ఇట్స్‌గాన్.. పోయ్‌పొచే.. పోయిందే.. అమృతాంజన్ కు సంబంధించిన పాత యాడ్ గుర్తుందా? ఇలా రాయగానే.. అలా నొప్పి మాయం అన్నమాట. అదే తీరులో గుండె జబ్బులన్నీ ఒక్క మాత్రతో మటుమాయమైతే ఎలా ఉంటుంది..? అద్భుతంగా ఉంటుంది కదూ. ఇది జరిగేందుకు ఇంకెంతో కాలం లేదంటున్నారు బ్రిటన్‌లోని అబర్డీన్ వర్సిటీ శాస్త్రవేత్తలు. ట్రొడుస్క్వమైన్ అనే మాత్రను ఒక్కసారి తీసుకుంటే చాలు.. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుందని చెబుతున్నారు. కొవ్వు గుండె పోటుకు కారణమవుతుందన్న విషయం తెలిసిందే.
ఊబకాయంతోనే సమస్యలు..
ఊబకాయం ద్వారా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నది తెలిసిన విషయమే. ఆహారంలోని కొన్ని రకాల కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లోకి చేరి గట్టిపడటం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గి తద్వారా ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయి గుండెజబ్బులు వస్తాయి. ధూమపానం వంటి అలవాట్లు అథెరోస్కేలెరోసిస్ (రక్త నాళాలు మందం కావడం) ప్రక్రియను వేగవంతం చేస్తాయని స్పష్టమైన అంచనాలున్నాయి. జీవనశైలిలో మార్పుల ద్వారా అంటే.. తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం.. ఒత్తిడిని వీలైనంత మేర తగ్గించుకోవడం వంటి పనుల ద్వారా గుండె జబ్బులను పూర్తిగా నివారించొచ్చని ఇప్పటికే రుజువైంది. అయినా ఏటా కొన్ని కోట్ల మంది గుండెజబ్బుల బారిన పడి మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబర్డీన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ట్రొడుస్క్వమైన్ మందుపై పరిశోధనలు జరిపారు. టైప్– 2 డయాబెటిస్ లక్షణాలను తగ్గించగలిగే ఈ మందు.. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులపై ప్రభావమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. జన్యుమార్పుల ద్వారా కొన్ని ఎలుకల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి ఈ మందును ప్రయోగించారు. ఒకే ఒక్క డోసు మందు తీసుకున్న ఎలుకలతో పాటు కొంత కాలం పాటు అప్పుడప్పుడూ మందు తీసుకున్న ఎలుకల్లోనూ కొవ్వు గణనీయంగా తగ్గిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వ్యాయామం చేసినట్లుగా..
వ్యాయామం చేస్తే కొవ్వు తగ్గుతుందని తెలుసు. ట్రొడుస్క్వమైన్ అచ్చంగా ఇదే పని చేస్తుంది. వ్యాయామం చేసినట్లు శరీర వ్యవస్థకు భ్రమ కల్పించి తద్వారా ప్రత్యేకమైన ప్రొటీన్ విడుదలయ్యేలా చేసి, ఓ ఎంజైమ్ ఉత్పత్తి ఆగిపోయేలా చేస్తుందని శాస్త్రవేత్త డెలిబీగోవిక్ వివరించారు. ఈ రెండు చర్యల ఫలితంగా కొవ్వు కరిగిపోవడంతో పాటు వాపు వంటి లక్షణాలు తగ్గిపోతాయి. ట్రొడుస్క్వమైన్ మధుమేహంతో పాటు రొమ్ము కేన్సర్ చికిత్సలోనూ ఉపయోగపడుతున్నట్లు ఇప్పటికే జరిగిన పరీక్షలు చెబుతున్నాయి. ఈ మందు గుండెజబ్బులకూ ఉపయోగపడుతుందన్న విషయం వైద్య రంగంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే మానవులపై ప్రయోగించనున్నారు.
కొవ్వు పేరుకుపోవడం అసలు సమస్య..
రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అథెరోస్కేలెరోసిస్ (రక్త నాళాలు మందం కావడం) వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఇది ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలియదు. కాకపోతే ధూమపానం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఇది అధికంగా కన్పిస్తుంది. పసిపిల్లల రక్తనాళాల్లోనూ కొద్దిమేర కొవ్వు పేరుకుని ఉంటుంది. వారిలో వయసు పెరిగే కొద్దీ మోతాదు ఎక్కువ అవడంతో పాటు రక్తనాళాలు పెళుసు బారిపోవడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయని అంచనా. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, రోజూ అతిగా మద్యపానం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, కరేబియన్ దీవుల్లోని ఆఫ్రికన్ సంతతి ప్రజలు జన్యుపరమైన సమస్యల కారణంగా గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
నోటిలోని బ్యాక్టీరియా వల్ల కూడా..!
రక్తనాళాల్లోకి చేరే కొవ్వు ఆహారం నుంచే కాదు.. నోటిలో ఉండే బ్యాక్టీరియా నుంచి కూడా రావొచ్చని కనెక్టికట్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్‌ఫర్డ్ ఆసుపత్రిలోని కొందరు రోగుల రక్తనాళాల్లోని కొవ్వును రసాయనికంగా పరిశీలించగా.. అవి ఏ జంతువుకు సంబంధించింది కాదని గుర్తించారు. ఈ కొవ్వు కణాలు ఒకే రకమైన బ్యాక్టీరియా కుటుంబానికి చెందినవిగా గుర్తించినట్లు పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫ్రాంక్ నికోలస్ తెలిపారు. బాక్టరోడిటీస్ అనే బ్యాక్టీరియా భిన్న రకాల కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేయగలదని, వీటికి, మన శరీరంలోని కొవ్వులకు మధ్య స్పష్టమైన తేడా ఉండటం వల్ల గుర్తించామని ఫ్రాంక్ వివరించారు. పంటి సమస్యలు, చిగుళ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేందుకు కారణం కూడా ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కొవ్వులే కావొచ్చని ఫ్రాంక్ భావిస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment