భార్యా భర్త మధ్యలో హై బీపీ | High blood pressure in the middle of the husband and wife | Sakshi
Sakshi News home page

భార్యా భర్త మధ్యలో హై బీపీ

Published Wed, Sep 9 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

భార్యా భర్త మధ్యలో  హై బీపీ

భార్యా భర్త మధ్యలో హై బీపీ

శంకర్‌దాదా ఎంబీబిఎస్ సినిమాలో చిరంజీవి పట్టించిన ఆటకి
టెన్షన్ పెరిగిపోయి, కల్లు తాగిన కోతిలా ఎగురుతుంటాడు పరేశ్ రావల్ .
ఆయనకి హై బీపీ. అందుకనే లాఫింగ్ క్లబ్బులో మెంబరైపోతాడు కూడా.
సినిమాలో అయితే చెల్లింది గానీ, హై బీపీ లాఫింగ్ మ్యాటర్ కాదు.
డాక్టర్లు, సైకియాట్రిస్టులు చెబుతున్న విషయం ఏంటంటే...
కోపం పెరగడం వల్ల బీపీ పెరగడం తక్కువే.
కానీ, బీపీ పెరగడం వల్ల చిరాకులు, కస్సుబుస్సులు, చిటపటలు, చిర్రుబుర్రులు
పటపటలు... సర్వసాధారణం.
ఈ మోడర్న్ టైమ్స్‌లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడానికి హై బీపీ కూడా
ఒక కారణం అవొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హై బీపీ ప్రాణం తీయగలదన్న విషయం మనందరికీ తెలిసిందే.
ప్రాణంలాంటి బంధాన్ని కూడా చంపుతుందని  
వైద్య పరిశోధనల్లో ఇప్పుడిప్పుడే తెలుస్తున్న విషయం.
సో... భార్యాభర్తలు చిరాకు పడుతున్నారంటే ప్రేమ తగ్గి కాదు...
బీపీ పెరిగి అయుండొచ్చు.

 
దంపతులిద్దరూ ధుమధుమలాడుతూ కనిపిస్తున్నారా? చీటికీ మాటికీ చిటపటలాడుతూ టపాసుల్లా పేలుతున్నారా? ఇద్దరి మధ్య కీచులాటలు నిత్యకృత్యమయ్యాయా?... ఒకసారి బీపీ చెక్ చేయించుకోండి. బీపీ పెరిగితే ధుమధుమలు, చిటపటలు పెరగవచ్చు. కస్సుబుస్సుల మాట ఎలా ఉన్నా కంటినరాలు దెబ్బతినడం, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, పోటెత్తిన నెత్తురు మెదడులో ప్రవహించి పక్షవాతం సైతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రక్తనాళాల్లో నెత్తురు పోటెత్తాల్సిందే! అయితే, అది నిలకడగా ఉంటేనే ఆరోగ్య లక్షణం. అలా కాకుండా, రక్తనాళాల్లో నెత్తుటి ఉధృతిని సామాన్య భాషలో బీపీ అంటారు. నిజానికది హై బీపీ. వైద్య పరిభాషలో హైపర్‌టెన్షన్... ఈ హైపర్‌టెన్షన్ వస్తే ఆరోగ్యానికి ఎంత చేటు తెచ్చిపెడుతుందోననే టెన్షన్ ఉండాల్సిందే! ఎందుకంటే ఒక్కోసారి అది ప్రాణాంతకం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో హై బీపీ ఒకటి. కేవలం ైెహ బీపీ వల్ల తలెత్తే సమస్యల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా 75 లక్షల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. బీపీ పెరిగే వారిలో దాదాపు 96 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. బీపీ అదుపు తప్పేంతగా పెరిగితే గుండె, కిడ్నీలు, మెదడు, కళ్లు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తరచుగా బీపీని తనిఖీ చేసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే, దీనివల్ల తలెత్తే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలను నివారించుకోవచ్చు.

ఏది సాధారణం..? ఏది అసాధారణం..?
శరీరంలో రక్తప్రసరణ జరిగేటప్పుడు రక్తనాళాలపై కలిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. విశ్రాంత స్థితిలో రక్తపోటు చూసేటప్పుడు సిస్టాలిక్ పీడనం 120, డయాస్టాలిక్ పీడనం 80 వరకు (120/80) ఉంటే రక్తపోటు సాధారణంగా ఉన్నట్లు లెక్క. అంతకు మించి పెరిగితే అధిక రక్తపోటుగా (హైబీపీ) పరిగణిస్తారు. సాధారణ స్థితి కంటే తక్కువగా ఉంటే, అల్ప రక్తపోటుగా (లో బీపీ) పరిగణిస్తారు. అయితే, శరీరంలో రక్తపోటు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇది నిమిష నిమిషానికీ మారుతూనే ఉంటుంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఈ హెచ్చుతగ్గులు ఒక క్రమ పద్ధతిలో నమోదవుతాయి. మధ్యాహ్నం వేళ రక్తపోటు సాధారణ స్థితి కంటే కాస్త ఎక్కువగా, రాత్రివేళ కాస్త తక్కువగా ఉంటుంది. రాత్రివేళ రక్తపోటు నెమ్మదించకుంటే, దానిని భవిష్యత్ అనారోగ్య సూచనగా పరిగణించాల్సి ఉంటుంది.

ఎందుకు పెరుగుతుంది?
చాలావరకు బీపీ ఎందుకు పెరుగుతుందనే దానికి కచ్చితమైన కారణాలు తెలియవు. శారీరక శ్రమకు ఆస్కారం లేని పనులు చేసేవారికి, నిరంతరం ఒత్తిడి ఎదుర్కొనే వారికి, స్థూలకాయులకు, పొగరాయుళ్లకు బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొందరు హై బీపీ బారిన పడవచ్చు. నిర్దిష్ట కారణాలు కనిపించకుండానే, రక్తపోటు పెరగడాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. నిర్దిష్టమైన కారణంతో వచ్చే రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. కారణం తెలియకుండా వచ్చే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కంటే, నిర్దిష్టమైన కారణంతో కనిపించే సెకండరీ హైపర్ టెన్షన్‌తోనే ప్రమాదం ఎక్కువ. సెకండరీ హై బీపీకి కారణమైన జబ్బును నయం చేయడం ద్వారా హై బీపీని నయం చేయవచ్చు.

ఉప్పుతో ముప్పు
హై బీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఎందుకంటే, ఉప్పు ద్వారా రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరిన సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోతుంది. ఫలితంగా రక్తపోటు అదుపు తప్పి పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం, బ్రెయిన్ హెమరేజ్ వంటి ప్రమాదకర, ప్రాణాంతక పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అలాగే, శరీరంలో కొవ్వు పెరిగినా రక్తనాళాలపై వెలుపలి నుంచి ఒత్తిడి పడి ఇలాంటి పరిస్థితే తలెత్తుతుంది.

చక్కెరతోనూ చిక్కులు
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీ పెరిగేలా చేస్తుంది. శరీరంలోకి చక్కెరలు ఎక్కువగా చేరితే, వాటికి ప్రతిస్పందనగా శరీరంలో ఇన్సులిన్, లెప్టిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి పెరిగితే, రక్తపోటు సహజంగానే పెరుగుతుంది. చక్కెరల్లో ముఖ్యంగా సుక్రోజ్ కంటే కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫ్రుక్టోజ్ ఎక్కువగా చేటు తెచ్చిపెడుతుందని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి.

రక్తనాళాలకు చేటు
రక్తపోటు మితిమీరి పెరిగితే రక్తనాళాల్లో ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. హై బీపీ ఉన్నవారిలో రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదమూ లేకపోలేదు. బీపీ తీవ్రత పెరిగితే తలనొప్పి, తల దిమ్ముగా ఉండటం, కళ్లు తిరగడం, తల తిరగడం, కొందరిలో చూపులో తేడా రావడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటు విపరీతంగా పెరిగితే అది పక్షవాతానికి దారితీసి మాట తడబడటం, ముఖంలో ఒకవైపు వంకరపోవడం, ఒకపక్క కాలు చేయి వంకరపోవడం, ఒక్కోసారి మాట సైతం పూర్తిగా పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హై బీపీ వల్ల కళ్లు, ఊపిరితిత్తులు, లివర్, స్ప్లీన్, జీర్ణాశయం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీనొప్పి, ఆయాసం, పాదాలకు నీరుచేరడం, మూత్రవిసర్జన తగ్గడం, జీర్ణశక్తి మందగించడం, ఫిట్స్, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీపీ అకస్మాత్తుగా పెరగడం వల్ల మాత్రమే కాదు, దీర్ఘకాలంగా ఒక మోస్తరు హై బీపీ కొనసాగినా నరాలకు అదే స్థాయిలో చేటు తెచ్చిపెడుతుంది.

పిల్లల్లోనూ హై బీపీ
 హై బీపీ... పెద్దల సమస్య మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో కొద్దిమంది పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. చిన్నారుల్లో సాధారణంగా పెద్దల కంటే రక్తపోటు తక్కువగానే ఉంటుంది. ఏడాది లోపు శిశువుల్లో రక్తపోటు 75/50 నుంచి 100/70 వరకు, ఐదేళ్ల లోపు చిన్నారులకు 80/50 నుంచి 110/80 వరకు, పన్నెండేళ్ల లోపు పిల్లలకు 85/50 నుంచి 120/80 వరకు, పద్దెనిమిదేళ్ల లోపు వారికి 95/60 నుంచి 140/90 వరకు ఉండటాన్ని సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు. అంతకు మించితే, హై బీపీగానే గుర్తించాల్సి ఉంటుంది. స్థూలకాయం, క్యాల్షియం జీవక్రియల్లో మార్పులు, రెనిన్ హార్మోన్‌లో మార్పులు వంటివి పిల్లల్లో హై బీపీకి కారణమవుతున్నాయి. ఇవి కాకుండా, కుటుంబంలో ఎవరికైనా హై బీపీ ఉన్నట్లయితే, పిల్లల్లోనూ ప్రైమరీ హైపర్ టెన్షన్‌కు కారణమవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మూత్రపిండాల సమస్యలు, మెదడుకు సంబంధించిన జబ్బులు, గుండె జబ్బులు, ఎండోక్రైన్ గ్రంథులకు సంబంధించిన జబ్బులు, రక్తనాళాలకు చెందిన సమస్యలు, కొన్నిరకాల మందుల వాడకం వల్ల పిల్లల్లో సెకండరీ హైపర్ టెన్షన్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. ప్రైమరీ హై బీపీ తొలిదశలో ఉన్నట్లయితే, ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఇతర కారణాల వల్ల రక్తపోటు పెరిగినట్లయితే మాత్రం తప్పక వైద్య సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సిందే.
 
 - ఇన్‌పుట్స్: డాక్టర్ గోవర్ధన్, డాక్టర్ పాపారావు
 సీనియర్ ఫిజీషియన్స్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement