వాడిన పూలే వికసించనీ...
తాజా పువ్వులతో ఇంటిని అలంకరించుకోవడం అందరికీ తెలిసిందే. ఆ పువ్వులు వాడిపోతే పారేయడమూ మామూలే. కాని ఎండిపోయిన పువ్వులను కూడా ఇంటి అలంకరణలో వాడచ్చు. అదెలాగో చూద్దాం.
సాధారణంగా పువ్వులలో తేమ తగ్గిపోతే అవి వాడిపోతాయి. ఈ పువ్వులను చాలా బరువుగా ఉన్న పుస్తకంలో మధ్యలో ఉంచాలి. పైన ఏదైనా పెద్ద బరువు పెట్టాలి. లేదా రెండు వెడల్పాటి చెక్కల మధ్య న్యూస్‌పేపర్ లేదా టిష్యూ పేపర్ పరిచి దాని మధ్యలో పువ్వులను చక్కగా విడదీసి గట్టిగా ప్రెస్ చేసి, అలాగే ఉంచాలి.
రెండు వారాల తర్వాత తీసి చూస్తే తేమంతా పోయిన పువ్వులు బాగా ఎండిపోయి కనిపిస్తాయి. ఇలాగే ఆకులు, కొమ్మలు, తీగలను ఎండిపోయే విధంగా తయారుచేసుకోవచ్చు. లేదంటే ఎండినవాటినే సేకరించవచ్చు.
ఎండిన పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ వాల్ ఫొటోఫ్రేమ్‌లకు, ఫ్లవర్ బొకేలకు వాడుకోవచ్చు.
ఫ్లవర్‌వేజ్‌లలో రకరకాల ఎండు గడ్డి మొక్కలు, ఎండిన పువ్వులతో అలంకరించవచ్చు.
ఎండిన కంకులు, గడ్డి తీగలు, పోచలు.. కలిపి బొకేలా తయారుచేసి, ఇంటి మూలల్లో అలంకరించుకుంటే లుక్కే మారిపోతుంది.
పెద్ద పెద్ద క్యాండిల్స్ సైడ్‌లను వేడితో కొద్దిగా మెత్తబరిచి, ఎండుపువ్వులను, ఆకులను అతికించి, గాలికి ఉంచాలి. చూడచక్కని పువ్వుల డిజైన్లతో క్యాండిల్స్ కొత్త కళను నింపుకుంటాయి.
ఇంటి అలంకరణలో నచ్చిన రీతిలో ఉపయోగిస్తే ఎండు పువ్వుల సొగసులు ఎప్పటికీ వాడిపోవు. ఇంటి అందాన్ని ఎప్పుడూ వడలిపోనీయవు.