చేనేతకు శిల్పకళ
టాప్ మోడల్‌గా పేరు తెచ్చుకున్నాక అదే గొప్ప అనుకొని అక్కడితో విశ్రాంతి తీసుకుంటారు చాలామంది. కానీ, ఆమె అలా కాదు. పెళ్లయిన తర్వాతా ‘మిసెస్ ఇండియా’ కిరీటం దక్కించుకున్నారు. ప్రసిద్ధ మోడల్స్ ఎందరో కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌లో స్థానం పొందడం కలగా భావిస్తారు. ఆ కలను ఆమె నిజం చేసుకున్నారు. పట్టుబట్టి ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ అయ్యారు. నృత్యకారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఫ్యాషన్ డిజైనర్‌గా ఈఫిల్ టవర్‌పై తెలుగు చేనేత వైభవాన్ని చాటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రత్యేకతను సాధిస్తూ తనను తాను మలచుకోవడం శిల్పారెడ్డి ఘనత.
సౌందర్య ‘శిల్ప’ సూత్రాలు..
► మన శరీరానికి ఏది నప్పుతుందో తెలుసుకోవాలంటే మన శరీరం మనకే తెలిపే భాషను అర్థం చేసుకోవాలి. దానిని బట్టి సౌకర్యంగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి.
► ఎక్కువ డబ్బు ఖర్చుపెడితేనే ఫ్యాషనబుల్‌గా ఉండగలం అని చాలా మంది అనుకుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. శరీరాకృతి, వ్యక్తిత్వాన్ని బట్టి తయారవడం ఈ రోజుల్లో తప్పనిసరి.
► అన్నీ బ్రాండెడ్ దుస్తులే వేసుకోవాలనుకోకూడదు. అలా వేసుకోవడమూ సరైనది కాదు. ఇండియన్-వెస్ట్రన్ స్టైల్స్‌ని మిళితం చేస్తూ చాలా రకాలుగా ధరించవచ్చు. అప్పుడే స్టైల్‌గా కనబడతారు.
► నడుము కింది భాగం పెద్దగా ఉంటే పై టాప్ మోకాళ్ల కిందవరకు ధరించడం, ఛాతీ పరిమాణం పెద్దగా ఉంటే హై నెక్స్ జోలికి వెళ్లకపోవడం.. వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
► మనవారి చర్మ రంగుకు ఎరుపు, నారింజ, పచ్చ.. ముదురు రంగులూ బాగా నప్పుతాయి. వీటిలో అన్ని షేడ్స్‌నూ ఎంచుకోవచ్చు.
► అలంకరణలో రంగురంగుల పూసల ఆభరణాలు ఇటీవల కాలంలో ముందువరసలో ఉన్నాయి.
పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. హైదరాబాద్‌లోని పేజ్ 3 పీపుల్ జాబితాలో ముందువరసలో ఉండే శిల్పారెడ్డి సోషలైట్‌గానూ గుర్తింపు పొందారు. గృహిణిగా, తల్లిగా, సాధికారత గల మహిళగా శిల్పారెడ్డి చెప్పే మాట - ‘‘మహిళ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. నేను డిజైన్ చేసిన దుస్తుల్లో ఆమె మరింత ఉన్నతంగా కనిపించాలి’ అని. అందుకే మహిళను ఆత్మవిశ్వాసంతో చూపే బ్లేజర్స్ అంటే చాలా ఇష్టమని చెప్పే ఈ మోడల్ ఇటీవల తెలుగుదనపు చేనేతను ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌ైపై మెరిపించారు. అక్కడ జరిగిన ఫ్యాషన్ షోలో తను డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించారు. దాని వెనక దాగున్న తన కృషిని తెలియజేశారు.
ప్యారిస్ అనుభవాలు...
‘‘వివిధ దేశాలకు చెందిన పది మంది ప్రసిద్ధ డిజైనర్లు ప్యారిస్ ఫ్యాషన్ షోలో తమ వస్త్ర వైవిధ్యాలను ప్రదర్శించారు. అందులో మన దేశం తరపున నేను ఒక్కదాన్నే పాల్గొన్నాను. మన దేశ సంస్కృతి, వారసత్వ వైభవం అక్కడ ప్రదర్శించే అవకాశం నాకు రావడం చాలా గర్వంగా అనిపించింది. మన చేనేతకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న మట్కా ఫ్యాబ్రిక్ ప్యారిస్‌లో హొయలు పోవడం, అందరి నుండి ప్రశంసలు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి. ఇండియా అనగానే గొప్పదైన మన చేనేత ప్రపంచ దేశాల ప్రజల మదిలో తప్పక మెదులుతుంది. ఈఫిల్ ఫ్యాషన్ షో అవకాశం రాగానే ముందుగా ఎలాంటి తరహా డిజైన్లు బాగుంటాయని చాలా శోధించాను. ఈఫిల్ టవర్ ఐరన్‌తో నిర్మించిన అతిపెద్ద కట్టడం. దానికి తగ్గట్టుగా ఒక వారసత్వ అంశాన్ని జోడించాలి. అలాగే ప్రస్తుతకాలానికి ఏది బాగా నప్పుతుందో చూడాలి. ఆ విధంగా తెలంగాణ చేనేతకారుల్లో రూపుదిద్దుకునే మట్కా ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నాను. దానికి కొంత రస్టిక్ గోల్డ్ ఎలిమెంట్స్ జోడించాను. ప్యారిస్‌లో పూర్తి చలికాలం కావడంతో దుస్తులకు ఫుల్ స్లీవ్స్ జత చేశాను’’ అంటూ తను డిజైన్ చేసిన దుస్తుల గురించి, ప్రశంసల గురించి ఆనందంగా వివరించారు శిల్పారెడ్డి.
చేనేత.. ఇప్పుడంతా యువతదే!
‘‘ఫ్యాషన్ అనగానే చాలా మంది గ్లామర్ మాత్రమే అని అపోహపడుతుంటారు. అలా కానే కాదు. మన నేల గొప్పతనాన్ని చాటే వేదిక ఫ్యాషన్. మనదైన కళను ముందు తరాలకు అందజేసేది ఫ్యాషన్. చేనేత దుస్తులు వయసు పైబడినవారు మాత్రమే ధరించేది అని నిన్న మొన్నటి వరకు భావించేవారందరూ. కానీ, నేడు యువతరం ఫ్యాషన్ అంతా చేనేత చుట్టూనే ఉంది. మనదైన ఫ్యాబ్రిక్‌తో యువతరం మెచ్చే ఎన్నో డిజైన్లు సృష్టించవచ్చు. అదే నేను చేసింది. ప్యారిస్‌లో జరిగిన ఫ్యాషన్ షో కోసం మొత్తం 16 డ్రెస్సులు సృష్టించాను. వాటిని అక్కడి వరకు తీసుకెళ్లి, అక్కడి మోడల్స్ చేత ధరింపజేసి, వేదిక మీద ప్రదర్శించాను. వాటిని తయారు చేయడానికి 2 నెలలకు పైగా సమయం పట్టింది. ఇంటి బాధ్యతలు చూస్తూనే అంకితభావంతో డిజైన్స్ సృష్టించాను’’ అంటూ ఇష్టంగా చేసిన శ్రమను, చేనేత చుట్టూ అల్లుకుపోయిన జీవితాల గురించి ప్రస్తావించారు ఈ ఫ్యాషన్ డిజైనర్!
డిజైన్లలో మనదైన ముద్ర
‘‘ఫ్యాషన్ పరిశ్రమలో సృజనాత్మకతకే పెద్ద పీట. అలాగే డిజైనర్‌కి మంచి నెట్‌వర్క్ ఉండాలి. దానికి తోడు తాము సృష్టించే డిజైన్లకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఎలిమెంట్‌ను, మనదైన వారసత్వ అంశాన్ని జోడించాలి. అప్పుడే డిజైనర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందగలరు’’ అంటూ ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టేవారికి సూచనలు ఇచ్చారు శిల్పారెడ్డి. ‘‘నేడు ఎంతోమంది డిజైనర్స్ ఉన్నారు. ఇంకా ఎంతో మంది కొత్త డిజైనర్లు పుట్టుకువస్తున్నారు. వీరంతా ఇప్పుడు మన కాటన్స్‌ని యువతరం ఫ్యాబ్రిక్‌గా కీర్తిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. పాశ్చాత్య దుస్తులకే మనదైన కాటన్‌ని జత చేస్తే ఖరీదులోనూ అందరికీ అందుబాటులోకి తీసుకురాగలరు. ఇందుకు కొంత సృజనాత్మకత చూపాలి’’ అంటారు ఆమె. మట్కా డిజైన్స్‌తో విదేశాలలోనూ అదరగొట్టిన శిల్పారెడ్డి తదుపరి తన డ్రెస్ డిజైన్లను ఖాదీ, సిల్క్‌తో రూపుకట్టడానికి సిద్ధమవుతున్నారు. చేనేత పట్ల తనకున్న అభిమానం గురించి తెలియజేస్తూ - ‘‘గతంలోనూ ఎక్కువగా చందేరి, అన్‌బ్లీచ్డ్ కాటన్‌తో దుస్తులను డిజైన్ చేశాను. చేనేత దుస్తులకు ఎక్కడికెళ్లినా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీని గురించి ఒక కథ చెప్పినట్టుగా ఎక్కడైనా పరిచయం చేయవచ్చు. చేనేతకారులకు చేయూతనివ్వడానికి ఇదో మంచి అవకాశం...’ అని తెలియజేశారు.
నూటికి నూరు శాతం అంకితభావం..
ఒకటి సాధించామని అంతటితో ఆగిపోతే ప్రయాణంలో మజా ఉండదు అంటారు శిల్పారెడ్డి. మోడల్‌గానూ, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌గానూ పేరున్న ఆమె నాలుగేళ్ల క్రితం నగరంలో ‘శిల్పారెడ్డి డిజైనర్ స్టూడియో’ ప్రారంభించారు. ఇంతేకాదు పోషకాహార నిపుణురాలిగానూ వ్యవహరిస్తున్నారు. వ్యాయామాలు, ఇంటిపనులు, డిజైనింగ్ పనులు .. మల్టీ టాస్కింగ్‌గా ఇన్ని పనులను చేయడంలో కృషిని తెలియజేస్తూ.. ‘‘నాకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని పెంచుకుంటూ వెళ్లడం ఇష్టం. పెందరాళే నిద్రలేస్తాను. రాత్రి పదిలోపు నాకున్న బాధ్యతలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. మా బాబుకు నాలుగేళ్లు. వాడితోనూ తగినంత సమయం గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. ఏడాదిలో రెండు ట్రిప్‌లు మా వారితోనూ, మరో రెండు ట్రిప్‌లు ఫ్యామిలీ మొత్తం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. తల్లిగా, ఇల్లాలిగా.. ఎక్కడా లోపం రానివ్వను. ఏ పని చేసినా నూటికి నూరు శాతం అంకితభావంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అంటూ నవ్వుతూ వివరించారు ఈ ఎనర్జిటిక్ ఉమన్.
- నిర్మలారెడ్డి