వినిపించే కళ్లజోడు!
టెక్ టాక్ / జుంగ్లీ పాంథర్
మ్యూజిక్ వినేందుకు వాడే ఇయర్‌ఫోన్లతో ఎంత చికాకో మనకు తెలియంది కాదు. చెవిలో సరిగ్గా ఇమడక, అప్పుడప్పుడూ జారిపోతూ... తీగలు చుట్టుకుపోయి ముడిపడిపోతూ మహా ఇబ్బంది పెట్టేస్తూంటాయి. కానీ... ఫొటోలో కనిపిస్తున్న గాగుల్స్‌తో ఈ ఇబ్బందులేవీ లేవు. అయినా ఇయర్‌ఫోన్లకు, గాగుల్స్‌కు ఏం సంబంధం? అంటే... అవే ఇవి.. ఇవే అవి కూడా అని చెప్పకతప్పదు. అవునండి.. ఈ గాగుల్స్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌గా పనిచేస్తాయి. అలాగని వీటి బడ్స్ మామూలు ఇయర్‌ఫోన్‌లలా చెవిలోకి దూరిపోయి మీలోకంలో మిమ్మల్ని ఉంచేసి మిగిలిన శబ్దాలేవీ మీకు చేరకుండా చేయవు కూడా. అంటే బయటి చప్పుళ్లను లైట్‌గా వినొచ్చు.
అప్రమత్తంగా ఉండొచ్చు. ఈ గాగుల్స్ తాలూకూ సైడ్ స్టిక్స్ మీ చెవి వెనుకభాగాన్ని తగులుతూంటాయి కదా.. అక్కడి నుంచే అవి మన ఎముకల ద్వారా సంగీతాన్ని వినేలా చేస్తాయి. దీన్నే బోన్ కండక్షన్ టెక్నాలజీ అంటారు. స్మార్ట్‌ఫోన్ లేదా మరే ఇతర మ్యూజిక్ ప్లేయర్ బ్లూటూత్ ద్వారా ఈ గాగుల్స్‌కు మ్యూజిక్ అందిస్తాయి. ఒకవేళ మీరు సంగీతం వింటున్నప్పుడు ఏదైనా ముఖ్యమైన కాల్ వచ్చిందనుకోండి.. జుంగ్లీ పాంథర్ ఫ్రేమ్‌పై ఉండే కంట్రోల్స్ ద్వారా కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. లేదా సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు కూడా. ఈ ఏడాది నవంబరులో అందుబాటులోకి రానున్న ఈ వినూత్న గాగుల్స్ ఖరీదు దాదాపు రూ.7500!