పాల మీగడ–తేనె
ఈ కాలం చర్మం పొడిబారుతుంటుంది. మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే.. పాల మీగడ తీసుకోవాలి. మీగడలో ఉంటే నూనె చర్మాన్ని పొడిబారనీయదు. తేనెలో చర్మసంరక్షణకు సహాయపడే ఔషధాలు ఉన్నాయి.
చర్మంపై ఏర్పడే మొటిమలు, యాక్నె వంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అందుకని మీగడ–తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మాయిశ్చరైజర్ అవసరం లేదని మీకే తెలిసిపోతుంది. ఈ చలికాలం రోజూ పాల మీగడ–తేనె కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. చర్మకాంతి కూడా పెరుగతుంది.
పాలు – అరటిపండు
చర్మానికి సరైన పోషణ లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, అరటిపండు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్‌వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్ కలిపి రాసుకోవచ్చు. అరటిపండు మృతకణాలను తీసేయడంలో అమోఘంగా పనిచేస్తుంది. బాగా మగ్గిన అరటిపండును గుజ్జు చేసి, దాంట్లో టేబుల్ స్పూన్ పాలు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి.
కలబంద– బాదంనూనె – నువ్వుల నూనె
చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల చొప్పున బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.
బొప్పాయి – పచ్చిపాలు
విటమిన్–ఇ అందితే చర్మం త్వరగా మృదుత్వాన్ని కోల్పోదు. బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి, దాంట్లో పచ్చి పాలు కలపాలి. ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.
Comments
Please login to add a commentAdd a comment