జుట్టు జిడ్డుగా మారుతుంటే..!
బ్యూటిప్స్
వేసవిలో జుట్టు సంరక్షణ పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఎండతాకిడి, చెమట, పదే పదే నీళ్లతో శుభ్రపరచుకోవడంతో పొడిబారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ కాలం వెంట్రుకల నిగారింపు తగ్గకూడదంటే...
* ఎండవేళలో బయటకు వెళ్లేటప్పుడు స్కార్ఫ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. లేదంటే నేరుగా సూర్యకాంతి పడి అతినీలలోహిత కిరణాల వల్ల మాడుపై ఉన్న సహజ మాయిశ్చరైజింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల వెంట్రుకలు పొడిబారి నిస్తేజంగా మారడం, రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
* ఉక్కగా ఉంది కదా అని ముడేసి బిగుతుగా కట్టేయడం వల్ల వెంట్రుకలు దెబ్బతిని, రాలిపోయే సమస్య పెరుగుతుంది. వీలైనంత సౌకర్యంగా ఉండే వదులు కేశాలంకరణనే ఎంపిక చేసుకోవాలి.
* ఉక్కపోతతో తరచూ తల తడపడం వల్ల మాడుపై ఉండే సహజ నూనె గ్రంథులు అద నపు నూనెను స్రవిస్తాయి. దీని వల్ల జుట్టు మరీ జిడ్డుగా మారుతుంది. అలాగని రోజూ షాంపూ వాడకుండా దానికి బదులుగా మొక్కజొన్న గంజిని ఉపయోగించి తలను శుభ్రపరచుకోవచ్చు.
* జుట్టును ఆరబెట్టుకోవడానికి ఈ కాలం డ్రయ్యర్‌ని ఉపయోగించకపోవడమే మేలు. అలాగే జుట్టును ఫ్లాట్ ఐరన్ చేయడం, రింగులుగా మార్చడం వంటి హెయిర్ స్టైల్స్ శిరోజాలను పొడిబారేలా చేస్తాయి. దీనివల్ల జుట్టు కండిషనింగ్ దెబ్బతిని త్వరగా రాలిపోతుంది.