నేసల్ పాలిప్స్ తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. కొంతకాలంగా నా ముక్కులో కండలా పెరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. తరచూ జలుబు వంటి సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే నేసల్ పాలిప్స్ అని, శస్త్రచికిత్స చేయాలని అంటున్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో చికిత్స అందుబాటులో ఉందా? – భాస్కర్‌రావు, విజయవాడ
సాధారణంగా ముక్కు లోపలి భాగం, సైనస్‌లు (కపాలంలోని గాలితో నిండిన కుహరాలు) ఒక విధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొర ఒక విధమైన పల్చటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కు, సైనస్‌లను తేమగా ఉంచుతూ, ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించే దుమ్ము–ధూళితో పాటు ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల్లాంటి (సీలియా) నిర్మాణాల సహాయంతో గొంతులోకి, ముక్కులోకి చేర్చి... ఆ తర్వాత బయటకు పంపేస్తుంది. ఇది ముక్కులో జరిగే సాధారణ ప్రక్రియ. ముక్కులోని ఆ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్‌కు గురైతే, అది గురుత్వాకర్షణశక్తి కారణంగా కిందికి వేలాడటం వల్ల పాలిప్స్ ఏర్పడతాయి.ఇవి ఒకటిగా లేదా చిన్న చిన్న పరిమాణాల్లో గుంపుగా ఏర్పడచవచ్చు. అలా ముక్కులో ఉన్న మృదువైన కండ పెరుగుదలనే నేసల్ పాలిప్స్ అంటారు. అవి క్రమంగా పెరిగి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలిచే అవకాశం ఉంది.
కారణాలు : ఈ సమస్యకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే తరచూ ఇన్ఫెక్షన్స్ గురికావడం, ఆస్తమా, దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు, అలర్జిక్ రైనైటిస్, వంశపారంపర్య కారణాల వంటి అనేక అంశాలన్నీ ఈ సమస్యను ప్రేరేపిస్తాయి.
లక్షణాలు : ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది; నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి రావడం.
గురక రావడం; వాసన, రుచి గుర్తించే శక్తి తగ్గడం.తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
చికిత్స : హోమియోలో నేసల్ పాలిప్ సమస్యతో పాటు మిగతా శ్వాసకోశ సమస్యలన్నింటినీ జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలియం చికిత్స ద్వారా నయం చేయవచ్చు. రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూర్చడం ద్వారా సమస్య మళ్లీ తిరగబెట్టకుండా శాశ్వతంగా సమస్యను తగ్గించవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్