గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా?
నా వయసు 37 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. మందులు వాడినా సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – సైదులు, నల్లగొండ
గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు.
కారణాలు : ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు.
లక్షణాలు : ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి.
చికిత్స : హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్‌స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
- డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
నిద్రలేవగానే మడమల్లో నొప్పి!
నా వయసు 40 ఏళ్లు. ఉదయం నిద్రలేచినవెంటనే నడవటం అంటే నరకం కనిపిస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొని నడవాల్సి వస్తోంది. మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఈ సమస్యకు హోమియో పరిష్కారం చెప్పండి. – సునీత, కొత్తగూడెం
అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే కణజాలం ఉంటుంది. అడుగులు వేసే సమయంలో ఇది కుషన్‌లా పనిచేసి, అరికాలిని షాక్ నుంచి రక్షిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దీనిలోని సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది.
ఇది పలచబారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో ప్లాంటార్ ఫేషియా చిన్న చిన్న దెబ్బలకూ డ్యామేజ్ అవుతుంది. దాంతో మడమ నొప్పి, వాపు వస్తాయి. ఈ నొప్పి అరికాలు కింది భాగంలో ఉంటుంది. ఉదయం పూట మొట్టమొదటిసారి నిల్చున్నప్పుడు మడమలో ఇలా నొప్పి రావడాన్ని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఈ నొప్పి పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా వస్తుంది.
కారణాలు : ∙డయాబెటిస్ ∙ఊబకాయం / బరువు ఎక్కువగా ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేస్తూ ఉండటం ∙చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ చురుకుగా పనిచేయడం ∙ హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో వచ్చే నొప్పికి ఇది ముఖ్యమైన కారణం).
లక్షణాలు : ∙రాత్రిళ్లు నొప్పి అధికంగా వస్తుంది ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ఉంటుంది ∙కండరాల నొప్పులు
వ్యాధి నిర్ధారణ : అల్ట్రాసౌండ్ స్కానింగ్
చికిత్స : హోమియో విధానంలో మడమనొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి, తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడోడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ మూర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు వెంటనే అనుభవజ్ఞులైన హోమియో వైద్య నిపుణుడిని సంప్రదించండి.
- డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు మంచి పరిష్కారం
నా వయసు 58 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉంటున్నాయి. కీళ్లవద్ద ఎర్రగా మారుతోంది. హోమియోలో పరిష్కారం ఉందా? – యు. చంద్రశేఖరప్రసాద్, తాడేపల్లిగూడెం
ఇటీవల ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. సాధారణంగా స్త్రీ–పురుషులలో యాభైఏళ్ల తర్వాత కొన్ని నొప్పులు మొదలవుతాయి. వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతోంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే వారిలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. ఇది మహిళలు, పురుషులు, కొన్ని సందర్భాల్లో పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు.
లక్షణాలు : ఈ వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి.
సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు.
సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే ఉండకపోవచ్చు. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేవు. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు.
- డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment