ఆరోగ్యం జాగ్రత్త!
ఎగ్జామ్ టిప్స్
టెన్షన్‌గా ఉండటం, నిద్ర తక్కువగా పోవడం వల్ల కడుపులో ఎక్కువ ఆమ్లాలు విడుదలవుతుంటాయి. అందుకని పరీక్షలు ఉన్నన్ని రోజులు పిల్లలకు పులుపు, కారాలు ఎక్కువ ఉన్న పదార్థాలను పెట్టకూడదు. ఇవి కడుపుబ్బరాన్ని, నొప్పిని కలిగిస్తాయి. రెండు, రెండున్నర గంటలకోసారి తగు మోతాదులో సమతుల ఆహారాన్ని ఇవ్వడం వల్ల సమస్యలను దరిచేరకుండా చూడవచ్చు.అమ్మాయిలకు రుతుక్రమ సమస్యలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యం, ఎదిగే వయసులో రుతుక్రమం సమయంలో కడుపునొప్పి, తల తిరగడం, జ్వరంగా అనిపించడం జరుగుతుంటాయి. అందుకని రుతుక్రమం మొదలవడానికి ముందురోజే పారసిటమాల్ వేయచ్చు. తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించాలి. వీరికి ద్రవపదార్థాలు కూడా ఎక్కువ ఇవ్వాలి. కొంతమందికి కొన్ని ఆహారపదార్థాలు పడవు. పిల్లలకు ఏ పదార్థాలు పడవో వాటిని పెట్టకూడదు. అలాగే నిల్వ ఉన్న పదార్థాలు, చికెన్, మటన్‌లాంటి త్వరగా జీర్ణం కాని పదార్థాలకు ఈ సీజన్‌లో దూరంగా ఉండటం మంచిది. విరేచనాలు అవుతుంటే అరటిపండు, వైట్‌బ్రెడ్, మజ్జిగ, మెత్తగా ఉడికించిన అన్నం రెండు రోజుల పాటు ఇస్తే సరిపోతుంది.
పరీక్షల భయం రకరకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. వాటికి ‘సొంతవైద్యం’ పేరుతో తోచిన మందులు వాడకుండా, భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి. పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత మనోధైర్యాన్ని కుటుంబం ఇస్తే పిల్లలు విజయంతో తిరిగొస్తారు.మధ్యాహ్నం వరకు ఆకలికి ఆగాలని ఎక్కువ మొత్తంలో అల్పాహారాన్ని కడుపులో పడేయకూడదు. వేపుళ్లు, అధికమొత్తంలో పీచు, పిండి పదార్థాలను పరీక్షకు వెళ్లే ముందు తీసుకోకూడదు. అప్పుడప్పుడు పెప్పర్‌మింట్స్ చప్పరిస్తుంటే టెన్షన్ నుంచి రిలాక్స్ అవుతారు.