స్మోకింగ్
నా వయసు 45 ఏళ్లు. రోజుకు ఇరవై సిగరెట్ల వరకు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. సిగరెట్ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా?
– సుకుమార్, చెన్నై
పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకడం కూడా తగ్గడం జరుగుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి...
∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ ఆమర్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి.
∙పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది.
∙శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.
∙రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది.
∙పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ.
∙పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి.
∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతో పాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి.
∙భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామికి ప్యాసివ్‌స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
∙పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి.
జంక్‌ఫుడ్ అలవాటును తప్పించడం ఎలా?
మా బాబు వయసు పదమూడేళ్లు. ఇటీవల వాడు పిజ్జా, బర్గర్‌లను మాత్రమే ఇష్టపడుతున్నాడు. వాడి బరువు క్రమంగా పెరుగుతోంది. ఈమధ్య వాడు ఊబకాయంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మావాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – నర్మద, హైదరాబాద్
మాస్‌మీడియా ద్వారా ఈమధ్య ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి డాక్టర్ల నుంచి ప్రజలకు ఎన్నో సూచనలు అందుతున్నాయి. కానీ ఇంకా చాలా మంది అంతగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. దాంతో పిల్లల మీద, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
పిల్లలు టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించకపోగా... అనారోగ్యకరమైనవీ, పోషకాలు సరిగా లేనివి అయిన ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో ఒబేసిటీ, ఆస్తమా వంటి శారీరక రుగ్మతలతో పాటు వాళ్ల వికాసం, మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తెలింది. పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో స్థూలకాయం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, టైప్–2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వాళ్లు చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకపోవడం వల్ల పిల్లలను పైన పేర్కొన్న లైఫ్‌స్టైల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూడండి. తాజా పండ్లు ఎక్కువగా అందేలా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లి ఆటలు ఎక్కువ ఆడేలా ప్రోత్సహించండి. టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, ఐపాడ్ వంటి వాటితో ఎక్కువగా ఆడనివ్వకండి. రోజూ ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేలా చూడండి. బేకరీ ఐటమ్స్, ప్రాసెస్‌డ్ ఫుడ్స్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలను చాలా పరిమితంగా అందేలా చూడండి. ఇవి మీ బాబు విషయంలో తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు.
ఓల్డేజ్‌లో మునుపటి ఫిట్‌నెస్ ఎలా?
లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. మొదట్నుంచీ హెల్దీపర్సన్‌ను. ఈమధ్యకాలం వరకు చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. అయితే ఇటీవల నా ఫిట్‌నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో, బైక్ వరకు వెళ్లే టైమ్‌లో మునుపటిలా చురుగ్గా ఉండలేకపోతున్నాను. దాంతో నాకు ఈ ఫీలింగ్ వస్తోంది. నేను ఇదివరకటి ఫిట్‌నెస్ పొందడానికి ఏం చేయాలి? – పి. శ్రీనివాస్, విశాఖపట్నం
మీ వయసు వారంతా కీలకమైన ఇలాంటి సమయంలో మునుపటి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ప్రధానమైన అంశం. సాధారణంగా మీ వయసు వారిలో చాలామందికి డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధులు ఉండటం మామూలే. అలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఫిట్‌నెస్‌ను నిలుపుకోడానికి ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసుపైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినా... ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు... అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి.
ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్‌సైజ్‌కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి.
- డాక్టర్ సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment