
వేసవిలో వెయిట్‘లా’స్
‘జిమ్’దగీ
ఇనుము వేడెక్కినప్పుడే సమ్మెట దెబ్బ పడాలి. దేహం వేడెక్కినప్పుడే వ్యాయామం చేయాలి. ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి మిగిలిన అన్ని సీజన్‌లూ ఒకెత్తయితే సమ్మర్ ఒక్కటీ ఒకెత్తు. ముఖ్యంగా లావుతగ్గి సన్నబడాలి అనుకునేవారికి, దేహాన్ని షేపప్ చేసుకోవడానికి ఇది బెస్ట్ సీజన్. అయితే దీనికి కొన్ని ‘లా’స్ (సూత్రాలు) కూడా ఉన్నాయంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ వెర్వెత్ వాలా.
సరైన సీజన్...
బాడీ వార్మప్ అయిన తర్వాతే ఎక్సర్‌సైజ్ స్టార్ట్ అవుతుంది. అయితే చలికాలం, వానాకాలంతో పోలిస్తే ఎండాకాలంలో దేహం త్వరగా వార్మప్ అవుతుంది. అసలు చాలా వరకూ ఈ సీజన్‌లో దేహం వార్మప్‌లోనే ఉంటుందని చెప్పాలి. శారీరక శ్రమ, మరో వైపు వేడి గాలి బాడీ టెంపరేచర్‌ను పెంచుతాయి. ఈ వేడి దేహమంతా విస్తరించేందుకు చర్మం ద్వారా రక్తం అధికంగా సరఫరా అవుతుంది. ఇది గుండె కొట్టుకునే స్థాయిని పెంచుతుంది. దాంతో బాడీ టెంపరేచర్ సాధారణ స్థాయికన్నా పెరుగుతుంది. ఈ పరిస్థితి క్యాలరీలు అధికంగా ఖర్చయేందుకు, మరింత వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
ఇలా స్టార్ట్... అలా రైట్ !
వ్యాయామానికి ముందు వైద్యసలహా తీసుకోవాలి. ఈ సీజన్‌లో వ్యాయామం స్లోగానే స్టార్ట్ చేయాలి. దేహాన్ని వేడికి అలవాటు పడనిస్తూ, దశల వారీగా వేగం పెంచాలి. అయితే మూడు నెలలు మాత్రమే చేసేసి ఒకేసారి బరువు తగ్గిపోదామని, మిగతా టైమంతా రెస్ట్ తీసుకుందాం అనుకోరాదు. వ్యాయామాన్ని దినచర్యలా అలవాటు చేసుకోవాలి. ఉదయం 10 గంటల లోపు, అలాగే సాయంత్రం 4గంటల తర్వాత వ్యాయామానికి సరైన సమయం. వీలైనంత వరకూ మిట్ట మధ్యాహ్నపు ఎండలో ఎసి జిమ్‌లో అయినా సరే ఎక్సర్‌సైజ్ మరీ అవసరమైతే తప్ప వద్దు. రోజుకు కనీసం గంట లేదా గంటన్నర పాటు వర్కవుట్ చేయాలి.
నాన్‌వెజ్‌కు... నో !
దాహం అనిపించకపోయినా సరే వ్యాయామ సమయంలో తరచు నీళ్ళు తాగుతుండాలి. చెమట ద్వారా కోల్పోయే సోడియం, పొటాíషియం, క్లోరైడ్‌లను భర్తీ చేసేందుకు అవసరమైతే స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఆశ్రయించవచ్చు. కాఫీ, టీ, ఆల్కహాల్‌ల వల్ల దేహంలోని నీటిస్థాయి ఆవిరై వ్యాయామ సమయంలో త్వరగా అలసిపోతాం. వాటికి ఈ సీజన్‌లో తప్పనిసరిగా గుడ్‌బై చెప్పాల్సిందే. నాన్ వెజ్ వంటకాలను బాగా తగ్గించాలి. కూరగాయలు, కోల్డ్ మిల్క్ ఆహారంలో భాగం చేయాలి. వ్యాయామ అనంతరం తప్పనిసరిగా మంచి ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి.
ఎరోబిక్స్ గుడ్...10కిలోలు తగ్గితే కరెక్ట్!
ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడం అవసరం. ఈ సీజన్‌లో కనీసం 7 కిలోల నుంచి 10 కిలోల వరకూ బరువు తగ్గడం జరిగిందంటే మీ వ్యాయామం సరిగా ఉన్నట్టు అనుకోవాలి. ఇక ఎంచుకోదగిన వ్యాయామాలు అంటే... బరువు తగ్గడానికి అత్యంత అనువైనది డ్యాన్స్–స్టెప్ ఎరోబిక్స్. మ్యూజిక్‌లో మారే బీట్స్‌కు అనుగుణంగా స్టెప్స్ మారుస్తూ చేసే గ్రూప్ డ్యాన్స్ ఎరోబిక్స్ అలసట తక్కువగా, ఫలితాలను ఎక్కువగా అందిస్తుంది. దీనిలో పాల్గొన్నవారి ఫ్యాట్ బర్నింగ్ జోన్‌ను ట్రైనర్ గుర్తించగలుగుతారు. తద్వారా తదనుగుణమైన బీట్స్‌ను సెట్ చేయగలుగుతారు. కాబట్టి అత్యుత్తమ వెయిట్‌లాస్ మార్గం డ్యాన్స్ ఎరోబిక్స్. దీని తర్వాత సైక్లింగ్, జాగింగ్, క్రాస్‌ట్రైనర్ వంటి కార్డియో వ్యాయామాలు కూడా మంచి వెయిట్‌లాస్ మార్గాలే. స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ది వీటి తర్వాత స్థానమే అయినప్పటికీ దానికి కూడా వర్కవుట్‌లో తగిన సమయం తప్పక కేటాయించాల్సిందే. వారానికి 3 సార్లు డ్యాన్స్ ఎరోబిక్స్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది.
జాగ్రత్తలు...
బలహీనత, తలనొప్పి, తలతిరగడం, ఒళ్ళు పట్టేయడం, వాంతులు, గుండె మరీ ఎక్కువగా కొట్టుకోవడం, డీ హైడ్రేషన్, తీవ్రమైన అలసటకు సంబంధించిన సూచనలు కనపడిన ట్లయితే వెంటనే వ్యాయామం ఆపేసి, చల్లని ప్రదేశంలో, నీడలో సేదతీరాలి. అరగంటలో తిరిగి సాధారణ స్థాయికి రాకపోయినట్టయితే వైద్యుణ్ని సంప్రదించాలి.
- దినాజ్ వెర్వెత్‌వాలా ఫిట్‌నెస్ ట్రైనర్
– సమన్వయం: సత్యబాబు