ఆ రోజు ఎలా పడితే అలా ఉంటా! | Ileana sunday special | Sakshi
Sakshi News home page

ఆ రోజు ఎలా పడితే అలా ఉంటా!

Published Sat, Apr 11 2015 10:42 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

ఆ రోజు  ఎలా పడితే అలా ఉంటా! - Sakshi

ఆ రోజు ఎలా పడితే అలా ఉంటా!

హాయ్ ఇలియానా... సండే అంటేనే అందరికీ స్పెషల్. మరి మీకు?

ఆదివారం అంటే ఎవరికైనా హాలిడే మూడ్ ఉంటుంది. నేనైతే ఆదివారం నాడు పూర్తిగా రిలాక్స్ అయిపోతా. ప్రపంచంలో నా అంత బద్ధకస్తురాలు ఉండదేమో అన్నట్లుగా ఉంటాను. ఆదివారం ఆలస్యంగా నిద్ర లేస్తాను. అన్ని పనులూ బద్ధకంగా పూర్తి చేస్తాను. మా ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏదంటే అది బాల్కనీయే. అక్కడ కూర్చుని టీ సిప్ చేస్తూ, పరిసర ప్రాంతాలను పరిశీలించడం నాకిష్టం. ఆదివారం నేనెక్కువగా చేసే పని ఇదే.

 అంటే.. ఆదివారం వ్యాయామాలకు కూడా సెలవిచ్చేస్తారా?

దాదాపు అంతే అనుకోండి. గోవాలో అమ్మా నాన్నలతో కలిసి ఉండేదాన్ని. ముంబయ్‌లో ఒంటరిగా ఉంటున్నాను. అది చెయ్యి.. ఇది చెయ్యి.. అని నసపెట్టేవాళ్లు ఉండరు (నవ్వుతూ). అందుకే నాకు నచ్చిన రీతిలో ఉంటాను. ఆదివారం అంటే సెలవు దినం అని స్కూల్ డేస్ నుంచే బలంగా మనసులో నాటుకుపోయింది. పెద్దయ్యాక కూడా ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది.

సండే కేవలం ఒంటరిగా గడపడమేనా? ఏమైనా పార్టీలు ప్లాన్ చేసుకుంటారా?

నేను పార్టీ పర్సన్ కాదండి. నా ఫ్రెండ్స్‌లో కూడా పార్టీ యానిమల్స్ ఎవరూ లేరు. మేమందరం కలిస్తే హాయిగా టీవీ చూడటం, షాపింగ్‌కి వెళ్లడం, ఏదైనా హోటల్‌లో డిన్నర్ తీసుకోవడం.. అంత మటుకే. మాకిదే పెద్ద ఎంజాయ్‌మెంట్‌లా భావిస్తాం.

మరి.. ఆదివారం ఆహార నియమాలకు కూడా సెలవిచ్చేస్తారా?

దాదాపుగా ఇచ్చేస్తా. కేక్స్, ఐస్‌క్రీమ్స్.. ఇలా శరీర బరువు పెంచేవన్నీ లాగించేస్తా. విడి రోజుల్లో వంట చేసేంత తీరిక నాకు ఉండదు. ఆదివారం తీరిక ఉన్నా చేయను. అప్పుడప్పుడూ కేక్స్ బేక్ చేస్తుంటాను. బేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కేక్స్ బేక్ చేసేటప్పుడు ఓ సువాసన వస్తుంది కదా.. అదంటే నాకు చాలా ఇష్టం.

సండే షూటింగ్స్ లేకపోతే బాగుండు అనుకుంటారా?

అవును. కానీ, అప్పుడప్పుడూ షూటింగ్‌కి వెళ్లక తప్పదు. అందుకే ముందురోజు నుంచే ‘రేపు మనకు సెలవు లేదు.. షూటింగ్‌కి వెళ్లాలి’ అని మానసికంగా ప్రిపేర్ అవుతుంటాను.

మీ మాటలను బట్టి ఆదివారం అస్సలు పని చేయరేమో అనిపిస్తోంది...?

దాదాపు అంతే. కానీ, ఒకే ఒక్కటి చేస్తాను. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ఇష్టం. అందుకే వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుని ఇల్లంతా తళతళలాడిపోయేలా చేసేస్తా. దీన్ని మాత్రం నేను పనిలా భావించను. సరదా కోసం చేస్తున్నట్లుగా ఫీలవుతా.

 మీ ఆదివారం కబుర్లు వింటుంటే భలే ఉందే...

చెబుతుంటే నాక్కూడా భలే ఉంది. మీకింకో విషయం చెప్పాలి. ఆదివారం ఇంట్లో ఉంటే.. క్యాజువల్ ప్యాంట్, టీ-షర్ట్ వేసుకుంటా. మేకప్ వేసుకోను. జుత్తుని ఫ్రీగా వదిలేస్తా. ఓ పద్ధతిగా మాత్రం ఉండను. అప్పుడప్పుడు ఎలా పడితే అలా ఉండటం కూడా చాలా బాగుంటుంది.

 ఫైనల్‌గా సండే గురించి ఇంకా ఏం చెబుతారు?

మామూలుగా మనం పండగలప్పుడు ‘హ్యాపీ దివాలి’ అనీ, ‘హ్యాపీ హోలీ’ అనీ చెప్పుకుంటుంటాం కదా. నేను సండేని పండగలా భావిస్తాను కాబట్టి, ఒకవేళ బాగా దగ్గరైనవాళ్లకి ఫోన్ చేస్తే, ‘హ్యాపీ సండే’ అని చెబుతా. ఇప్పుడు మీ అందరికీ కూడా అదే చెబుతున్నా ‘హ్యాపీ సండే’.
 - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement