
సింహ‘బలుడు’
హ్యూమర్‌ప్లస్
భార్యకంటే సింహమే మేలని తలంచిన సుబ్బారావు ఒకరోజు జూకి వెళ్లి సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకాడు. హఠాత్తుగా తమ ముందు దూకిన ప్రాణిని చూసి సింహం జడుసుకుని ఒక అడుగు వెనక్కి వేసింది. జీవితాన్ని ఈదడం కంటే నీటి గుంతను ఈదడం సులువని భావించిన సుబ్బారావు ఎన్‌క్లోజర్ చుట్టూ వున్న కందకం లోంచి ఈదుకుంటూ వెళ్లి సింహం ముందు నిలబడ్డాడు.
‘‘చూపులు కలిసిన శుభవేళ...’’ అని పాడుకుంటూ సింహానికి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అది వెనక్కి తగ్గి ఆలోచనలో పడింది. ‘‘నేను సింహమని తెలిసే వచ్చాడా? తెలియక వచ్చాడా? తెలిసే వస్తే వీడు మహా ధైర్యవంతుడు, వీడ్నేం చేయలేం. తెలియక వచ్చినా ఏమీ చేయలేం. ఎందుకంటే సింహమంటే తెలియనివాడ్ని సింహం ఎలా భయపెట్టగలదు?’’ అని పరిపరి విధాల యోచించింది. అది జూ సింహం. టైంసెన్స్ ఎక్కువ. సమయానికి భోజనం దొరుకుతుంటే మెదడు వేగంగా పనిచేస్తుంది. ఇదంతా దూరం నుంచి మగసింహం చూసింది. తన భార్య ఎదురుగా ఒక మనిషి నిలబడడమా? వీడెవడో సింహస్వప్నంలా ఉన్నాడే అనుకుంటూ సింహావలోకనం చేసుకుంది.
పురుషుడు, పౌరుషం ఈ రెండూ వేర్వేరు విషయాలని తెలిసినా, భార్య ముందు నోరు తెరవక చాలాకాలమైనందువల్ల, అవకాశం వచ్చింది కదా అని గర్జించడానికి ప్రయత్నించింది. ఆడసింహం గుర్రున చూసేసరికి ‘మియ్యావ్’ అని సౌండ్ చేసింది. ‘‘వేట గురించి వినడమే తప్ప, ఇంతవరకూ ఆడలేదు... అందుకని..’’ అని నసిగింది మగసింహం. ‘‘మీ తాత ముత్తాతలు కూటికి గతిలేనివాళ్ళు కాబట్టి వేటాడారు. మనకేం ఖర్మ. మూడుపూట్ల తిండి మన దగ్గరకే వచ్చేస్తూ వుంది. కాకపోతే ప్రతిరోజూ నానా చెత్తవెధవల్ని మనకు తెచ్చి చూపిస్తారు. వాళ్లలో వీడొకడు’’
‘‘సుబ్బారావు ఉత్సాహంగా సింహాలతో ఒక సెల్ఫీ తీసుకుని, ఆ సింహం జూలుతో జడ వేయబోయాడు. మరో సింహం దువ్వెన కూడా తెచ్చి ఇచ్చింది. ‘‘సింహాలు దువ్వెన కూడా వాడతాయా?’’ అడిగాడు. ‘‘కయ్యానికి కాలు దువ్వడం ఎప్పుడో మానేశాం. ఇలా పేలు చూసుకుంటూ జుత్తు దువ్వుకుంటున్నాం...’’ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆడసింహం ఒక చూపు చూసింది. మగసింహం మియ్యావ్ అంది. ‘‘అదేంటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు. ‘‘పెళ్లి తరువాత ఎవడైనా పిల్లే’’ ఇంతలో బయట జనం గట్టిగా కేకలు పెట్టసాగారు. ‘‘బాబ్బాబూ, ట్రేలో తెస్తే తప్ప ఏదీ తినం మేము. మా పరువు తీయకుండా వళ్లిపో’’ అని బతిమలాడితే సుబ్బారావు మళ్లీ ఈదుకుంటూ బయటికి వచ్చాడు. టీవీల వాళ్ళంతా సుబ్బారావు పైకి సింహాల్లా దూకారు.
‘‘ఎందుకు చనిపోవాలనుకున్నావ్?’’ ‘‘పెళ్ళాం వేధిస్తూ వుంది’’ ‘‘ఎలాంటి వేధింపులు’’ ‘‘కుడివైపు తిరిగితే ఎడమ అంటుంది. లెఫ్ట్ తిరిగితే ముందుకి, ముందుకు తిరిగితే వెనక్కి నడవమంటుంది. వెనక్కి నడిస్తే గాల్లో ఎగరమంటుంది’’ ‘‘ఎడ్డెమంటే తెడ్డెమన్నమాట’’. ‘‘తెడ్డెం కాదు, తెడ్డు కట్టెతో బాదుతుంది’’ ‘‘తిరగబడకపోయావా?’’ ‘‘బడ్డాను. రెండుసార్లు ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వచ్చింది.’’ ఇంతలో బడితెపూజ మహిళా సంఘం వాళ్ళు వచ్చారు.
‘‘దుర్మార్గుడా? భార్యల్ని భర్తలు వేధించడమే హిస్టరీ, భర్తల్ని భార్యలు వేధించడం మిస్టరీ. నువ్వే వేధిస్తున్నావని మీ ఆవిడ కంప్లయింట్ ఇచ్చింది. ఈ అవమానం భరించలేక తాను కూడా సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకుతానని పరిగెత్తుకుంటూ జూకి వెళ్ళింది’’ అన్నారు.సుబ్బారావు ఉలిక్కిపడి ‘‘రక్షించండి’’ అని అరిచాడు. ‘‘భార్యపైన అంత ప్రేమ ఉన్నవాడివి, ఎన్‌క్లోజర్‌లో ఎందుకు దూకావు’’ ‘‘నేను రక్షించమంటున్నది సింహాల్ని’’
- జి.ఆర్. మహర్షి