వేడివేడి అన్నంలో అంత ముద్దపప్పు కలుపుకుని చారడంత నెయ్యి పోసుకుని తింటే భలే మజా అని ఒకప్పుడు అనేవారుగానీ.. ఇప్పుడంతా కొలెస్ట్రాల్ భయం. నెయ్యి ఎక్కువ తింటే లావెక్కుతామని.. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని బెరకు! ఇది నిజమేనా? ఒకప్పటి మాటేమోగానీ.. ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిపోతోంది. లావెక్కువయ్యేందుకు కారణం కొవ్వు పదార్థాలు కాదని.. బాగా రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ అంశంపై ఇప్పటికే బోలెడన్ని అధ్యయనాలు వెలువడగా.. తాజాగా దాదాపు 1.35 లక్షల మందిపై జరిపిన పరిశోధన ఒకటి ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ‘ద లాన్‌సెట్’లో ప్రచురితమైన పరిశోధనలో దాదాపు 18 దేశాలకు చెందిన వ్యక్తులను పరిశీలించారు.
వీళ్లలో కొందరు తక్కువ కొవ్వులు మాత్రమే తీసుకుంటూండగా.. మిగిలిన వారు కార్బోహైడ్రేట్ల మోతాదుపై పరిమితులు పాటిస్తున్నవారు. కొవ్వులపై ఆంక్షలు పెట్టుకున్న వారిలోనే గుండెజబ్బులు, గుండెపోటు వంటి సమస్యలు కనిపించగా.. మిగిలిన వారిలో ఈ ప్రమాదం తక్కువగా నమోదైంది. శరీరం సక్రమంగా పనిచేసేందుకు, అవసరమైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టేందుకు, కండరాల కదలికలకూ కొవ్వులు అత్యవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అంతేకాకుండా విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఒంటబట్టాలన్నా కొవ్వులు కావాల్సిందే. వీటి మోతాదు తగ్గించి.. కార్బోహైడ్రేట్లు, చక్కెరలను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం మొదలవుతుందని శాస్త్రవేత్తల అంచనా. దాదాపు 50 పరిశోధనలు ఈ విషయాన్ని ఇప్పటికే నిర్ధారించాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా అందినప్పుడు శరీరం వాటిని సులువుగా చక్కెరలుగా మార్చేసుకుంటుందని న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోర్ కేటరింగ్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్త కారా అన్‌సెల్మో అంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించే బ్లాగ్ ప్రకారం.. చేపలు, ఆలివ్ ఆయిల్, గింజల నుంచి తీసిన నూనెల్లోని మోనో, పాలీ అన్‌సాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో బాగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్ చేటు చేస్తాయి. మొత్తమ్మీద చూస్తే.. ఆహారంలో జంతు సంబంధిత కొవ్వుల స్థానంలో. చేపలు, అవకాడో వంటివాటి ద్వారా లభించే సంతృప్త కొవ్వులను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చునన్నది శాస్త్రవేత్తల తాజా అంచనా!
Comments
Please login to add a commentAdd a comment