ఆవాసం ఆరోగ్యం | Home health | Sakshi
Sakshi News home page

ఆవాసం ఆరోగ్యం

Published Mon, Feb 24 2014 11:37 PM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM

Home health

ఇల్లు మనకు ఆవాసం. మనం నిశ్చింతగా ఫీలయ్యే నివాసం. అక్కడ ఏ భయాలూ ఉండకూడదన్నది అందరి ఆకాంక్ష. కానీ మనం సురక్షితం అనుకునే చోట్లలో కూడా మనకు తెలియకుండానే అనేక అపాయాలు నిరీక్షిస్తూ ఉంటాయని మీకు తెలుసా? అవే... మనకు తెలియకుండా మనింట్లోనే పొంచి ఉండే విషపదార్థాలు. ఆ విషాలు అలర్జీలను ప్రేరేపించి మనల్ని జబ్బు పడేలా చేస్తాయి. ఈ తరహా విషపదార్థాలు వేడి వేడిగా మరిగే చికెన్ పులుసులోనూ ఉంటాయన్నది నమ్మలేని సత్యం. మన ఇంట్లోని ఆ పదార్థాలను తెలుసుకునేందుకు ఉపకరించేదే ఈ కథనం.
 
ప్లాస్టిక్ పాత్రలో పెట్టే కూర...  కనిపించని విషపు కోర...
ఇప్పుడు మన సూప్ బౌల్స్ అందంగా కనిపించే ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారవుతున్నాయన్న విషయం తెలిసిందే. పైకి అందంగా కనిపించే ఈ బౌల్స్ ఉపయోగానికి అంత అందమైనవి కాదు. సాధారణంగా ఈ కూరల బౌల్స్ ‘మెలామైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లోని మెలామైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైంది.  మెలామైన్‌తో కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశాలతో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఏ ఆహారాన్నీ మెలామైన్ బౌల్‌లో పెట్టి మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. ఈ ప్లాస్టిక్ తరహా బౌల్స్‌లో ఉంచుకుని వేడి వేడి ఆహారం తింటే అది హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ప్రభావం ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. ఇలాంటి పాత్రల్లో తినే చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
 
అధిగమించడం ఇలా: వేడివేడి సూప్‌లను వడ్డించాలనుకుంటే పింగాణీ పాత్ర లేదా పింగాణీ ప్లేట్లే ఆరోగ్యదాయకం. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి పులుసు వడ్డించడం అంటే కాలే పులుసులో కాలేసినట్లే.
 
ఫ్రిజ్‌లో దాక్కునే సాల్మొనెలా
మనం ఫ్రిజ్‌లో ఆహారాన్ని దాచే సమయంలో మాంసాహారాన్ని, కూరగాయలను, పండ్లను వేర్వేరుగా ప్యాక్ చేసి దాచాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా అనే సూక్ష్మజీవి ఉంటే అది అన్ని ఆహారాలను కలుషితం చేస్తుంది. దీన్ని తీసుకుంటే నీళ్ల విరేచనాలతో పాటు డీ-హైడ్రేషన్ ముప్పు తప్పదు. ఒక్కోసారి ఈ డీహైడ్రేషన్ ముప్పు ప్రాణాంతకంగా మారే అవకాశాలూ ఉంటాయి.
 
అధిగమించడం ఇలా: మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు... వాటికవే వేర్వేరుగా హానికరం కాని ప్యాకింగ్ మెటీరియల్‌తో ప్యాక్ చేసి పెట్టుకోవాలి. మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్‌లాంటి మాంసాన్ని (రా-మీట్‌ను) దేనికదే విడివిడిగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆహారాన్ని వడ్డించుకోడానికి ముందు ప్లేట్లను శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చిపచ్చిగా ఉండే మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వంట సమయంలో మాంసాహారాన్ని తప్పనిసరిగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత  వద్ద సాల్మొనెల్లా లేదా ఈ-కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి.
 
 వంటగదిలో గాలి ఆడేలా చూసుకోండి...
 చాలామంది వంటగదిని ఇరుకిరుకుగా చేసుకుంటారు. కానీ కిచెన్‌లో గాలి ఆడేలా చూసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా కిరోసిస్ స్టవ్‌లు ఉపయోగించేవారు కూడా ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కిరోసిన్ మండే సమయంలో కొన్ని హానికర వాయువులు వెలువడతాయి. ఇక కట్టెల పొయ్యి అయితే కార్బన్ డై ఆక్సైడ్‌తో పాటు  కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు వస్తాయి. వీటివల్ల ప్రాణాపాయం కూడా తప్పని పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. అందుకే కిచెన్ తగినంత విశాలంగా, గాలి ఆడేలా ఉండాలి. ఇక ఒక్కోసారి గ్యాస్ వాటర్ హీటర్స్ నుంచి కూడా విషవాయువులు వెలువడే ప్రమాదం ఉంది.
 
అధిగమించడం ఇలా: వంటగది విశాలంగా ఉండేలా చూసుకోండి. అనవసర వస్తువులతో దాన్ని నింపేయవద్దు. బొగ్గులు, నిప్పుల మీద చేసే వంట... కిచెన్‌లో వద్దు. ఆరుబయటే చేయండి. మీకు ఆర్థిక స్తోమత ఉంటే, మీకు వీలైతే మీ వంటింట్లో  పొగ, కార్బన్‌మోనాక్సైడ్ డిటెక్టర్లను అమర్చుకోండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా. ఇది వీలుకాకపోతే కిచెన్‌లో తగినంత గాలి ఆడేలా చూసుకోండి.
 
ఇంటి బయటే పాదరక్షలు...
ఒకటి రెండు రోజులు అవే వేసుకుంటే సాక్స్ (మేజోళ్లు) దుర్వాసన వస్తాయన్న సంగతి తెలిసిందే. మేజోడులో బ్యాక్టీరియా వల్ల ఈ దుర్వాసన వస్తుంది. ఒకవేళ ఇంట్లోకి ప్రవేశించాక సాక్స్ విప్పితే ఆ బ్యాక్టీరియా ఇంట్లోకీ వచ్చేసే అవకాశాలుంటాయి. అందుకే పాదరక్షలను ప్రధానంగా సాక్స్‌ను ఇంటి బయటే వదలాలి. అందుకే చెప్పులు, పాదరక్షలు, షూస్, సాక్స్ స్టాండ్ ఇంటి బయట ఉండటమే మంచిది.
 
‘నాన్‌స్టిక్’తో డ్రాస్టిక్ ప్రభావాలు...

నాన్‌స్టిక్ కుక్‌వేర్‌లో వండిన ఆహారం అంత ఆరోగ్యకరమైనది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల పిల్లల్లో భవిష్యత్తులో స్థూలకాయం, డయాబెటిస్ వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అంతేకాదు... దీర్ఘకాలంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, హార్మోన్‌ల అసమతౌల్యత వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పైగా వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గే అవకాశాలూ పెరుగుతాయని ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్’లో ప్రచురితమైంది.
 
అధిగమించడం ఇలా:
టెఫ్లాన్ వంటి కోటింగ్ ఉన్న నాన్‌స్టిక్ కుక్‌వేర్‌కు బదులుగా సాధారణ స్టెయిన్‌లెస్ స్టీల్ వంటివి ఉపయోగించండి. కనీసం గర్భంతో ఉన్నప్పుడయినా నాన్‌స్టిక్ గృహోపకరణాలను ఉపయోగించడం మానేయండి. ఇక మరీ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండాల్సిన వాటికి నాన్‌స్టిక్ ఉపయోగించకపోవడమే మంచిది.
 
ఆరోగ్యానికి ఎలకలకలం...
మీ ఇంటి కిచెన్‌లో ఎలకలు ఆహార పదార్థాలను తాకుతున్నట్లు కనిపిస్తే ఒకింత జాగ్రత్త. ఎందుకంటే... వీటి వల్ల ‘లెప్టోస్పైరోసిస్’ అనే వ్యాధి వస్తుంది. అది ప్లీహం,, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది.  
 
అధిగమించడం ఇలా : మీ ఆహార పదార్థాలను కిచెన్‌లోని ఎలకల నుంచి దూరంగా ఉంచండి. ఇంట్లో ఎలకలు ఉంటే, అవి దూరని విధంగా మెష్ ఉండే సురక్షితమైన ప్రదేశంలో ఆహారాన్ని ఉంచండి.
 
మీ సోఫాలో విలాసంగా కూర్చునే విషాలు ఎన్నో..!
ఇటీవల సోఫాలు అగ్నికి అంటుకోకుండా ఉండేందుకు ఫైర్ రెసిస్టెంట్ పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఈ ఫైర్ రెసిస్టెంట్ రసాయనాలను ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటారు. మనం సోఫాలపై చేతులు ఉంచినప్పుడు ఈ రసాయనాలు చేతులపైకి చేరతాయి. మనం ఆహారపదార్థాలను తిన్నప్పుడు అవి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ తరహా విషపదార్థాలు ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మన గ్రంథుల నుంచి స్రవించే పలు రకాల ఎంజైముల, జీవరసాయనాల సమతౌల్యం దెబ్బతినవచ్చు. ఒక్కోసారి కొన్ని క్యాన్సర్లు వచ్చేందుకూ ఆస్కారం ఉంది.
 
అధిగమించడం ఇలా : సోఫాలను వాక్యూమ్ క్లీనర్‌తో (ఎయిర్ ఫిల్టర్ ఉపయోగం మరింత మంచిది) శుభ్రం చేయాలి.  సోఫా మీద కూర్చున్న తర్వాత ఏదైనా తినాల్సి వస్తే... చేతులు శుభ్రంగా కడుక్కోవడం, నోటిని నీళ్లతో పుక్కిలించడం అవసరం. (ఈ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఇతరత్రా జబ్బులు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి).
 
 బూజుకు ఆస్కారమివ్వద్దు...
 బ్రెడ్ ఉన్న ప్యాక్ తెరచి కొన్ని తినేసి, మరికొన్నింటిని అలా వదిలేస్తే... దానిపై బూజు రావడం అన్నది అందరికీ అనుభవమైన విషయమే. ఈ బూజునే మౌల్డ్ అంటారు. ఈ బూజు నుంచి వచ్చే గాలి పీల్చినప్పుడు ముక్కులు బిగుసుకుపోవడం, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలు (విండ్‌పైప్స్) సన్నబడినట్లుగా మారి ఆయాసం రావడం, ఆస్తమా ప్రేరేపితం కావడం వంటి సమస్యలు వెంటనే కనిపిస్తాయి. వాటిని తినడం వల్ల విరేచనాల వంటి అనర్థాలు సంభవిస్తాయి. అందుకే మీ ఆహారానికి మౌల్డ్ సోకనివ్వకండి.
 
అధిగమించడం ఇలా : తేమ ఎక్కువగా ఉండే చోట్ల ఆహారాలను నిల్వ చేయడం వల్ల మౌల్డ్ తేలిగ్గా పెరుగుతుంది. అందుకే అలాంటి వాతావరణానికి ఆస్కారం ఉండే గదుల్లో ఆహారాన్ని నిల్వ చేయకండి. మీ వంటపాత్రలను వీలైనంత వరకు డిష్-వాషింగ్ సోప్‌తో శుభ్రపరచుకోండి. పల్లెల్లో కొందరు మట్టితో గిన్నెలు కడుగుతుంటారు. ఇలాంటివారు గిన్నెలు తోమడానికి బూడిదను ఉపయోగించడం మేలు. మట్టితో పోలిస్తే బూడిదలో హానికరమైన పదార్థాలు అంతగా  ఉండవు.
 
బొద్దింకలతో జాగ్రత్త...
బొద్దింకలనుంచి పెద్దగా వెనువెంటనే వచ్చే ప్రమాదం లేకపోయినా... ఆహారాన్ని కలుషితం చేసేందుకు అవి దోహదం చేస్తాయి. దాంతో నీళ్ల విరేచనాలు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కాబట్టి ఇళ్లలో బొద్దింకలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

అధిగమించడం ఇలా : ఆహారాన్ని మెష్ ఉండే సురక్షితమైన చోట ఉంచుకోవాలి. ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా ఉండేలా, వెలుతురూ, గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకుంటే బొద్దింకలు అంతగా పెరగవు.
 
కర్టెన్‌లతో కష్టాలెక్కువ... వాల్‌పేపర్లూ ప్రమాదమే...
ఇటీవల మన ఇండ్లలో బట్టలతో చేసిన కర్టెన్లు కాకుండా మరింత కాలం మన్నడానికి, కాల ప్రభావానికి లోనై పాడైపోకుండా ఉండటానికి ప్లాస్టిక్ వంటి పదార్థంతో రూపొందించిన కర్టెన్లను వాడుతున్నాం. ఇక బాత్‌రూమ్‌లలోనైతే నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం ఉపయోగించే షవర్ కర్టెన్లు తప్పనిసరిగా వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కర్టెన్లు బట్టలాగే ఎటు పడితే అటు వంగేందుకు వీలుగా ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఈ షవర్ కర్టెన్లలో మాత్రమే కాదు... మన ఇండ్లలో అలంకరణ కోసం ఉపయోగించే వాల్‌పేపర్లు, ఫ్లెక్సీలు కూడా ఈ పదార్థంతోనే రూపొందుతాయి. ఈ థాలేట్ అనే పదార్థంతో రూపొందిన ఉపకరణాలను ఉపయోగిస్తే అవి పురుష సెక్స్ హార్మోన్‌పై దుష్ర్పభావం చూపుతాయి. వీటి వల్ల పురుషుల్లో వీర్యం క్వాలిటీ దెబ్బతింటుంది. ఇంకా ప్లాస్టిక్ తరహా పదార్థాలపై నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల అది అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలు రావడం జరగవచ్చు. ఆస్తమా, పిల్లికూతలు కనిపించవచ్చు. ఇక ఈ తరహా వాల్‌పేపర్లు, గృహాలంకరణ వస్తువులు, కర్టెన్లు ఉన్న ఇండ్లలోని గర్భవతులకు మరీ ప్రమాదం. ఇవి ఉపయోగించడం అంటే... పుట్టబోయే పిల్లలు ఇంట్లోకి రావడానికి ముందే ఇంటి వాతావరణాన్ని అందంగా కలుషితం చేయడమే. ఎందుకంటే ఇలాంటివి ఉపయోగించే ఇళ్లలో పెరిగిన పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ వంటివి కనిపించే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లల్లో ఈ తరహా ధోరణులు పెరిగే అవకాశాలు ఎక్కువని మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి.

అధిగమించడం ఇలా: డోర్ కర్టెన్లు, షవర్ కర్టెన్ల కోసం వీలైనంత వరకు నిరపాయకరమైన వస్త్రాలనే కర్టెన్లుగా వాడండి. ఫర్నిచర్‌గా ప్లాస్టిక్ పీవీసీతో తయారు చేసిన వాటి కంటే కలపతో చేసినవి కొని అమర్చుకోడానికే ప్రాధాన్యం ఇవ్వండి.
 
 కొళాయి కాదది... ‘ఈ’-కొలయి..!  
 కొళాయి (నల్లా/పంపు) నుంచి నీళ్లు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ వాటితో పాటు దీర్ఘకాలం నిల్వ ఉన్న నీటిలో ‘ఈ-కొలై’ అనే పరాన్నజీవులు పెరుగుతాయి. ఈ నీటిని వాడిన ఆహార పదార్థాల్లోకి ‘ఈ-కొలై’  ప్రవేశించి, అలా మానవ శరీరంలో కూడా ప్రవేశిస్తాయి. వీటి వల్ల నీళ్ల విరేచనాల వంటి అనర్థాలు కలుగుతాయి. వాస్తవానికి ఈ నీటిని ఉపయోగించినా సరే... ఆ నీటిలో మరిగించే వంటలు చేస్తే అవి నశిస్తాయి. కానీ పానీపూరీ/ గప్‌చుప్ వంటి మరిగించడానికి వీలుకాని ఆహారాల కోసం ఈ-కొలై ఉన్న నీటిని ఉపయోగిస్తే నీళ్ల విరేచనాలు తప్పవు. పైగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అపరిశుభ్రమైన ఆహారం తీసుకుంటే నీళ్ల విరేచనాలు తప్పవు.
 
అధిగమించడం ఇలా:
దూరప్రాంతాల్లో ఉన్నవారు మరిగించకుండా తయారు చేసే ఆహారాన్ని లేదా వేడివేడిగా లేని ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది.
 
 ప్లాస్టిక్ పాత్రలో పెట్టే కూర... కనిపించని విషపు కోర...

 ఇప్పుడు మన సూప్ బౌల్స్ అందంగా కనిపించే ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారవుతున్నాయన్న విషయం తెలిసిందే. పైకి అందంగా కనిపించే ఈ బౌల్స్ ఉపయోగానికి అంత అందమైనవి కాదు. సాధారణంగా ఈ కూరల బౌల్స్ ‘మెలామైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లోని మెలామైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైంది.  మెలామైన్‌తో కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశాలతో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఏ ఆహారాన్నీ మెలామైన్ బౌల్‌లో పెట్టి మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. ఈ ప్లాస్టిక్ తరహా బౌల్స్‌లో ఉంచుకుని వేడి వేడి ఆహారం తింటే అది హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ప్రభావం ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. ఇలాంటి పాత్రల్లో తినే చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

అధిగమించడం ఇలా: వేడివేడి సూప్‌లను వడ్డించాలనుకుంటే పింగాణీ పాత్ర లేదా పింగాణీ ప్లేట్లే ఆరోగ్యదాయకం. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి పులుసు వడ్డించడం అంటే కాలే పులుసులో కాలేసినట్లే.

- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement