
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో హిమాచల్ పార్క్!
జాతీయ వనం
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో గ్రేట్ హిమాలయన్ జాతీయ ఉద్యానవనం చోటుచేసుకుంది. ‘హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో గల ఈ జాతీయ వనం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అత్యద్భుతం’గా ఖతార్‌లోని దోహా ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మన దేశంలోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇప్పటికే జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా 1972లో కేంద్రప్రభుత్వం, 1999 లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించాయి.
ఈ ప్రాంతంలో 832 జాతుల సుగంధద్రవ్యపు మొక్కలు ఉండగా వీటిలో 26 శాతం పుష్ప జాతికి చెందినవే! ఇది హిమాలయాలలోనే అత్యధిక సంఖ్య. అయితే ఇక్కడ అధిక సంఖ్యలో ఔషధ, సుగంధ ద్రవ్యపు మొక్కలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. హిమాలయాల్లోని నల్ల ఎలుగుబంట్లు, చిరుతపులి, కస్తూరి జింక... మొదలైన జంతుజాలాన్ని రక్షించేందుకు, వీటి సంఖ్యను అభివృద్ధి పరిచేందుకు సన్నాహాలు చేపట్టారు.
ఇప్పటికే మంచు చిరుత, ఎర్ర తల రాబందు అంతరించే ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ఈ జాతీయ వనాన్ని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సందర్శించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విమానంలో కుల్లు జిల్లాకు చేరు కోవచ్చు. సమీప మండీలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి బస్సులు, క్యాబ్స్ ద్వారా ఈ జాతీయవనానికి చేరుకోవచ్చు.