భాషా మూషికం
హ్యూమర్ ప్లస్
అనేక ఫైళ్ళని నమిలి, కొరికి తినిన జ్ఞానముండడం వల్ల ఒక ఎలుకని ప్రభుత్వ కార్యాలయాల సలహాదారుగా నియమించుకున్నారు. తోకా తల రెండూ ఏకకాలంలో ఆడించడం దాని ప్రత్యేకత. చట్టం తన పని తాను చేసుకుపోయినట్టు, అధికారులు కూడా చట్టంతో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుపోయేవాళ్ళు. నిస్సందేహంగా ఏ పనినైనా చేయగలిగిన వాళ్ళకి కూడా ఒక్కోసారి సందేహాలొచ్చేవి. అపుడు మన ఎలుకని సంప్రదించేవాళ్లు.
‘‘ప్రభుత్వ అవసరాల, సరఫరాల, ఖనిజ లవణ జల, ప్రతిపాదిత చట్టం సెక్షన్ 26 ఎ.బి.సి. క్లాజ్ 391 డి ప్రకారం మానవ వినియోగ సమధర్మ, సమతుల్య సంయోజిత ప్రయోజనమంటే ఏంటి?’’ అని అడిగేవాళ్ళు.దానికి మన ఎలుక ముందరి కాళ్ళతో ముక్కు గోక్కుని, మీసాలు సవరించుకుంటూ ‘‘ఇట్ మస్ట్ బి బై ఆల్ మీన్స్ నెవర్ అండర్‌స్టాండింగ్ టేకెన్ బై సంథింగ్ గివెన్ బై నథింగ్’’ అని చెప్పేది. ఇంగ్లి్లష్‌లో వున్న గొప్పతనం ఏంటంటే, వచ్చిన వాళ్ళకంటే, వస్తుందనుకునేవాళ్ళే ఎక్కువ. ఈ సూత్రాన్ని కనిపెట్టింది ఎలుక. అవతలోడు ఏం మాట్లాడినా ఆబియస్లీ ఆసం అని అరిచేది. ఎలుక ఏం మాట్లాడుతోందో అర్థం కాకపోయినా, అధికారులు తమకి తోచిన అర్థాన్ని అనువాదం చేసుకునేవాళ్ళు.
అనువాదం ఒక జీవ నది. నీటిచుక్కని రుచి చూస్తే చాలు, నదిపైన ఏకంగా కావ్యమే రాసేయచ్చు. అలాగే ఇంకోసారి ‘‘తూనికలు, కొలతలు తొంభైయారు చుట్టుకొలతల చట్టం ప్రకారం, ధనధ్రువ ముక్తాయింపు, నిశ్చేష్ట నిర్మూలనా నిబద్ధ శేషవిలువ గురించి చెప్పండి’’ అని అధికారులు అడిగితే – ‘‘వెయిట్స్ అండ్ హైట్స్ ఆల్వేస్ స్ట్రెయిట్, కాలిక్యులేటెడ్ అండ్ డిఫైన్డ్ రిఫైన్డ్ బై వేరియస్ పీపుల్ అండ్ ఎనిమల్’’ అని అర్థం చెప్పింది ఎలుక.
జీవితమే అర్థంకాక లోకమంతా గందరగోళంగా వుంటే పదాల అర్థాల గురించి ఆలోచించే ఓపిక ఎవరికుంది? అందువల్ల మన ఎలుక సజావుగా ఉద్యోగం చేసుకునేది.ఒకసారి కాస్తోకూస్తో ఇంగ్లి్లష్ వచ్చిన అధికారి దానికి ఎదురయ్యాడు. వాడు నేరుగా ఇంగ్లి్లష్‌లోనే ప్రశ్నించాడు. ఎలుక కొంచెం కంగారుపడి వెంటనే తమాయించుకుంది.‘‘ఇష్ట ఫలేశ్రుయః కషాంతే కాకీకెకైకఃకహ!’’ అని బదులిచ్చింది. ఎదుటివాడు భక్తితో చేతులు జోడించి ‘‘మహాప్రభూ, సంస్కృతంలో మాట్లాడుతున్నారా?’’ అన్నాడు. తమకి రాని భాష ఎవడు మాట్లాడినా భయంభక్తి అసంకల్పితంగా ఏర్పడతాయి.
‘‘నా దృష్టిలో ప్రభుత్వమంటే దైవంతో సమానం. అందుకని దేవభాష మాట్లాడుతున్నా’’ అని చెప్పింది ఎలుక. దాని ప్రతిభని గుర్తించిన ప్రభుత్వం వారు ఉత్తరకొరియాలో జరుగుతున్న భాషా ఉత్సవాలకి ప్రతినిధిగా పంపారు. కొరియా భాషలో జంకుగొంకు లేకుండా కవిత్వం కూడా చదివింది.‘‘మీకు మంగోలు భాష తెలుసా?’’ అని అడిగాడు కొరియా మంత్రి. ‘‘ఒక్క మంగోలేంటి, అన్ని అడ్డగోలు భాషలు తెలుసు’’ అని చెప్పింది ఎలుక. నోటికొచ్చిన భాషలో కవిత్వం చదివితే, దాన్ని మంగోల్‌గా వాడు గుర్తించినందుకు సంతోషపడింది.కాలం ఒక్క తీరుగా వుండదు. పచ్చని చెట్టుకి కూడా చెదలు పడతాయి. కాలు మీద కాలేసుకుని మనం కూర్చునేలోగా, మన కాళ్ళు లాగేవాడు ఒకడు పుడతాడు. ఒక చెదపురుగు ఎలుకకి పోటీగా వచ్చింది.
‘‘పుస్తకాలని అక్కడక్కడ రుచి చూసిన ఎలుకకే అంత జ్ఞానముంటే, పూర్తిగా నమిలి, పొడిపొడి చేసిన నాకెంతుండాలి?’’ అని పోటీకి దిగింది.ఊహించని శత్రువు ఎదురైనపుడు ఊహలతో, వ్యూహాలతో పనులు జరగవు. ఈ ఎరుక వున్నందువల్ల మన ఎలుక వెంటనే చెదపురుగుని నమిలి తినేసింది.‘‘అది జ్ఞానాన్ని తింటే, దాన్ని తినడం నా జ్ఞానం’’ అని లోకానికి తెలియజేసింది.
– జి.ఆర్. మహర్షి