అది సీఓపీడీ వల్ల కావచ్చు... | Homeopathic counseling | Sakshi
Sakshi News home page

అది సీఓపీడీ వల్ల కావచ్చు...

Published Mon, Jun 6 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

అది సీఓపీడీ వల్ల కావచ్చు...

అది సీఓపీడీ వల్ల కావచ్చు...

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35. నాకు కొంతకాలంగా కొద్దిదూరం నడిస్తే ఆయాసంగా, ఛాతీ బరువుగా అనిపిస్తోంది. నాకు చాలా ఏళ్లుగా పొగతాగే అలవాటున్నందువల్ల ఇది గుండెకు సంబంధించిన వ్యాధి అనుకుని పరీక్షలు చేయిస్తే, అన్ని రిపోర్టులూ నార్మల్‌గానే వచ్చాయి. అయినా నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది? హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు.
- కిరణ్ కుమార్, హైదరాబాద్

 
దీర్ఘకాలికంగా పొగతాగే అలవాటు వల్ల ఊపిరితిత్తులకు హాని కలిగి శ్వాస తీసుకోవడంలో తలెత్తడాన్ని క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడి) అంటారు. సాధారణంగా మనం పీల్చుకున్న గాలి ముక్కు ద్వారా ట్రాకియా అనే నాళాన్ని చేరుతుంది. ట్రాకియా చివరి భాగంలో రెండు నాళాలుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి ఊపిరితిత్తులతో ప్రవేశించి, కొన్ని వేలసంఖ్యలో ఉన్న అతి సన్నని నాళాలుగా విభజింపబడతాయి. వీటిని బ్రాంకియోల్స్ అంటారు.

ఈ నాళాలు మిక్కిలి చిన్న గాలి తిత్తులుగా ఏర్పడతాయి. వీటిపై చిన్న రక్తనాళాలు ప్రయాణిస్తుంటాయి. గాలి వాయుతిత్తుల వరకు చేరినప్పుడు, ఆక్సిజన్ ఈ రక్తనాళాలకు చేరుతుంది. అదే సమయంలో రక్తనాళాలలోని కార్బన్ డై ఆక్సైడ్ ఈ వాయుతిత్తులను చేరుతుంది. తద్వారా శ్వాస బయటకు వదిలినప్పుడు వెలుపలికి వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియను గ్యాస్ ఎక్స్‌ఛేంజ్ అంటారు. ఈ వాయుద్వారాలు, గాలి తిత్తులు సాగే స్వభావం కలిగి ఉంటాయి.

ఇవి గాలి పీల్చుకున్న సమయంలోనూ, వదిలినప్పుడూ ఒక గాలిబుడగలా పని చేస్తాయి. దీర్ఘకాలికంగా పొగతాగడం వల్ల గాలితిత్తులు, వాయుద్వారాలు దెబ్బతిని వాటి సాగే గుణాన్ని కోల్పోతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

ఇతర కారణాలు: ఎక్కువగా కాలుష్యవాయువులను పీల్చడం, వృత్తిరీత్యా కొన్ని పొగలను, రసాయనాలను, దుమ్మును పీల్చవలసి రావడం, జన్యుపరమైన కారణాలు.
 
లక్షణాలు: శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తరచు దగ్గు, ఊపిరి తీసుకున్నప్పుడు కొన్ని రకాలైన గురగుర శబ్దాలు వినిపించడం, ఛాతీ బరువుగా అనిపించడం వంటివి.
 
జాగ్రత్తలు: స్మోకింగ్ మానివేయడం ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, కలుషిత వాయువులకు దూరంగా ఉండటం, అవి శరీరంలోకి ప్రవేశించటం ముక్కుకు మాస్క్ కట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం
 
హోమియో చికిత్స: జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా రోగి మానసిక, శారీరక తత్వాలను బట్టి, కుటుంబ చరిత్రను ఆధారంగా తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధి లక్షణాలను పూర్తిగా తగ్గించడమే కాకుండా ఎలాంటి దుష్ఫలితాలూ లేకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
 ఫౌండర్ చైర్మన్,హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్
 

డర్మటాలజీ కౌన్సెలింగ్
నేను ఉంగరం పెట్టుకునే చోట వేలు నల్లబడుతోంది. మంటగా ఉండటంతో పాటు వేలిపై దురద వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- సుష్మ, దామరచర్ల

 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటూ ఉండవచ్చు. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్ ఆనుకొని ఉండేచోట అలర్జీ వస్తోంది. ఇతర లోహాల మిశ్రమాల (అల్లాయ్స్)తో చేసే ఆభరణాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోండి.
     మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి.
     మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి.
     ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, మీరు అలా కూడా మార్చి చూడవచ్చు.
     చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి.
 అప్పటికీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
నా వయసు 49 ఏళ్లు. అండర్‌వేర్ ధరించే చోట చర్మం మడతలలో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ దురదగా కూడా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
 - వి. సుధాకర్, చల్లపల్లి

 
మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ ఉన్న క్రీమును 2-3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి.
- డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
 చీఫ్ డర్మటాలజిస్ట్,త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement