కౌమారం అందరికీ వస్తుంది. కిక్కిస్తుంది, కిక్కెక్కిస్తుంది! ఇది ప్రకృతి పిల్లలకు ఇచ్చే బహుమానం. ఇది సుగుణాలకు దారివేయాలి. అవగుణాల నుంచి దూరంగా ఉంచాలి. పేరెంట్స్‌గా అది మీ చేతుల్లోనే ఉంది. లేకపోతే... అమ్మో.. టీన్‌మార్!
బాల్యం, కౌమారం, యౌవనం, మధ్యవయస్సు, వృద్ధాప్యం... ఇవీ మనిషి తన జీవితంలో అనుభవించే దశలు. పుట్టినప్పటి నుంచి 12 ఏళ్లు వచ్చే వరకు గడిచే బాల్యం చాలా మధురమైనది. 18 ఏళ్లు నిండిన నాటి నుంచి 40లలోకి ప్రవేశించే వరకు యౌవనం కూడా జీవితంలో మంచిదశే. ఈ దశలోప్రతి వ్యక్తీ జీవితంలో తాను అనుకున్నది సాధించడానికి అవసరమైన శక్తియుక్తులు కలిగి ఉంటాడు. ఇక 40 నుంచి 65-70ల వరకు ఇక తాను గడించిన అనుభవంతో అలా దాదాపుగా అలవోకగా జీవితాన్ని వెళ్లదీస్తాడు. ఇలా సాగిపోయే దశే... మధ్యవయస్సు. ఇవన్నీ గడిచిపోయాక జీవితం చివరి భాగంలో 75-90 ల వరకు ఉండేది వృద్ధాప్యం అనుకోవచ్చు. ఈ దశలో ప్రతి ఒక్కరూ దాదాపుగా పూర్తిస్థాయి విశ్రాంత జీవితం గడుపుతుంటారు. కానీ 12 ఏళ్ల నుంచి 19 వరకు ఉండే టీనేజీ చాలా చిత్రమైన దశ. ఈ సమయంలో మనం చేసేవన్నీ కరెక్ట్ అనిపిస్తుంది. ఈ దశలోనే మన వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. మనకు అభిరుచులు ఏర్పడి... టీనేజీ దాటాక అవి హాబీలుగా స్థిరపడతాయి. టీన్స్‌లోని కొత్తహార్మోన్ల ప్రభావంతో పిల్లలు తాము కోపంగా ఉన్నా, దురుసుగా వ్యవహరించినా, ఆగ్రహంతో ఊగిపోయినా... మనకు అదంతా సబబే అనిపిస్తుంది. మధ్యవయసుకు చేరాక ఆలోచిస్తే... అప్పుడెంత దుందుడుకుగా వ్యవహరించామా అంటూ మన ప్రవర్తన పట్ల మనకే సిగ్గుగానూ, బిడియంగానూ ఉంటుంది. అందుకే ఇలాంటి కౌమార (టీన్స్) దశలో వారి ప్రవర్తనల్లో వచ్చే మార్పులు... ఆ ప్రవర్తనకు కారణమయ్యే రకరకాల భావోద్వేగాలు.. అందుకు కారణాలు, పెద్దలు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మేనేజ్ చేయాలి వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.
‘టీన్’ అంటే బాలబాలికలు పదమూడు దాటిననాటి నుంచి పందొమ్మిదవ ఏటి వరకు ఉండే దశ అన్నది అందరికీ తెలిసిందే. థర్‘టీన్’ అంటూ మొదలై... నైన్‘టీన్’ వరకు గడిచే సంవత్సరాలను ఆయా సంఖ్యల పేర్ల చివరన ఉండే ‘టీన్’ అనే పదంతో సూచిస్తుంటారు. అయితే పిల్లలందరిలోనూ టీన్స్‌లో ఉండే ఆ ఉద్వేగాలన్నీ... గంటకొట్టినట్టుగా సరిగ్గా పన్నెండో ఏడు దాటిన మరుక్షణం నుంచే మొదలవ్వాలని ఏమీ లేదు. అమ్మాయిల్లో టీన్స్ తాలూకు పరిణతి 10-11 నుంచే ప్రారంభం కావడం మొదలవుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం కాస్తంత ఆలస్యంగా అంటే... 12వ ఏటి తర్వాతే ఈ పరిణతి ప్రారంభమవుతుంది. పిల్లలు తమ బాల్యం వీడి క్రమంగా పెద్దలుగా రూపొందడానికి మధ్యన ఉండే ఈ సంధి (ట్రాన్సిషన్) దశలో వారి ప్రవర్తనలో ఎన్నో మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) చోటు చేసుకుంటాయి. ఆ మార్పులతో వారెన్నో అయోమయాలకు గురవుతుంటారు. అంతేకాదు.. తమ ప్రవర్తనతో తమకూ, తమ పెద్దలకు సైతం సమస్యలూ, చిక్కులూ తెచ్చిపెడుతుంటారు.
హార్మోన్లే ప్రధాన కారణం
టీనేజీ పిల్లల ప్రవర్తనల్లో అంతకు మునుపెన్నడూ లేని మార్పు కనిపించడానికి వారిలో కొత్తగా స్రవించే కొన్ని హార్మోన్లే ప్రధాన కారణం. అవి వారిని నిలకడగా, స్థిరంగా, కుదురుగా ఉండనివ్వవు. టీన్స్‌లో వారు కొత్తదనం కోరుకుంటుంటారు. స్వేచ్ఛను ఆకాంక్షిస్తుంటారు. ఉత్సాహాలు, ఉద్రేకాలు పొంగిపొరలుతుంటాయి. తమ కోరికలు తక్షణం తీరకపోతే వెంటనే వారిలో రకరకాల ఉద్వేగాలు చెలరేగుతుంటాయి. మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్రవించడం మొదలవుతుంది. దాంతో మీసాలూ, గడ్డాలు వంటి సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్ కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ హార్మోన్‌సాహ ప్రవృత్తినీ పెంచుతుంది. కాస్తంత స్వేచ్ఛగా సంచరించేలా, తమకూ తమ ఆపోజిట్ జెండర్‌కూ మధ్యన ఆకర్షణను పెంచేలా చేస్తుంది.
ఆ హార్మోన్ ప్రభావం వల్ల సమకూరే కొత్త ఉత్సాహాల కారణంగా తాము స్వేచ్ఛను అనుభవించాలన్న కాంక్షతో కొన్ని పనులు చేయడం మొదలుపెడతారు. ఉదాహరణకు సమాజంలో సిగరెట్ తాగడం, మద్యం సేవించడం, వేగంగా వాహనం నడపడం వంటి కొన్ని అంశాలపై ఆంక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. తమ సాహసప్రవృత్తిని తీర్చుకోడానికి వారు సమాజంలో ఆంక్షలున్న అంశాలను కాస్త తెంపరితనంతోనో లేదా దొంగతనంగానో చేయాలనుకుంటారు. ఆ పనులు చేసినప్పుడు అవి వారికి మంచి లేదా హాయిగా అనిపించే (ఫీల్‌గుడ్) భావనను కలగజేస్తే... అవే పనులు మాటిమాటికీ చేసి అలవాట్లనూ, వ్యసనాలనూ అభివృద్ధి చేసుకుంటారు.
ఇక్కడ మెదడులో స్రవించే మరికొన్ని హార్మోన్లు సైతం రంగంలోకి వస్తాయి. ఉదాహరణకు మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు అందులోని నికోటిన్ ప్రభావం వల్ల మెదడులో డోపమైన్ వంటి సంతోష రసాయనాలు స్రవిస్తే... ఆ ఆనందభావనను మాటిమాటికీ పొందడం కోసం టీనేజీ పిల్లాడు మళ్లీ మళ్లీ సిగరెట్ తాగాలనుకుంటాడు. అలాగే మద్యం, పేకాట, దురలవాట్లు శ్రుతిమించితే డ్రగ్స్... ఇవన్నీ కూడా అలా అలవాటయ్యేవే.
మంచీ చెడుల కలగలుపు..
మన హార్మోన్లతో టీనేజ్‌లో కలిగే సాహసధోరణీ, సంతోష రసాయనాలూ రెండూ కలగలసి మంచీ-చెడూ... ఈ రెండు రకాల అభిరుచులూ వృద్ధి అవుతాయి. ఉదాహరణకు టీనేజ్‌లో కొత్తగా బైక్ నేర్చుకోవాలనే ధోరణి అందరిలో కలగడం ఓ మంచి భావన. భవిష్యత్తులో తాము జీవితాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలనే తపన అందులో ఉంటుంది. అయితే బైక్ నేర్చుకున్న తర్వాత దాని ముందు చక్రాన్ని పైకెత్తి నడపడం, చాలా వేగంగా డ్రైవ్ చేయడం వంటివి చేస్తున్న టీనేజీ పిల్లలను మనం రోడ్లపై నిత్యం చూస్తుంటాం. దీనికి కారణం ఆ వయసులో వారిలో కలిగే సాహసప్రవృత్తి. దానికి తోడుగా తమ కాన్షియస్ ఎఫర్ట్స్‌తో వారు తమ బైక్ నైపుణ్యాలను మరింత వృద్ధిపరచుకొని సాహసకార్యాలు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లోనైతే హింసాత్మక ప్రవృత్తితో చాలా క్రూరంగానూ వ్యవహరిస్తారు.
అయితే పిల్లల్లో ఇలా వ్యక్తిత్వ రూపకల్పన, అభిరుచులు ఏర్పడే సమయంలో... వారినీ, వారి ఆలోచనలనూ, వారి అలవాట్లనూ ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. టీనేజ్‌లో మన ప్రవర్తన రూపొందడానికీ, అభివృద్ధి్ద చెండానికి కారణాలివే...
జన్యుపరమైన అంశాలు:
టీనేజీ పిల్లల్లోని ప్రవర్తనలకు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. సాధారణంగా తల్లిదండ్రులనుంచి వచ్చే జన్యువుల పైనే వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం చాలా ఎక్కువనుకోండి. వారిని చూసిన పిల్లలు సైతం తామూ అలాగే ధైర్యంగా ఉండటాన్ని అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రుల్లో ఏదైనా కొత్తగా చేసే పనుల విషయంలో భయపడే గుణం... అంటే ‘పర్‌ఫార్మెన్స్ యాంగై్జటీ’ ఉంటే పిల్లల ప్రవర్తనలోనూ చాలా వరకు అవే గుణగణాలు
(ట్రెయిట్స్) వస్తాయి.
కాన్షియస్ ఎఫర్ట్స్ :
వీటికి కూడా చాలా వరకు తల్లిదండ్రులతో పాటు కొన్ని సామాజిక అంశాలూ కారణమవుతాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఏ డాక్టర్లో, ఐఏఎస్‌లుగానో పనిచేస్తున్నారనుకోండి. వాళ్లను గమనించే పిల్లలు... తాము కూడా అలాంటి వృత్తిలోకే వెళ్లాలనీ, అలాంటి గౌరవమే పొందాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే విషయం పెయింటర్లు, డాన్సర్లు, రచయితలకూ వర్తిస్తుంటుంది. కొన్ని మినహాయింపులున్నా సాధారణంగా తల్లిదండ్రుల ప్రభావం కారణంగానూ, తమ కాన్షియస్ ఎఫర్ట్స్‌తోనూ కలగలిసిన ప్రభావంతో తమ కెరియర్‌ను నిర్మించుకుంటుంటారు.
ప్రవర్తనపై సామాజిక అంశాల ప్రభావం ఇలా...
పిల్లలను తమ చుట్టూ ఉన్న సమాజంలోని అనేక అంశాలను నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వాటినుంచి కూడా తాము నేర్చుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా తమ పరిసరాలు, తాము చూసే సినిమాల వంటి మాస్‌మీడియా ప్రభావాలు, తాము చదివే పుస్తకాల వంటి అనేక సామాజిక అంశాలూ టీనేజీ పిల్లల ప్రవర్తనను నిర్దేశిస్తుంటాయి. నిర్ణాయాత్మక భూమికను పోపిస్తుంటాయి.
పరిసరాల ప్రభావం:ఉదాహరణకు తమ ఇంటికి సమీపంలో ఏ పోలీస్ ఉద్యోగో ఉన్నాడు. అతడి ధీరత్వం, అతడి హుందాతనం, అతడు ప్రవర్తిస్తున్న తీరుతో స్ఫూర్తి పొందుతుంటాడు. అలాంటి వారి వల్ల ప్రభావితమైన కుర్రాడు తానూ అలాంటి వృత్తిలోకే వెళ్లాలని ఆశిస్తాడు. అందుకు అనుగుణంగా మళ్లీ తన కాన్షియస్ ఎఫర్ట్స్ మొదలుపెడతాడు. కొద్దిమేరకు జన్యుపరమైన అంశాలతో పాటు... చాలావరకు ఈ కాన్షియస్ ఎఫర్ట్స్ కారణంగానే పిల్లల కెరియర్, వారి భవిష్యత్తు నిర్ణయమవుతుంది. అలాగే నిత్యం కీచులాడుకునే తల్లిదండ్రులూ, పరిసరాల్లో ఎప్పుడూ గొడవలకు దిగే ప్రవృత్తి ఉన్నవారు ఉన్నారనుకోండి.... అవే అంశాలు పిల్లలనూ ప్రభావితం చేస్తాయి. దాంతో వారు నిత్యం తగాదాలు పెట్టుకునే తంపులమార్లుగా, పోకిరీలూ, జులాయిలుగా తయారయ్యే అవకాశాలూ ఉంటాయి.
టీవీలు, సినిమాల, డిజిటల్ వంటి మాస్ మీడియా : సాధారణంగా టీనేజ్ దశలో చూసే సినిమాలు, అందులో కథానాయకుడి లక్షణాలు పిల్లలను చాలావరకు ప్రభావితం చేస్తుంటాయి. ఉదాహరణకు శంకరాభరణం సినిమా తర్వాత చాలా మంది టీనేజీ పిల్లలు సంగీతం వైపునకు ఆకర్షితులయ్యారు. అలాగే సాగరసంగమం సినిమా వచ్చాక చాలా మంది డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇక ‘ద్రోహి’ (హిందీలో ద్రోహకాల్) అనే సినిమా చూసిన కొంతమంది పోలీస్ ఇన్‌స్పెక్టర్ ట్రైనింగ్ తీసుకొని ఆ వృత్తిలోకి వెళ్లారు.
స్ఫూర్తిదాయక కథనాలు, సాహిత్యం: కింది స్థాయినుంచి జీవితాన్ని ప్రారంభించి, తాము మంచి కెరియర్‌నూ, మంచి పేరునూ సంపాదించిన వారి కథనాలూ చదవడం, సాహిత్యంతోనూ చాలామంది టీనేజీ పిల్లలు ప్రభావితమవుతుంటారు. పాపులర్ సైన్స్ పుస్తకాలు చదివి సైన్స్ పట్ల అభిరుచి పెంచుకోవడం, డబ్బు సంపాదన గురించిన కథనాలు చదివి జీవితంలో తామూ పారిశ్రామికవేత్తలుగా రూపొందిన ఉదాహరణలు సైతం చాలానే ఉన్నాయి. ఇంగ్లిష్‌లో స్టీఫెన్ హాకింగ్స్ వంటివారి పుస్తకాలు చదవడం, తెలుగులో నండూరి రామమోహన్‌రావు ‘విశ్వరూపం’, ‘నరావతారం’, యాకొవ్ పెరల్మాన్ రాసిన ‘నిత్యజీవితంలో భౌతికశాస్త్రం’ వంటి పుస్తకాలూ, మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి వారి రచనలు చదివి సైన్స్ పట్ల అభిరుచి పెంచుకొని సైంటిస్టులుగా మారినవారూ ఉన్నారు.
అవే అంశాలతో దురలవాట్లు సైతం...
మనం పైన చెప్పుకున్న అంశాల నుంచే దురలవాట్లు అబ్బుతాయి. ఉదాహరణకు పరిసరాల్లో నేరప్రవృత్తి ఉన్నవారి నుంచి, సినిమాల్లోని కొన్ని దుస్సాహస ధోరణుల నుంచి, పేరుమోసిన నేరగాళ్ల నుంచి ప్రేరణ పొంది చెడుదారుల్లో నడవడం, ఆల్కహాల్‌కూ, డ్రగ్స్‌కూ అలవాటు కావడం వంటి ధోరణులు సైతం చోటు చేసుకునేందుకు టీనేజీలోనే బీజం పడటం జరుగుతుంటుంది. ఇవన్నీ చేశాక కూడా టీనేజీ పిల్లల్లో ప్రవర్తన పూర్వకమైన మార్పుల వల్ల ఇటు పెద్దలకూ అటు వారికీ ఇబ్బందులు కలుగుతుంటే సైకియాట్రిస్ట్‌ల వంటి ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవడం చాలా వరకు మేలు చేస్తుంది. సైకియాట్రిస్ట్‌లు కౌన్సెలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) వంటి ప్రక్రియలతో వారి టీనేజీ ప్రవర్తనలను చక్కదిద్దుతారు. ఒకవేళ ఈ ఈడు పిల్లలు దుష్ప్రవర్తనతో ఉంటే... వాటి కారణంగా వచ్చే దుష్పరిణామాలకు చాలావరకు అడ్డుకట్ట వేస్తారు.
చక్కదిద్దడం ఎలా...
టీనేజ్‌లోకి రాగానే పిల్లల్లో కనిపించే ప్రవర్తను మార్పులను చక్కగా గాడిలో పెట్టడం (ఛానలైజ్ చేయడం) ద్వారా వారిని ప్రయోజనాత్మకమైన మంచి పౌరులుగా రూపొందేలా చేయవచ్చు. అందుకు తల్లిదండ్రులు అనుసరించాల్సిన కొన్ని అంశాలివే.
ఆదర్శప్రాయంగా ఉండటం: టీనేజీ పిల్లలు తమ చాలా ప్రవర్తనలను పెద్దల నుంచే నేర్చుకుంటారని చెప్పుకున్నాం కదా. ఉదాహరణకు తాము మంచివృత్తుల్లో ఉండాలన్న భావనలూ, తాము సైతం తమ తల్లిదండ్రుల్లా సంగీత సాధన, మంచి రచనలు చేయాలని అనుకోవడానికి తల్లిదండ్రుల ఆదర్శ ప్రవర్తనే కారణమవుతుంది.
మంచి జీవన శైలి అలవాటు చేయడం:
మన జీవనశైలి ఆరోగ్యకరంగానూ, క్రమశిక్షణతోనూ ఉండేలా టీనేజీలోనే పిల్లలకు అలవాటు చేయాలి. ఆ వయసులో ఏర్పడ్డ అలవాట్లు జీవితాంతం కొనసాగుతాయి. క్రమబద్ధంగా ఉండటం అలవాటు చేసుకుంటే అది జీవితంలో వచ్చే ఎన్నో అడ్డంకులు, సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ కలిగి ఉండటం అన్నది జీవితంలో శ్రమపడటాన్నీ నేర్పుతుంది.
పటిష్టమైన కుటుంబ సబంధాలు: తల్లిదండ్రులు తమ పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం, వారిపట్ల ప్రేమతో వ్యవహరించడం ద్వారా టీనేజీలో సైతం పిల్లలు అయోమయానికి గురికాకుండా స్పష్టంగా వ్యవహరించేలా చేయవచ్చు. పిల్లలు తమను నమ్మి అన్ని విషయాలూ తమతో చర్చించేలా బలమైన, పటిష్టమైన కుటుంబ సంబంధాలు ఉన్నప్పుడు ఆ పిల్లలు టీనేజీ అయోమయాలను తేలిగ్గా అధిగమించగలుగుతారు.
చెడు అలవాట్లకు లోనుకాకుండా చూడటం: వ్యసనాలన్నీ పిల్లలను కబళించేందుకు టీనేజీలోనే పొంచి ఉంటాయి. వారి సాహసధోరణీ, తాత్కాలిక సంతోషాన్ని కలిగించే అంశాలు వ్యసనాలకు బానిస చేస్తాయి. అందుకే అవెంత ప్రమాదకరమో పిల్లలకు అన్యాపదేశంగా ఎప్పుడూ చెబుతూ ఉండటం ద్వారా వాటి జోలికి వెళ్లకుండా చేయాలి.
మంచి అభిరుచుల వృద్ధి కూడా...
టీన్స్ దశలోనే పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణం ప్రారంభం అవుతుందనీ, అభిరుచులూ పెంపొందుతుంటాయని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ దశలో తమకు సంతోషాన్నిచ్చే వ్యక్తిత్వాన్నీ, అభిరుచులను పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. ఆ సమయంలో కూడా మళ్లీ వాళ్ల మెదడుల్లో సంతోషాన్నీ, హాయినీ ఇచ్చే డోపమైన్, సెరిటోనిన్, ఎండార్ఫిన్ లాంటి రసాయనాలు స్రవిస్తాయి. ఉదాహరణకు ఒక టీనేజ్ అబ్బాయి చక్కటి డ్రాయింగ్ వేస్తాడు. మరొక అమ్మాయి మంచి రచన చేస్తుంది. ఇంకొకరు మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తారు. ఇలా సృజనాత్మకమైన చర్య (యాక్టివిటీ) వల్ల తాము పొందిన ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందడం కోసం... తమలోని ఆ సృజనాసామర్థ్యాన్ని (టాలెంట్‌ను) అభివృద్ధి చేసుకుంటారు. ఇందుకోసం చేసే ప్రాక్టీస్‌ను ‘కాన్షియస్ ఎఫర్ట్’ అని అంటారు.
- డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,లూసిడ్ డయాగ్నస్టిక్స్,బంజారాహిల్స్,హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment