అమ్మగా.. తొమ్మిది నెలలు
హెల్త్ టిప్స్
శారీరకంగా, మానసికంగా మీలో వస్తున్న మార్పులను గమనించుకుంటూ ఉండండి. మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకుంటూ ఉండండి. ఇష్టమైన హాబీలు పెంపొందించుకోండి. చక్కటి వ్యాపకాలను సృష్టించుకోండి. కంటి నిండా నిద్రపోండి. దీనివల్ల మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. {పసవం గురించి ఆందోళన చెందకండి. అది చాలా సజావుగా జరిగిపోతుందన్న నమ్మకంతో ఉండండి. సిజేరియన్ గురించి, పురిటినొప్పుల గురించి భయపడకండి. బిడ్డపుట్టాక పాలు పడతాయా లేదా అని ఇప్పటి నుంచే ఆందోళన చెందకండి. దీని గురించి ఆందోళన పడుతుంటే అది బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంత సౌకర్యంగా, ఆహ్లాదంగా ఉంటే అంత మంచిది.
మీకు ఫ్రెండ్స్ నుంచి కుటుంబసభ్యుల నుంచి వచ్చే సలహాలు, సూచనల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాటిని విశ్లేషించుకొని మంచివీ, అనుసరణీయం అనుకున్నవే పాటించండి. ఇబ్బంది కలిగించేవీ, వాస్తవ విరుద్ధమైనవి వద్దు. కేవలం హేతుబద్ధమైన సూచనలనే అనుసరించండి. సానుకూల ధోరణినే పెంపొందించుకోండి. పాజిటివ్ దృక్పథంతో ఉండండి. నిర్మాణాత్మమైన విమర్శలనే స్వీకరించండి. మీకు మీరు ఆలోచించుకోవడం వల్లనే భావోద్వేగ సంబంధిత సమస్యలు పరిష్కరించవచ్చునని తెలుసుకోండి. మీకు శ్రమకలిగించే మల్టీటాస్కింగ్ వంటి పనులు ఆ సమయంలో చేయకండి. మీకు ఒత్తిడి కలిగించేదేదీ చేయవద్దు. ప్రతిదీ మీరే స్వయంగా చేయాలని అనుకోకండి. కొన్ని ఇంటి పనులు మీ కుటుంబ సభ్యులకూ అప్పగించండి. షాపింగ్ వంటి వాటిని ఇతరులకు అప్పగించండి. మీకు ఆందోళన కలిగించేదీ, మిమ్మల్ని బాధించేది ఏదీ చేయకండి.