
డబ్బింగ్‌కు ఆయన వాయిస్... తిరుగులేని చాయిస్
సమ్‌థింగ్ స్పెషల్
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఎం.ఎస్ నారాయణ తను నటించిన సన్నివేశాలకు సంబంధించి డబ్బింగ్ చెప్పడానికి ఇంకాసేపట్లో రావాల్సి ఉంది. ఇంతలో అకస్మాత్తుగా ఫోన్...‘‘సార్...ఎమ్మెస్ గారు చనిపోయారట సార్’’... మరో సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ప్రకాష్‌రాజ్ తను చేసిన సీన్లకు సంబంధించి చెప్పాల్సిన డబ్బింగ్ వర్క్ పెండింగ్ ఉంది. అనుకోకుండా ఆయన ఔటాఫ్ కంట్రీ. అక్కడి నుంచి ఆయన తిరిగి వచ్చేవరకూ విడుదల ఆపేయాల్సిందేనా....
నిర్మాతలకు, సినిమా రూపకర్తలకు ఇలాంటి సమస్యలు కొత్తేం కాదు. అయితే వాటికి ఇప్పుడు సులభమైన పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం పేరు జితేంద్రనాథ్. మిమిక్రీ చేసేవాళ్లు మనకి చాలామందే తెలిసినా... అది ఇప్పటిదాకా నవ్వించడానికే అనుకునేవాళ్లం. అయితే అదే అనుకరణ కళ ను ఆధారం చేసుకుని తిరిగిరాని లోకాలకు చేరిపోయిన నటుల గొంతులను వారి పాత్రలకు అతికిస్తూ... వారిని బతికిస్తూ...తనను తాను బతికించుకుంటున్నారు జితేంద్ర. ఉదయ్‌కిరణ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితర ప్రముఖ నటులు అనుకోకుండా దూరమైతే.. అప్పటికే వారు నటించి ఉన్న సినిమాలో పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్పాలి? ఆయన లేకపోయినా, ఆ లోటు తెరపై వినపడకుండా ఎవరు చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తున్నాడీ అనుకరణ కళాకారుడు.
అనుకోకుండా అనుకరణలోకి...
‘‘మాది విజయవాడ. పదేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డాను’’ అంటూ చెప్పారు జితేంద్ర. స్టేజిషోస్, టీవీ షోస్... ఇలా పలు రంగాల్లో మిమిక్రీ ప్రదర్శనలతో రాణిస్తున్నారు. ఇది చాలా మంది చేసేదే కాబట్టి విశేషమేమీ లేదు. అయితే అకస్మాత్తుగా మరణించిన సినిమా నటుల పాత్రలకు వారి మరణానంతరం ఆయన గాత్రదానం ఇవ్వడం ద్వారా పరిశ్రమలో ఆయన ప్రొఫెషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘‘ఆరేళ్ల వయసులోనే చిరంజీవిని అనుకరిస్తూ డ్యాన్సులు చేశా.
సాంగ్స్, డ్యాన్స్ తప్ప మిమిక్రీ రంగంలోకి ప్రవేశిస్తాననుకోలేదు’’ అంటున్న జితేంద్ర... శ్రీదేవి పెళ్లి అనే నాటి మిమిక్రీ క్యాసెట్‌తో ఇన్‌స్పైర్ అయ్యి నటీనటులను అనుకరించడం ప్రాక్టీస్ చేశారు. కాలేజ్ వేడుకల్లో హర్షధ్వానాలు అందుకున్నారు. చిన్నప్పటి నుంచి కళలంటే ఉన్న ఇష్టంతో చిరుద్యోగంతో సరిపుచ్చుకోలేక సినిమాల్లో భవిష్యత్తు నిర్మించుకోవాలనే ఆలోచనతో సిటీకి వచ్చేశారు. ఆ తర్వాత సినీరంగంలో విభిన్న అంశాల్లో తన టాలెంట్‌ను పరీక్షించుకున్నారు. అలా అనుకరణ కళాకారుడిగా స్థిరపడ్డారు.
ఆపద్బాంధవుడిగా...
ఉదయ్‌కిరణ్ అకస్మాత్తుగా మరణించే నాటికి ఒక సినిమాలో నటించి ఉన్నారు. దాంతో ఆయన పాత్రకు డ బ్బింగ్ చెప్పడం సమస్యగా మారింది. అప్పుడు జితేంద్ర ధైర్యం చేశారు. అప్పటి నుంచి సినీ ప్రముఖుల మరణానంతరం సినీ రూపకర్తల పాలిట ఆపద్బాంధవుడిగా మారిపోయారు. ఆహుతి ప్రసాద్, మల్లికార్జునరావు, చిత్తజల్లు లక్ష్మీపతిరావు... ఇలా అకస్మాత్తుగా దూరమైన నటులతో పాటు, రకరకాల కారణాలతో తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పలేకపోయిన దాదాపు 60 మంది నటులకు వాయిస్ అందించారు. ఎం.ఎస్.నారాయణ చనిపోయిన అనంతరం ఆయన వాయిస్‌నే దాదాపు 10 సినిమాలకు పైగా తాను డబ్బింగ్ చెప్పడం గొప్ప విశేషం అంటారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లో పెద్ద సంఖ్యలో స్టేజ్ షోస్ ఇస్తూ రాణిస్తున్న జితేంద్ర... చనిపోయిన కళాకారుల గొంతులను అనుకరించడం అదీ వారి పాత్ర, అభినయాలకు దీటుగా పలికించడం కష్టసాధ్యమైనా... అది వారికి తన వంతుగా అర్పిస్తున్న నివాళి లాంటిదంటున్నారు.
ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్టులున్నా... ఈ ఆపద్బాంధవుడనే పేరు తనకు మాత్రమే దక్కడాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానంటారు. గాయకుల గొంతులు అనుకరిస్తూ పాటలు పాడడం, షార్ట్ ఫిల్మ్‌లో నటించడం, హాలీవుడ్ నటుల వాయిస్‌ను సైతం ఇమిటేట్ చేయగలగడం... ఇలా ఎన్నో రకాల అదనపు నైపుణ్యాలను అలంకారంగా చేసుకున్న జితేంద్ర... వీలున్నంత కాలం కళాకారుడిగా జీవించడమే తన లక్ష్యం అంటున్నారు.
- ఎస్.సత్యబాబు