బెన్నెట్ విధ్వంసకర సెంచరీ.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే
ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను జింబాబ్వే విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే 49 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (163 బంతుల్లో 169; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బెనెట్ చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (61 బంతుల్లో 66; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)... బెనెట్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.ఏకైక టెస్టులో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన జింబాబ్వే తొలి వన్డేలో దానికి బదులు తీర్చుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 46 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ స్టిర్లింగ్ (32), క్యాంపెర్ (44), టెక్టర్ (39), టకర్ (31), డాక్రెల్ (34), మెక్‌బ్రైన్ (32) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎన్గరవా మూడు వికెట్లు పడగొట్టారు. బెనెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?