ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 38 ఏళ్లు. ఆఫీసులో పనంతా కంప్యూటర్ పైనే ఉంటుంది. గత మూడు నెలలుగా నా కుడి భుజంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఇది డల్ పెయిన్ మాదిరి వచ్చినా ఒక్కోసారి తీవ్రంగా లోపల గుచ్చుతున్నట్లుగా నొప్పి (షార్ప్ పెయిన్)గా మారుతోంది. నా చేతిని తల కంటే పైకి ఎత్తినప్పుడు ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తోంది. మధ్యమధ్యన నొప్పి తెలియడం లేదు. కానీ ఇది తరచూ తిరగబెడుతోంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలరు. – జగన్నాథరావు, రాజమండ్రి
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు భుజంలోని ‘రొటేటర్ కఫ్’ అనే కండరాల సమూహంలో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ఇవి ఏదైనా ఎత్తడానికి ఉపయోగపడతాయి. భుజానికి సంబంధించిన రెండు ఎముకల మధ్యలోంచి వెళ్తాయి. ఆ కండరాలకు ఏదైనా సమస్య వస్తే వాటిలో వాపు వస్తుంది. అప్పుడు మనం భుజం ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే ఇవి రెండు ఎముకల మధ్య నలిగిపోతుంటాయి. ఒక్కోసారి కొద్దిగా చిట్లిపోవచ్చు కూడా. ఈ పరిణామం అక్కడ గాయం అయ్యేలా చేస్తుంది. మీరు భుజంతో చేసే పనుల వల్ల ఈ గాయం మరింత రేగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఇది తగ్గడం కోసమే ఉద్దేశించిన ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. ఇలా రొటేటర్ కఫ్ సమస్య వచ్చినప్పుడు క్రికెట్, బాడ్మింటన్ వంటి ఆటలు ఆడటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. మీరు మీ భుజం ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి రావచ్చు. ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించాలి.
ఆ ప్లేట్లు తొలగించాల్సిందేనా?
నాకు ఐదేళ్ల క్రితం జరిగి ప్రమాదంలో ముంజేతికి శస్త్రచికిత్స చేసి, ప్లేట్లు, స్క్రూలు బిగించారు. వాటిని ఇప్పుడు తొలగించడం మంచిది అంటున్నారు. తప్పనిసరిగా తొలగించాల్సిందేనా? – చంద్రశేఖర్, నల్లగొండ
సాధారణంగా ఆపరేషన్ కోసం బిగించిన ప్లేట్లు, స్క్రూలను ప్రతిసారీ తొలగించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే కాళ్లల్లో అమర్చిన వాటిని తప్పనిసరిగా తొలగించాలి. మీ విషయంలో ప్లేట్లు చెయ్యికి వేశారంటున్నారు కాబట్టి ఎలాంటి సమస్యా లేకపోతే వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అక్కడే మళ్లీ ఫ్రాక్చర్ అయితే అది మరింత ప్రమాదంగా పరిణమిస్తుంది కాబట్టి సాధారణంగా వాటిని తొలగిస్తుంటారు. అలా తొలగించడమే మంచిది. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి.
బైక్ యాక్సిడెంట్... మోకాలిపై బరువు పడితే తీవ్రమైన నొప్పి
నా వయసు 28 ఏళ్లు. ఇటీవల నేను ప్రమాదవశాత్తు బైక్ మీది నుంచి కింద పడ్డాను. అప్పుడు మోకాలు కొద్దిగా వాచింది. ఇప్పుడు దానిపై ఏమాత్రం భారం వేయలేకపోతున్నాను. డాక్టర్‌కి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
– సుబ్రహ్మణ్యం, ఒంగోలు
బహుశా మీకు మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణం. అక్కడ నిర్దిష్టంగా ఏమైందో తెలుసుకోవడం కోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... మీకు ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో, అతి విశ్వాసంతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల విషయంలో భవిష్యత్తులో అది మరింత పెద్ద సమస్యగా పరిణమించవచ్చు. ఇక మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేకుండా వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి.
- డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment