
పల్మునాలజీ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరంతో ఉంటోంది. శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోతున్నాడు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం సూచించండి.
– ఎమ్. కృష్ణమూర్తి, మేదరమెట్ల
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ పడదు. పొడిదగ్గు ఉంటుంది. పిల్లికూతలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దగ్గుతుంటారు. ఆ దగ్గు వల్ల రాత్రుళ్లు నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్‌పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసు వారిలోనైనా కనిపించినప్పటికీ చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకూ కారణాలు అంతగా తెలియవు. తమకు సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. కొన్ని వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ తర్వాత నిపుణులు తగిన చికిత్స అందిస్తారు.
నా వయసు 37. డస్ట్ అలర్జీ ఉంది. ఇటీవల వ్యాయామం మొదలుపెట్టాను. కానీ ఇలా మొదలుపెట్టగానే ఆయాసం వస్తోంది. దాంతో వ్యాయామం సాగడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి.
– గోపాలకృష్ణ, ఖమ్మం
వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేసే అవకాశం ఉంది. దీన్నే ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్‌డ్ ఆస్తమా అని కూడా అంటారు. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలోనే ముక్కురంధ్రాల్లోకి ప్రవేశించాక, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సంతరించుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ నోటితో పీలుస్తుంటారన్నమాట. ఆ చలిగాలిలో లోనికి ప్రవేశించగానే... ఆ గాలిని తీసుకెళ్లే మార్గాలు ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి...
∙పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్‌డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత చాలా కొద్ది సమయం పాటే వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు.
వ్యాధి నిర్ధారణ తర్వాతే మందులు!
నా వయసు 44 ఏళ్లు. నాకు ఎడతెరిపిలేకుండా దగ్గు వస్తోంది. నాకు టీబీ అయి ఉండవచ్చా? చాలామంది ఫ్రెండ్స్ నాకు టీబీ ఉందనీ, మందులు వాడమని సూచిస్తున్నారు. నాకు తగిన మందులు సూచించండి. – ఫల్గుణరావు, కాకినాడ
టీబీ ఉన్నవారికి దగ్గు రావడం ఒక లక్షణమే అయినా... దగ్గు వచ్చిన వారందరికీ టీబీ ఉన్నట్లే అనుకోకూడదు. దగ్గు అనేది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక స్వాభావిక రక్షణ ప్రక్రియ.
ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి గ్లాటిస్ నుంచి అత్యధిక పీడనంతో బలంగా నోటి ద్వారా ఒక్కసారిగా బయటకు వెలువడటాన్ని దగ్గు అంటారు. మన ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన అనేక వ్యర్థాలను, ప్రమాదకరమైన ద్రవాలను బయటకు బయటకు పంపడానికి దగ్గు ఉపయోగపడుతుంది. ఇక దగ్గు అనేది కేవలం టీబీ లక్షణం మాత్రమే కాదు. సైనుసైటిస్, నిమోనియా, ఆస్తమా వంటి జబ్బుల నుంచి గుండెజబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు అనేక వ్యాధుల్లో దగ్గు కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని డాక్టర్‌ని కలవండి. ఆయన కొన్ని పరీక్షలతో మీ దగ్గుకు అసలు కారణాన్ని కనుగొంటారు. దాని ఆధారంగా మీకు తగిన చికిత్స అందిస్తారు. అంతేగానీ దగ్గు వచ్చిన ప్రతివారూ సొంతంగానో లేదా తమ ఫ్రెండ్స్ చెప్పినదాన్ని బట్టి తమకు తామే ఏదో జబ్బును ఊహించుకోవడం సరికాదు.
Comments
Please login to add a commentAdd a comment