హ్యాపీ కెమికల్స్‌ అన్‌లిమిటెడ్‌ | Happy Chemicals Unlimited | Sakshi
Sakshi News home page

హ్యాపీ కెమికల్స్‌ అన్‌లిమిటెడ్‌

Published Wed, Jan 11 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

హ్యాపీ కెమికల్స్‌ అన్‌లిమిటెడ్‌

హ్యాపీ కెమికల్స్‌ అన్‌లిమిటెడ్‌

చక్కిలిగింతల ఫ్యాక్టరీ

మీకు తెలుసా?
మన బాడీలో చక్కిలిగింతల ఫ్యాక్టరీ ఉంది.
బాధనూ, కష్టాన్ని అమాంతం మింగేసేంత
చక్కటి చక్కిలిగింతల ఫ్యాక్టరీ ఉంది.
ఈ కెమికల్‌ ఫ్యాక్టరీలో సంతోషాల మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ జరుగుతూ ఉంటుంది.
ఎండార్ఫిన్, డోపమైన్, సెరిటోనిన్, నార్‌ ఎపీనెఫ్రిన్‌
వగైరా వగైరా వంటి చక్కటి చక్కిలిగింతలను మనకు మనమే తయారు చేసుకుంటాం.
ఈ గింతల్ని ఎంతగా తయారు చేసుకుంటామో...
అంతగా ఆనందంతో గెంతులు వేయగలుగుతాం.
ఈ ఆనందాల గెంతులను వేయించే చక్కిలిగింతల రసాయనాల గురించే ఈ కథనం.
ఆనందం కలిగించే పరిసరాల్లో ఉంటే మనమూ ఆనందంగా ఉంటామని అర్థం.
అంతకంటే గొప్ప పరమార్థం ఏమిటంటే...
మనమే ఆ ఆనందాల కొలను అయితే
అందరూ మన దగ్గరికి వచ్చి ఆనందదాహాన్ని తీర్చుకుంటారు. బీ హ్యాపీ... మేక్‌ హ్యాపీ..



రోడ్డు మీద ఇరువైపులా వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఒక వృద్ధురాలు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతోంది. మీరు అదే దారిలో వెళ్తున్నారు. ఆమె పడుతున్న ఇక్కట్లను గమనించారు. మీ పని కాకపోయినా ఆమెను రోడ్డు దాటించి మళ్లీ ఇవతలకు వచ్చారు. మీలో మీరు గమనించిన అంశం ఏమిటి? ఆ పని చేసినందుకు మీకెంతో సంతోషం అనిపించింది. రాజుకు 104 డిగ్రీల జ్వరం. వాళ్ల నాన్న రాజును డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఆప్యాయంగా చూసి రాజును పరామర్శించాడు. తాను రాసిన మందులతో జ్వరం తగ్గిపోతుందని చెప్పాడు. ఇంకా మందులు వాడనే లేదు... అంతలోనే జ్వరం 100 డిగ్రీలకు పడిపోయింది. కారణం... ఆనందం! ఆ ఆనందానికి అసలు కారణం... మెదడులోని ఒక ప్రాంతం! దాని పేరే రివార్డ్‌ సెంటర్‌. అదే ప్లెజర్‌ సెంటర్‌. అక్కడ ఎండార్ఫిన్‌ అనే సంతోషం కలిగించే ఒక జీవరసాయనం ఉత్పన్నమైంది. అది సంతోషాన్ని కలిగించింది. ఆ సంతోషం సానుకూలత పెంచింది. దాంతో అంతా సవ్యమే. అంతా సంతోషమే.

సంతోష రసాయనాన్ని కనుగొన్నదెలా?
మన శరీరంలో సంతోషం కలిగించే రసాయనాల్లో ఒకదాన్ని 1992లో మెకలమ్‌ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. సంతోషం కలిగించే ఆ రసాయనం పేరేమిటో తెలుసా? ‘ఆనందమైడ్‌’. సంతోషానికి భారతీయ భాషల్లో మరోమాట ‘ఆనందం’. ఆ పేరిటే దానికి ‘ఆనందమైడ్‌’గా పేరు పెట్టారు.ఆనందమైడ్‌లాంటి రసాయనాలెన్నో కనుగొన్నారు. వాటిలో కొన్ని: ∙ఎన్‌. ఆరాకిడోనోయల్‌ డోపమైన్‌ (ఎన్‌ఏడీఏ) నలడోయిన్‌  అరాకిడోనోయల్‌ గ్లెసెరాల్‌ ∙వైరోడ్‌హమైన్‌ వంటివి ఎన్నెన్నో ఉన్నాయి.

డ్రగ్స్‌కు మూలం ఇవే...
ఆనందాన్ని కలిగించే పైన పేర్కొన్న ఎన్‌ఏడీఏ, నలడోయిన్, అరాకిడోనోయల్‌ గ్లెసరాల్‌ వంటి వాటితో పాటు ఎండార్ఫిన్‌ల వంటివి మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంటాయి. ఆ రసాయనాలు కలిగించే ప్రభావాలనే కొన్ని మొక్కల నుంచి తీసిన రసాయన పదార్థాల నుంచీ పొందవచ్చు. ఈ రసాయనాలను ‘కెనాబినాయిడ్స్‌’ అంటారు. వీటి ద్వారా ఒక రకమైన సంతోషం (యుఫోరియా), ఒక రకమైన ప్రశాంతత (ట్రాంక్విలిటీ) కలుగుతుంది. అవి ఉత్సాహాన్ని పెంచి, బాధను తగ్గిస్తాయి. అందుకే ఈ ఫలితాలను స్వాభావికంగా కాకుండా... ఏదైనా మందు వంటి దాని సహాయంతో పెంచుకోడానికి ప్రయత్నిస్తారు. అలాంటి మందును సాధారణ పరిభాషలో డ్రగ్స్‌ అంటుంటారు. ఉదాహరణకు మార్జువానా అనే డ్రగ్‌తో ఇలాంటి ఫలితాలే వస్తుంటాయి.

డ్రగ్స్‌ లాంటివే మరికొన్ని...
కెనాబినాయిడ్స్‌ను పోలినవే మరికొన్ని పదార్థాలు ఉన్నాయి. వాటిని ఓపియాయిడ్స్‌ అంటారు. అంటే ఓపియమ్‌ను తీసుకున్నప్పుడు కలిగే ఫలితాలను అవి కలిగిస్తాయి కాబట్టి వాటికి ఆ పేరు. వీటిని 1970లో కనుగొన్నారు. ఉదాహరణకు ఎన్‌సెఫాలిన్స్, డైనార్ఫిన్స్‌... ఇవన్నీ ఆ కోవలోకి వచ్చే మందులే. ఈ ఓపియాయిడ్స్‌... నొప్పిని తగ్గించడం, హుషారును పెంచడం, జ్ఞాపకశక్తిని పెంపొందించడం వంటివి చేస్తాయి. విచక్షణ లేకుండా వాడితే అవి డ్రగ్స్‌. కానీ ఎప్పటికీ తగ్గని (టెర్మినల్‌ ఇల్‌నెస్‌తో బాధపడే) క్యాన్సర్‌ పేషెంట్లలో నొప్పిని తగ్గించడానికి లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ప్రయోజనం కోసం (పర్పస్‌ఫుల్‌గా) వాటిని డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో వాడితే అవి బాధానివారకాలు అవుతాయి.

మన దేహంలోనే ఆ అనేక రసాయనాలు
ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా సంతోషాన్ని కలిగించే రసాయనాలు మన మెదడులో ఉత్పత్తి అవుతాయి. అలా మన శరీరంలోనే ఉత్పత్తి అయ్యే ఆనందకారకాలను ‘ఎండోజినస్‌ కెనాబినాయిడ్స్‌’ అని పేర్కొంటారు. అవి మెదడుపై పనిచేసి మనకు సంతోషాన్ని ఇస్తాయి. ఆందోళనను, దుఃఖాన్ని తగ్గించే ఇలాంటి ప్రభావాలనే మెదడులో స్రవించే డోపమైన్, సెరిటోనిన్, నార్‌ ఎపీనెఫ్రిన్‌ వంటివి రసాయనాలు కలగజేస్తాయి.

ఇదొక క్లాసిక్‌ ఉదాహరణ...
మనలో చాలా మంది వ్యాయామం చేసే వాళ్లుంటారు. వ్యాయాయంతో కలిగే నొప్పుల వల్ల వాళ్లకు ఎంతో ఆనందం కలుగుతుంది. నిజానికి వ్యాయామం పూర్తి కాగానే ఒంట్లో ఓపియాయిడ్స్, కెనాబినాయిడ్స్‌ పాళ్లు పెరిగి మనకు తెలియని ఉత్సాహమూ, చురుకుదనం పెరగడం స్పష్టంగా కనిపిస్తుంటుంది. తాము చేసిన వ్యాయామంతో తమకు ఆరోగ్యం సమకూరిందనే సంతోషం వాళ్లను మరింతగా హుషారుగా ఉంచుతుంది. ఈ సంయుక్త ప్రభావాలన్నీ మన రోగ నిరోధక శక్తి మీద ప్రభావం చూపుతాయి. వ్యాయామంతో పాటు... దాని వల్ల కలిగే ఆనందం కలగలిసి ‘ఒక దానికి మరొకటి ఫ్రీ’ అన్నట్లుగా రోగనిరోధక శక్తిని పెంచి... మరింత ఆరోగ్యం కలగజేస్తాయి.

అది నెగెటివ్‌ యాటిట్యూట్‌
ఏదైనా మంచి పని చేసినప్పుడూ... రివార్డింగ్‌ సెంటర్‌ లో డోపొమైన్‌ పాళ్లు పెరిగి... ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ కలిగి ఆనందం ఇస్తుంది కదా. మరి ఏం చేయాకపోయినా అలాంటి సంతోషమే కావాలనుకుంటే... అది అత్యాశ అవుతుంది. ఈ అత్యాశ ధోరణులతోనే ఆనందం కోసం పెడదారులు పట్టే వాళ్లూ ఉంటారు. వాళ్లు మెదడులోని జీవరసాయనాలను దేహంలోని  అంతర్భాగంలో స్వాభావికంగా పుట్టకుండానే ఆనందానుభూతులను బయట నుంచి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. రివార్డ్‌ సెంటర్‌ నుంచి వచ్చే డోపమైన్‌ పెరిగేందుకు కొన్ని మాదక ద్రవ్యాలనూ, మద్యాన్ని తీసుకుంటారు. అవి తీసుకున్న తర్వాత మొదట కాసేపు డోపమైన్‌ ఉత్పన్నమైనప్పటి అనుభూతే కొద్దిసేపు మాత్రమే అంటే పరిమిత సమయం పాటు కలుగుతుంది. ఆ ఆనందపు ప్రవాహంలో ఎప్పుడూ కొట్టుకుపోవాలనే ఉద్దేశంతో కొంతమంది మద్యానికీ, మాదకద్రవ్యాలకూ బానిసలవుతుంటారు. ఇది నెగెటివ్‌ అంశం.

భావోద్వేగాలూ అంటుకుంటుంటాయి
భావోద్వేగాలు కూడా ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంటాయి. నెగెటివ్‌ భావోద్వేగాలు... అంటే క్రోధం, ఆగ్రహం వంటికి వాటితో పక్కన ఉండే వారి మూడ్స్‌ కూడా పాడవుతాయి. ఉదాహరణకు ఒక గదిలో ఒకరు కోపంగా ఉన్నారని అనుకుందాం. ఆ ఆగ్రహం కారణంగా అందరూ ముభావంగా మారిపోతారు. తెలియని టెన్షన్‌ ఆ వాతావరణంలో నెలకొని ఉంటుంది. దాన్ని వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నిస్తుండటం మామూలే. వాతావరణం తేలిక కాగానే అందరిలోనూ ఒక రిలీఫ్‌!

అలాగే ఒక గదిలో అంతా సంతోషంగా ఉంటే... ఆ ఆనందం కూడా అందరితోనూ షేర్‌ చేసుకుంటూ ఉంటే అది మరింత పెరుగుతుంది. ఒకరి ఆనందం కారణంగా పక్కవారూ సంతోషంగా ఉంటారు. ఏదైనా శుభవార్త తెలియగానే అది ఇతరులకు ఆనందం కలిగించేదే అయినా అందరూ ఆనందించే విషయం తెలిసిందే. అలా ఆనందం రెట్టింపవుతూ ఉంటుంది. అందుకే ఆనందంగా ఉండండి. దాన్ని ఇతరులకు పంచుతూ ఉండండి. ఆనందం కలిగించే రసాయనాలు శరీరంలో పెరిగినప్పుడు నొప్పి తగ్గిపోతుండటం గమనించే ఉంటారు. అలా సంతోషం కలిగే రసాయనాలు మెదడులో ఉత్పన్నమవుతున్నప్పుడు ఒంట్లో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దాంతో అనేక వ్యాధులను తట్టుకోవడం సాధ్యమవుతుంది. సంతోషంగా ఉన్న వ్యక్తి తన సమస్యలనూ, ఒత్తిడిని తేలికగా అధిగమించగలుగుతాడు. బాధను తట్టుకునే శక్తి పెరుగుతుంది.  దాంతో విజయం వైపు పురోగమిస్తాడు. అలా అందరూ సంతోషంగా ఉండే సమాజం అభివృద్ధి వైపునకు పుగోగమిస్తుంది.కాబట్టి హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ ఉండండి. ఆనందంగా ఉండండి. ఆ ఆనందాలను మరో నలుగురికి పంచండి. దాంతో గెలుపు మీ సొంతం.

మెదడులోని ఆ ప్రత్యేక ప్రదేశం పేరే ప్లెజర్‌ సెంటర్‌
అల కంఠమునకెగునవ ప్రదేశమ్ములో... ముఖం వెనక తల అంతర్భాగ పురంలో... సెరిబ్రోస్పైనల్‌ఫ్లుయిడ్‌ సరస్సులో... ఆ సరోవర మధ్యభాగాన తేలియాడుతున్న ఆ మెదడు సౌధమ్ములో...  ఒక స్పెషల్‌ సెంటర్‌ ఉంటుంది. మాట్లాడేలా చేసేందుకు స్పీచ్‌ సెంటర్, చూపు జ్ఞానాన్ని కలిగించేందుకు విజువల్‌ సెంటర్‌ లాగే... మెదడులో ఉండే ఆ కేంద్రం పేరే ‘రివార్డింగ్‌ సెంటర్‌’. ఉదాహరణకు ఒక వ్యక్తి జీవన వికాస క్రమంలో ఇది ఏర్పడుతుంది. ఎవరో ఒక స్కూలు పిల్లాడు తన పుస్తకాన్ని పోగొట్టుకున్నాడు. మరో విద్యార్థికి ఇది దొరికింది. దాన్ని భద్రంగా తీసుకొచ్చి సొంతదారుకు అప్పజెప్పాడు. అప్పుడు టీచర్‌ ఆ చర్యను మెచ్చుకున్నారు. ఆ మెప్పుకోలు ఒక రివార్డ్‌. దాంతో మెదడులోని రివార్డ్‌ సెంటర్‌నుంచి కొన్ని సంతోష రసాయనాలు వెలువడ్డాయి. అలా ప్రతివారికీ తమకు సంతోషం కలగజేసే అంశం వృద్ధి చెందుతూ ఉంటుంది. విజయం కలిగినప్పుడు, మంచి పనిచేసినప్పుడు, ఇతరులను సంతోషపెట్టినప్పుడు... ఇలా ఆ పలు సందర్భాల్లో ఆ రివార్డ్‌ సెంటర్‌ నుంచి కొన్ని రసాయనాలు వెలువడి ఒక ఉల్లాసభరితమైన అనుభూతిని కలిగిస్తుంటాయి. అదే అనుభూతికి మళ్లీ మళ్లీ పొందడానికి ఆ విద్యార్థి ఆ మంచి పనులను పదే పదే చేస్తుంటాడు. ఇది సానుకూల ప్రక్రియ. ఇలా మంచిపనుల ద్వారా ఆనందాలు  పొందవచ్చనే సానుకూలమైన దృక్పథం పెరిగి ఒక మంచి ప్లెజర్‌సెంటర్‌ రూపొందుతుంది. మంచి పనులు చేసినప్పుడల్లా అది ఆనందాల రివార్డ్‌ ఇచ్చే ‘రివార్డ్‌ల కేంద్ర’మూ అవుతుంది.

పాజిటివ్‌గా సంతోషాన్ని పొందడం ఎలా?
మద్యం, మాదకద్రవ్యాల వంటి షార్ట్‌కట్స్‌ మార్గంలో గాక మంచి మార్గంలో అంటే పాజిటివ్‌గానే సంతోషం కలిగే రసాయనాలు మెదడులో స్రవించాలంటే చేయాల్సింది... ∙వ్యాయామం చేయడం; తగినంత నిద్రపోవడం ∙ఇతరుల నుంచి ప్రోత్సాహం పొందడం, మనలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా  మాట్లాడే మిత్రులను కలిగి ఉండటం; వారితో సానుకూల ధోరణిలో సంభాషణలు సాగించడం ∙ఆత్మీయులతో ప్రేమ, స్నేహం, అనురాగపూరితమైన భావోద్వేగాలను కలిగి ఉండటం ∙చక్కని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ∙ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటం ∙పిల్లల విషయంలో తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించేలా మాట్లాడటం.

సంతోషాలు తెచ్చే అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి  
ఆధ్యాత్మికత
రక్తసంబంధీకుల ఆప్యాయత, ఆదరణ
మంచి కుటుంబ సంబంధాలు
ఇతరుల పట్ల సాదరంగా వ్యవహరించడం
ఇష్టసంభాషణ, ప్రియవచనాలు పలకడం, ప్రోత్సహించేలా మాట్లాడటం.
ఇతరులనూ సంతోషంగా ఉంచడం
కృతజ్ఞతతో ఉండటం, ఇతరులకు ఇబ్బంది. కలగనంతవరకు బహిర్ముఖంగా ఉండటం.
మంచి వ్యాపకం... అందుకు సృజనాత్మకమైన రాత, గీత వంటి వాటికి ప్రాధాన్యమివ్వడం

సంతోషంగా ఉన్నవారికి కలిగే సంపదలివి...
తమ కోసం ఏదైనా చేయగలిగే స్నేహితులు పెంపొందుతారు.
మెరుగైన పనితీరును కనబరుస్తారు.
ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులనూ తేలిగ్గా అధిగమించగలుగుతారు.
శారీరకంగా కలిగే నొప్పిని తట్టుకుంటారు. మానసికంగానూ స్థైర్యంతో ఉంటారు.
జీవితంలో విజయం సాధిస్తారు. స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తారు.

 డా‘‘ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై
సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం
ఎర్రగడ్డ, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement