రెండు వైపుల రెండు రింగుల్ని ఏర్పాటు చేస్తారు. ఒకవైపు రింగు పెద్ద సైజులో ఉంటే, మరోవైపు చిన్నసైజు రింగు ఉంటుంది. దీంతో బంతిని బౌల్ చేసినప్పుడు అది నేరుగా దొర్లకుండా.. వక్రమార్గంలో వెళ్తుంది. అందుకే జాక్‌ను గురిచూసి బంతిని దొర్లించినా.. సమీపంలోకి వెళ్లడమన్నది అంత తేలిగ్గా జరగదు. బంతిపైనా, అది ప్రయాణించే మార్గంపైనా నియంత్రణతో బౌల్ చేయడమే ఈ క్రీడలోని అసలు నైపుణ్యం.
 
14వ శతాబ్దంలో వెలుగులోకి..
 
ప్రపంచంలోని ప్రాచీన క్రీడల్లో లాన్ బౌల్స్ కూడా ఒకటి. ఈజిప్టులో వేల సంవత్సరాల క్రితమే ఈ క్రీడను ఆడినట్లుగా చెబుతారు. అయితే ఇది వెలుగులోకి వచ్చింది మాత్రం 14వ శతాబ్దంలో. అయితే అంతకుముందే 1299లో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో ఈ క్రీడ పేరిట క్లబ్ ఏర్పాటైంది. 1588లో ఇంగ్లండ్ నావికుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ తొలిసారిగా ఈ క్రీడను నిర్వహించాడు. ఆ తరువాత బ్రిటిష్ పాలిత దేశాల్లో ఇది వ్యాప్తి చెంది.. ప్రపంచ బౌల్స్ సమాఖ్య ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సమాఖ్యలో 51 సభ్యదేశాలు, 55 బౌల్స్ అథారిటీలు ఉన్నాయి. లాన్‌బౌల్స్‌ను 1930లో కామన్వెల్త్ క్రీడల్లో చేర్చగా.. 84 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది.
 
భారత్‌లో పరిస్థితి...

పేరుకు లాన్ బౌల్స్ అయినా.. ఇలాంటి తరహా ఆటలు మన పల్లెల్లో పురాతన కాలం నుంచీ ఆడుతూ వస్తున్నవే. అయితే అంత ర్జాతీయ స్థాయిలో లాన్ బౌల్స్‌లో మనవాళ్లు ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడినా.. పతకం దాకా అయితే రాలేకపోయారు. ఇక ఇటీవల గ్లాస్గోలో మెన్స్ ఫోర్ కేటగిరీలో పోటీపడి సెమీఫైనల్‌కు చేరుకున్నారు. కానీ, సెమీస్‌లో ఓడడంతోపాటు కాంస్య పతక పోరులో కొద్ది తేడాతో ఓడిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో మున్ముందు పతకాలు సాధిస్తే లాన్ బౌల్స్.. భారత్‌లోనూ ప్రాచుర్యం పొం దే అవకాశం ఉంది.    
 
 - శ్యామ్ కంచర్ల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement