వేసవిలో శరీరానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా తీక్షణమైన సూర్యకిరణాల (అల్ట్రా వయెలెట్ కిరణాల) తాకిడికి ప్రభావితమయ్యే తలపై కేశాల(జుట్టు) సంరక్షణ మరింత అవసరం. బయటకి వెళ్లేటప్పుడు గొడుగు లేదా క్యాప్ వినియోగించడం లాంటి తెలిసిన జాగ్రత్తలతో పాటు ఆహారపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. నగరానికి చెందిన చర్మసంరక్షణ వైద్యులు, అడ్వాన్స్‌డ్ హెయిర్ స్టూడియోకి చెందినకేశ సంరక్షణ నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలు మీకోసం..
♦ శరీరంలో తగినంత ద్రవాహారం లేకపోతే కేశాలు తమ మెరుపును కోల్పోతాయి. అలా కాకుండా ఉండాలంటే నీరు సమృద్ధిగా తాగాలి. తగిన తేమ శాతం ఉందేందుకు నీరు బాగా లభించే పుచ్చకాల వంటి పండ్లు ఎక్కువగా తినాలి.
♦ కేశాల ఆరోగ్యానికి ప్రొటీన్స్ ఉన్న ఆహారం చాలా అవసరం. అయితే, ప్రొటీన్స్ అధికంగా ఉండే ఆహారంతో శరీరానికి వేడి చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి గుడ్లు, పప్పులు, కాయ ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి వేసవి నష్టాలను తగ్గిస్తాయి.
♦ వెంట్రుకలు ఊడిపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటిగా చెప్పొచ్చు. ఐరన్ పుష్కలంగా లభించే ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. విపరీతమైన వేడి ద్వారా దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేసి వెంట్రుకలకు ఆరోగ్యాన్నిస్తుంది.
♦ కూల్‌డ్రింక్స్ అధికంగా తీసుకుంటే వాటిలోని కృత్రిమ రసాయనాలు, సుగర్స్ కేశాలకు హాని చేయవచ్చు. దానికి బదులు సహజంగా లభించే వాటితో కొబ్బరి నీరు, చెరుకురసం, పుచ్చకాయలు, లిచీ పండ్లు వంటి వాటిలో ఉండే మినరల్స్ కేశాలకు రక్షణ కవచంగా పనిచేస్తాయి.
♦ స్‌పైసీగా ఉండే ఆహార పదార్థాలు శరీర ఉష్టోగ్రతను పెంచడంతో పాటు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల చర్మంతో పాటు కేశాలకూ నష్టమే. దీనికి బదులుగా కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరానికి తగినంత చల్లగా ఉంటుంది. స్‌పైసీ కన్నా గ్రిల్డ్/తందూరీ ఆహార పదార్థాలు మంచివి.
మసాజ్ మంచిదే..
కొబ్బరి నూనె కేశాలకు ఎంత మేలు చేస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే అలొవీరాలో ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్ బాగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. ఈ రెండూ మేళవించిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.. వీటిని వినియోగించాలి. వేసవిలో నీటిలో ఉప్పుశాతం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కేశాలు రఫ్‌గా, బిరుసుగా మారతాయి. కొబ్బరి, అలోవీరా కలిసిన నూనెతో సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాదు ఇది కేశాలు సహజంగా హైడ్రేట్ అయ్యే విధంగా, వాటి పీహెచ్ బ్యాలెన్స్‌ను సమతుల్యం చేయడంలో సహకరిస్తుంది. తలపై భాగంలోని మృతకణాలకు ఇది మరమతు చేస్తుంది. సూర్య కిరణాల ధాటికి నిర్జీవంగా మారిన కేశాలను మెరిపించి, మృదువుగా మారుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment