
భేషూగ్గా...!
పూలమొక్కలు బూట్లలో ఉన్నాయేంటని ఆశ్చర్యపోతున్నారా! పాతబూట్లని పడేయకుండా వాటిని పూలకుండీలుగా మారిస్తే ఇలాగే ఉంటాయి. పాతబూట్లలో కాసింత మట్టిపోసి మొక్కనాటడం ఫారిన్‌లో ఫాలో అవుతున్న ట్రెండ్. కొన్నాళ్లకు మన ఇళ్లలో కూడా ఇలాంటి బూట్లు కనపడతాయనుకోండి.
‘ఎంచక్కా కుండీల్లో పెట్టుకోకుండా బూట్లలో, చెప్పుల్లో మొక్కలేంటి?’ అని తీసిపారేయకండి. ఇక్కడ ఒక అద్భుతమైన సౌకర్యం ఉంది. కుండీలైతే నేలమీద పెట్టుకోవాలి. వేలాడేకుండీలు ఉన్నా...వాటిని ప్రత్యేకంగా కొనుక్కోవాలి. అదే బూట్లనుకోండి. చిన్న తాడు కట్టి గేటుకో, గోడకో వేలాడదీస్తే సరిపోతుంది. పైగా మొక్కల అందానికి బూటు స్పెషల్ ఎఫెక్టుగా పనిచేస్తుంది.
బూటు పెద్దగా బరువు ఉండదు కాబట్టి కావలసినప్పుడల్లా మట్టిని తీసేసి సులువుగా కొత్త మట్టిని నింపుకోవచ్చు. కాస్త ఓపికుంటే మొక్కలు పెట్టిన బూట్లకు మీకు నచ్చిన రంగులు కూడా వేసుకోవచ్చు. ఇంకా సరదా ఉంటే పేర్లు కూడా రాసుకోవచ్చు. మీ ఇంటి గోడలకు మ్యాచ్ అయ్యే రంగులు వేసుకుంటే గార్డెన్ లుక్ అదిరిపోతుంది. మీరు కూడా పాతబూట్లు పారేసేముందు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేసి చూడండి.