
‘‘ఓయీ మానవా... నేను మరణ దండన దేవతను. నిజం చెప్పు.రాణిగారి సంపదను కొల్లగొట్టింది నువ్వే కదా’’ అని భయంకరంగా గర్జించింది. దొంగ గజగజ వణికిపోయాడు.
ఓ దొంగ తన దారిన తను పోతున్నాడు. ఆ దొంగ వెళుతున్న దారిలో ఎవరిదో స్వామీజీ ప్రవచనం వినిపిస్తోంది. ‘మంచి మాటలు వింటే మనం చెడ్డ పనులు చెయ్యలేం’ అనుకుంటూ గట్టిగా చెవులు మూసుకున్నాడు. అలా నడుస్తూ వెళ్తుండగా కుడి కాలిలోకి కసుక్కున ముల్లు దిగింది. ‘అబ్బా’ అనుకుంటూ కిందికి వంగి, కుడిచేత్తో ముల్లును లాగేసుకున్నాడు. ఈలోపు కుడి చెవిలోకి స్వామీజీ మాట ఒకటి దూరిపోయింది. ‘‘... దేవుళ్లకు, దేవతలకు నీడలు ఉండవు ...’’ అంటున్నారాయన. దొంగ గబుక్కున చెయ్యి తీసి మళ్లీ తన చెవి మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత స్వామీజీ మాటలు ఏమీ దొంగకు వినిపించలేదు కానీ, విన్న ఆ ఒక్కమాట మనసులో ఉండిపోయింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఓసారి అంతఃపురంలో రాణిగారి ఆభరణాలు దోచుకుంటూ పట్టుబడ్డాడు. రాజభటులు తీసుకెళ్లి కొట్లో బంధించారు. నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందన్నారు. దొంగ లొంగలేదు. ‘నేను దొంగతనం చేయలేదు’ అన్నాడు.
చివరికి ఇలా కాదనుకుని, ఓ అర్ధరాత్రి రాణిగారు మారువేషంలో దొంగ ఉన్న బందీఖానా దగ్గరకు వచ్చారు. ‘‘ఓయీ మానవా... నేను మరణ దండన దేవతను. నిజం చెప్పు. రాణిగారి సంపదను కొల్లగొట్టింది నువ్వే కదా’’ అని భయంకరంగా గర్జించింది. దొంగ గజగజ వణికిపోయాడు. నిజం ఒప్పుకోబోయాడు. కానీ అంతలోనే అతడికి స్వామీజీ మాట గుర్తుకువచ్చింది. దేవుళ్లకు, దేవతలకు నీడలు ఉండవు కదా! మరి ఈ వెన్నెల కాంతిలో మరణ దండన దేవత వెనకే ఆమె నీడ కూడా ఉందేమిటి? అనుకున్నాడు. నీడ ఉంది కాబట్టి ఈమె దేవత కాదు, మనిషే అనుకున్నాడు. అలా అనుకోగానే అతడికి ధైర్యం వచ్చింది. ‘‘ఈ దొంగతనం నేను చేయలేదు’’ అని ధైర్యంగా అన్నాడు. రాణిగారు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దొంగ నిర్దోషి అని విడుదల చేయించారు. దొంగ తన జ్ఞానానికి సంతోషించాడు. అనుకోకుండా చెవిన పడిన మాటలే తనను శిక్షనుంచి తప్పిస్తే, నిజంగా జ్ఞానులు చెప్పే మాటలు తనకెంత ఉపకరించేవో అనుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment