నా వయసు 31 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా?
పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ.
కారణాలు: తలలోని కొన్నిరకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతివెలుగు, గట్టిశబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు.
లక్షణాలు : పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు.
1. పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు: ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు.
2. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు.
3. పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉం్డటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స / నివారణ: కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్‌టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియోచికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్
ఇంటర్నేషనల్, హైదరాబాద్
సోరియాసిస్‌కు మందులు ఉన్నాయా?
నా వయసు 42 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా?
సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మసమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు.
కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం.
లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది.
నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్‌ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు.
చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమై మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
పైల్స్ సమస్యకు పరిష్కారం చెప్పండి...
నా వయసు 47 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?
అమితంగా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి.
మొలల దశలు: గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది.
►గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి.
►గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి.
►గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.
కారణాలు: ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ∙ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం.
నివారణ: ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙ సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ∙మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు.
హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి,
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment