ఇక తుమ్మపూడి వెళ్లనవసరం లేదేమో – ఈ మాటలు అంటుంటే నాకెంతో దుఃఖం పొర్లుకొస్తోంది. కారణం.. సంజీవదేవ్‌లో సగం సులోచన గారు. సులోచనగారు (85) సోమవారం తెల్లవారుజామున విశాఖపట్టణంలో వారి పెద్ద అబ్బాయి జోగేంద్రదేవ్ దగ్గర గుండెపోటుతో కన్నుమూశారు. రసహృదయులు, చిత్రకారులు, స్నేహశీలి, నికొలస్ రోరిక్, అసిత్ కుమార్ హల్దా లాంటి ఎందరో ప్రముఖుల స్నేహితుడు సంజీవదేవ్. సులోచనగారు మదరాసు నగరంలో స్కూలు, కాలేజి విద్య అభ్యసించారు. ఎలాంటి డిగ్రీలు లేని మేధావి సంజీవదేవ్‌ని 1954లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచీ సంజీవదేవ్ స్వస్థలం తుమ్మపూడిలోని ఇంట్లో భర్తకు తన అనురాగాన్ని, నిత్యం ఆయన్ని దర్శించే ఆయన స్నేహితులకు అతిథి సత్కారాలను అందిస్తూ ఆయన కృషిలో భాగస్వామి అయ్యారు. ‘రసరేఖ’ సంజీవదేవ్ నివాసానికి ఎవరు ఎప్పుడొచ్చినా ఎన్నాళ్లున్నా అన్ని రోజులూ అతిథి మర్యాదలు సమానాదరణతో చేసేవారు. ఆమె వడ్డించే శాకాహార విందు భోజనం ఆస్వాదించేవాళ్లు. ఉదయం ఎనిమిదిన్నరకి సంజీవదేవ్ సహా అతిథులందరికీ భోజనం, మధ్యాహ్నం ఫలహారం, సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయ సమయంలో రాత్రి భోజనం చేయటం అలవాటు. ఇవన్నీ సులోచనగారు దగ్గరుండి చూసుకునేవారు. సులోచనా సంజీవదేవ్ గారికి ఇద్దరబ్బాయిలు. పెద్దబ్బాయి జోగేంద్రదేవ్ ఎం.ఎ. పేరాసైకాలజీ చదివి వైజాగ్ లో వ్యాపారంలో స్థిరపడ్డారు. ఇక రెండవ అబ్బాయి మహేంద్ర దేవ్ దేశంలోనే పేరుగాంచిన ఆర్థికవేత్త. ముంబైలోని ఇందిరాగాంధీ డెవలప్‌మెంట్ స్టడీస్ యూనివర్సిటీకి డైరెక్టర్‌గా వున్నారు.
ఇంకా చికాగోలో గల అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థకు ఈమధ్యనే వైస్ చైర్‌గా నియమితులయ్యారు. నార్ల, బుచ్చిబాబు, గోపీచంద్, కొంగర జగ్గయ్య, ఆవుల సాంబశివరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీపీ కె. సదాశివరావు, సి.వేదవతి, వేగుంట కనకరామబ్రహ్మం, కొండపల్లి శేషగిరిరావు, ఎస్వీ రామారావు, చలసాని ప్రసాదరావు, దండమూడి మహీధర్, నరిసెట్టి ఇన్నయ్యగారి కుటుంబం, రావెల సోమయ్య, రావెల అరుణ లాంటి వారెందరో వారి ఇంట ఆతిథ్యం పొందినవారే. ఇక 1965 నుంచి నేను (వెనిగళ్ళ వెంకటరత్నం), మిథునం ఫేమ్ శ్రీరమణ, తపస్వి, వైవీ రావు, రోజుల తరబడి వారి ఇంట బసచేసి సంజీవదేవ్ స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించిన వాళ్లం. తొలి రోజులలో సంజీవదేవ్ రచనలను కాపీ చేయటంలో సులోచనగారు సహాయపడినట్లు ఆయన చెప్పుకున్నారు. కళల కాణాచిగా పేరొందిన తుమ్మపూడిని అంతర్జాతీయ పటంపై పెట్టిన ఘనత సంజీవదేవ్‌దే అయినా వారందరికీ ఆత్మీయ ఆతిథ్యం పంచింది మాత్రం సులోచనగారే. శ్రీరమణ, సంజీవదేవ్ మీద రాసినప్పుడల్లా సులోచనగారి ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూనే వచ్చారు. సులోచనగారి స్వస్థలం తెనాలి తాలూకా దోనేపూడి గ్రామం. సులోచనగారి మరణంతో రసరేఖ మూగబోతుందేమో!
– వెనిగళ్ళ వెంకటరత్నం (సులోచనా సంజీవదేవ్ స్మృతిలో...)
రసరేఖ నిండుకుంది!
Published Tue, Dec 19 2017 12:00 AM | Last Updated on Tue, Dec 19 2017 12:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment