Sanjeev Dev
-
రసరేఖ నిండుకుంది!
ఇక తుమ్మపూడి వెళ్లనవసరం లేదేమో – ఈ మాటలు అంటుంటే నాకెంతో దుఃఖం పొర్లుకొస్తోంది. కారణం.. సంజీవదేవ్‌లో సగం సులోచన గారు. సులోచనగారు (85) సోమవారం తెల్లవారుజామున విశాఖపట్టణంలో వారి పెద్ద అబ్బాయి జోగేంద్రదేవ్ దగ్గర గుండెపోటుతో కన్నుమూశారు. రసహృదయులు, చిత్రకారులు, స్నేహశీలి, నికొలస్ రోరిక్, అసిత్ కుమార్ హల్దా లాంటి ఎందరో ప్రముఖుల స్నేహితుడు సంజీవదేవ్. సులోచనగారు మదరాసు నగరంలో స్కూలు, కాలేజి విద్య అభ్యసించారు. ఎలాంటి డిగ్రీలు లేని మేధావి సంజీవదేవ్‌ని 1954లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచీ సంజీవదేవ్ స్వస్థలం తుమ్మపూడిలోని ఇంట్లో భర్తకు తన అనురాగాన్ని, నిత్యం ఆయన్ని దర్శించే ఆయన స్నేహితులకు అతిథి సత్కారాలను అందిస్తూ ఆయన కృషిలో భాగస్వామి అయ్యారు. ‘రసరేఖ’ సంజీవదేవ్ నివాసానికి ఎవరు ఎప్పుడొచ్చినా ఎన్నాళ్లున్నా అన్ని రోజులూ అతిథి మర్యాదలు సమానాదరణతో చేసేవారు. ఆమె వడ్డించే శాకాహార విందు భోజనం ఆస్వాదించేవాళ్లు. ఉదయం ఎనిమిదిన్నరకి సంజీవదేవ్ సహా అతిథులందరికీ భోజనం, మధ్యాహ్నం ఫలహారం, సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయ సమయంలో రాత్రి భోజనం చేయటం అలవాటు. ఇవన్నీ సులోచనగారు దగ్గరుండి చూసుకునేవారు. సులోచనా సంజీవదేవ్ గారికి ఇద్దరబ్బాయిలు. పెద్దబ్బాయి జోగేంద్రదేవ్ ఎం.ఎ. పేరాసైకాలజీ చదివి వైజాగ్ లో వ్యాపారంలో స్థిరపడ్డారు. ఇక రెండవ అబ్బాయి మహేంద్ర దేవ్ దేశంలోనే పేరుగాంచిన ఆర్థికవేత్త. ముంబైలోని ఇందిరాగాంధీ డెవలప్మెంట్ స్టడీస్ యూనివర్సిటీకి డైరెక్టర్‌గా వున్నారు. ఇంకా చికాగోలో గల అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థకు ఈమధ్యనే వైస్ చైర్‌గా నియమితులయ్యారు. నార్ల, బుచ్చిబాబు, గోపీచంద్, కొంగర జగ్గయ్య, ఆవుల సాంబశివరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీపీ కె. సదాశివరావు, సి.వేదవతి, వేగుంట కనకరామబ్రహ్మం, కొండపల్లి శేషగిరిరావు, ఎస్వీ రామారావు, చలసాని ప్రసాదరావు, దండమూడి మహీధర్, నరిసెట్టి ఇన్నయ్యగారి కుటుంబం, రావెల సోమయ్య, రావెల అరుణ లాంటి వారెందరో వారి ఇంట ఆతిథ్యం పొందినవారే. ఇక 1965 నుంచి నేను (వెనిగళ్ళ వెంకటరత్నం), మిథునం ఫేమ్ శ్రీరమణ, తపస్వి, వైవీ రావు, రోజుల తరబడి వారి ఇంట బసచేసి సంజీవదేవ్ స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించిన వాళ్లం. తొలి రోజులలో సంజీవదేవ్ రచనలను కాపీ చేయటంలో సులోచనగారు సహాయపడినట్లు ఆయన చెప్పుకున్నారు. కళల కాణాచిగా పేరొందిన తుమ్మపూడిని అంతర్జాతీయ పటంపై పెట్టిన ఘనత సంజీవదేవ్‌దే అయినా వారందరికీ ఆత్మీయ ఆతిథ్యం పంచింది మాత్రం సులోచనగారే. శ్రీరమణ, సంజీవదేవ్ మీద రాసినప్పుడల్లా సులోచనగారి ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూనే వచ్చారు. సులోచనగారి స్వస్థలం తెనాలి తాలూకా దోనేపూడి గ్రామం. సులోచనగారి మరణంతో రసరేఖ మూగబోతుందేమో! – వెనిగళ్ళ వెంకటరత్నం (సులోచనా సంజీవదేవ్ స్మృతిలో...) -
రంగుల రాగం సంజీవదేవ్
ముప్పయి ఐదేళ్ళ క్రితం – నేను వ్యవసాయ కళాశాల చదువులో పచ్చదనంలో విద్యార్థిగా వున్న రోజుల్లో మిత్రుల ద్వారా సంజీవదేవ్ గురించి మొదటిసారి విన్నాను. అçప్పుడే ‘సంజీవదేవ్ లేఖలు,’ ‘లేఖల్లో సంజీవదేవ్’ చదివాను. ఒక అపురూపమైన అనుభవానికి లోనయాను. నా చదువు పూర్తయాక ఉద్యోగరీత్యా కోల్‌కతా, హుబ్లీలో పని చేసి బదిలీ మీద ‘నిడుబ్రోలు’కు 1985లో వచ్చాక తెలిసింది, దగ్గర్లోనే తుమ్మపూడి అనే పల్లె్లటూళ్ళో సంజీవదేవ్ వుంటారని. అదే సంవత్సరం ఆయన్ని కలవడానికి మిత్రుల్తో కల్సి ఆ వూరెళ్ళాను. ఇంట్లోకి వెళ్తూండగా ద్వారం దగ్గర ‘రసరేఖ’ అనే అక్షరాలు తళుక్కుమంటూ కన్పించాయి. ఇంటికి ఆయన పెట్టుకున్న పేరది. చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించారు. చాలాసేపు మాట్లాడుకున్నాం. మధ్యలో తన శ్రీమతి సులోచనను పరిచయం చేశారు. అట్లాగే ముందుగదిలో గోడమీద కాంతులీనుతున్న ఓ పెయింటింగ్నూ పరిచయం చేశారు. అది నికొలస్ రోరిక్ గీసిన చిత్రం. సంజీవదేవ్‌కు బహుమానంగా దక్కింది. ఆ రోజు సంజీవదేవ్‌తో నా పరిచయం కూడా నా జీవనయానంలో నాకు దక్కిన బహుమానంగా భావిస్తాను. ఆయన్ని చూసొచ్చాక ఓ ఉత్తరం రాసాను. వెన్వెంటనే ఆయన నుంచి ఉత్తరం అందుకున్నాను. ఎంత అందమైన దస్తూరి! సరిగ్గా ఆయన లానే వుంది. తదాదిగా ఉత్తరాలు రాస్తూ పోయాను. ఆయనా బదులిచ్చారు. నాకు అందిన ఆ ఉత్తరాలు ఒక సాంస్కృతిక సంపద. నా మొదటి కవితా సంపుటి ‘జీవన వీచిక’ను 1987లో వేద్దామనుకున్నపుడు ఆయనను కలిసి ముందుమాట రాయమన్నాను. ‘ధ్వని’ శీర్షికతో రాసిన ముందుమాటలో ఓ చోట ఆయనన్నారు: ‘నిత్యజీవితంలో ఒక సత్యమైన ఆనందం కవితను రచించటం, కవితను చదవటం, కవితను గురించి రచించటం’. ఆ వాక్యంలోని ‘సత్యమైన ఆనందం’ అనే పదబంధం ఇప్పటికీ నన్నాలోచింపజేస్తుంది. 1914 జూలై మూడో తేదీన కన్ను తెరిచిన సంజీవదేవ్ బాల్యంలోనే తల్లి వెంకాయమ్మను పోగొట్టుకున్నారు. తండ్రి రామదేవరాయలు. ఆయనతో చనువు తక్కువ. ఈ నేపథ్యంలో చదువు మొదలెట్టారుగానీ అది ఆరో తరగతి దాకానే సాగింది. ఆ పైన బడికెళ్ళింది లేదు. ఐనా స్వయంకృషితో ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచి, జపనీస్ భాషల్ని నేర్చుకున్నారు. కాల్పనిక భాషగా రూపొందిన ‘ఎస్పిరాంటో’ను కూడా ఆసక్తితో తెలుసుకున్నారు. ఈ భాషా పరిజ్ఞాన పటిమ ఆయనకు ఉపకరణమైంది, మానవ సంబంధాల్ని విస్తారం చేయడానికి. చిన్న వయసు నుంచే యాత్రాభిలాషి ఐన సంజీవదేవ్ తన పద్నాలుగోయేట స్వామి రామతీర్థ జీవితాన్నీ రచనల్నీ చదవడం ఒక మలుపు. రామతీర్థ హిమాలయ పర్యటనలూ, ఆయన చేసిన హిమాలయ వర్ణనలూ సంజీవదేవ్‌ను ఆకట్టుకున్నాయి. స్వామి సత్యదేవ్ రాసిన ‘మేరీ కైలాస్ యాత్ర’ తెప్పించుకుని చదివాక ఆయన యాత్రాసక్తి మరింత పెరిగింది. రామకృష్ణ మిషన్ వారి ఆంగ్ల మాసపత్రిక ‘ప్రబుద్ధ భారత్’ సంపాదకులుగా వున్న స్వామి పవిత్రానందకు లేఖ రాసారు, తన యాత్రాభిరుచిని చెబుతూ. ఆయన రమ్మని చెప్పడం సంజీవదేవ్‌కు సంతోషాన్నిచ్చింది. అలా హిమాలయ ప్రాంతాలకు మొదటిసారి వెళ్లడం ఆయన జీవన పరిధిని పెంచింది. హిందీ రచయిత ప్రేమ్‌చంద్, చిత్రకారుడు అసిత్‌కుమార్ హాల్దార్, విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్లను ఈ యాత్రలోనే ఆయన కలుసుకోగలిగారు. టాగూర్‌తో ఆయన బెంగాలీలో మాట్లాడ్డమే కాదు, టాగూర్ కవితల్ని రెండింటిని తన స్వరంతో వినిపించి ఆయన్ని ఆకట్టుకున్నారు. వ్యక్తుల పరిచయమే కాక, మంచుకొండల పరిచయం కూడా సంజీవదేవ్‌ను మోహనపరిచింది. లోయలూ, శిఖరాలూ, దేవదారు వృక్షాలూ ఆయన మదిలో ముద్రలైనాయి. అవన్నీ ఆ తదుపరి కాలంలో ఆయన చిత్రాల్లో దర్శన మిచ్చాయి. ‘ఆ హిమాలయ సంధ్యలో ఆ ఎత్తున కూర్చుని క్రమేణా పొగమంచుతో కప్పబడుతూ వస్తున్న ఆ దూరపు రహస్యమయ ప్రకృతిని చూస్తుంటే కళ్ళు వాటంతటవే నిమీలితాలైపోయి, హృదయం ఏదో అనిర్వచనీయ ఆనందాన్ని అనుభవించేది. ఏదో కనిపించని రూపలావణ్యం కనిపిస్తున్నట్టు, ఏదో వినిపించని శబ్దమాధురి వినిపిస్తున్నట్టు తట్టేది’. అదీ ఆయన రసదృష్టి! ప్రధానంగా సంజీవదేవ్ కళాజ్ఞాని. కళ మీద అనేక వ్యాసాలు రాశారు. తెలుగులో రాయకమునుపే ఆంగ్లంలో రాశారు. తెలుగులో ఆయన ప్రథమ రచన ‘కళ–విజ్ఞానము’. 1961లో చిత్రకళలో సాధన మొదలెట్టి అనేక చిత్రాలు గీసారు. వాటిల్లో కొండలూ, చెట్లూ, జలాలూ, కాంతులూ ఇవేనా అంటే మానవరూపాలూ వుంటాయి అక్కడక్కడ. పోస్టుకార్డు సైజు చిత్రాల్ని ఉత్తరాల్తో పాటు పంపే వారు మిత్రులకు. అలా నేను కూడా ఒకట్రెండు అందుకున్నాను. నా వివాహానికి ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్ళినపుడు ప్రత్యేకంగా రెల్లు నిగనిగలాడే ఓ చిత్రాన్నిచ్చారు కానుకగా. అది ఇవాళ్టికీ మా ఇంట్లో భద్రంగా వుంది. చిత్రరచన మీదే కాక ఫొటోగ్రఫీ మీదా ఆయనకు ఆసక్తి వుండేది. బెంగళూరులోని విఖ్యాత ఫొటోగ్రాఫర్ డాక్టర్ జి.థామస్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఫొటోగ్రఫీకి సంబంధించిన వివిధ విషయాలను తెలుసుకున్నారు. ఐతే క్రమంగా దాని మీద వ్యామోహాన్ని తగ్గించుకున్నారు. తన విద్యా వ్యాసంగాన్ని, తార్కిక సత్తాను అది తీసివేసేటట్టు గోచరించింది కనుక. సంజీవదేవ్ అంటే చాలామందికి ఆయన ఉత్తరాలే. ఉత్తరాలు రాసే ప్రక్రియను కళాత్మకం చేసారాయన. ఉత్తరం అందగానే వెన్వెంటనే జవాబు రాయడం, రంగురంగుల కాగితాల మీద రాయడం ఆయన ప్రత్యేకతలు. ఆయన నుంచి నేనందుకున్న యాభైకి పైగా ఉత్తరాల్లో ఒకచోట రాశారు: ‘జీవితాన్ని సజీవంగా జీవించడమే ఆనందం, ఆనందమే జీవనావగాహన’. ఆయన వ్యాసాలూ, సంక్షిప్త రచనలూ ‘రసరేఖలు’, ‘దీప్తి ధారలు’, ‘తేజో రేఖలు, ‘రూపారూపాలు’ పేర్లతో పుస్తకాలుగా వచ్చాయి. ‘గ్రీన్ అండ్ బ్లూ’, ‘బ్లూ బ్లూమ్స్’, ‘డస్ట్ అండ్ మిస్ట్’, ‘హర్ లైఫ్’ లాంటి ఆంగ్ల రచనల్ని వెల్వరించారు. ఆయన తాత్విక దర్శనం ‘బయో సింఫనీ’లో కనపడుతుంది. అనేక కళల్తో పాటు సంజీవదేవ్‌కు ఆతిథ్య కళ బాగా తెలుసు. తుమ్మపూడిలోని ఆయన ఇంటిని సందర్శించిన వాళ్ళెందరో. రాహుల్ సాంకృత్యాయన్ లాంటి ఉత్తర భారతీయులూ తుమ్మపూడి వచ్చి వెళ్ళారు. భిన్న భావజాలాల్తో వున్నా, ఎవరితోనైనా కలిసిపోగల స్నేహగుణం ఆయనలో వుండటం అటు ఆయన వికాసానికీ ఇటు ఇతరుల వికాసానికీ దోహదం చేసింది. సంజీవదేవ్ తన స్వీయచరిత్రను మూడు దశల్లో రాసుకున్నారు. 1951 వరకూ సాగిన జీవితాన్ని ‘తెగిన జ్ఞాపకాలు’గా, 1951–58 వరకూ సాగిన ప్రయాణాన్ని ‘స్మృతిబింబాలు’గా, 1959–65 వరకూ గడిచిన జీవితాన్ని ‘గతం లోకి’గా రాసుకున్నారు. వీటన్నిటినీ కలిపి ‘తుమ్మపూడి’ పేరుతో సమగ్రంగా ముద్రించిన రాజాచంద్ర ఫౌండేషన్ వారు అభినందనీయులు.వివిధ అభిరుచుల్తో, ప్రయాణాల్తో, వ్యాపకాల్తో, సాహచర్యాల్తో రసవంతంగా సుదీర్ఘకాలం పాటు జీవనయానం చేసిన సంజీవదేవ్ 25–8–1999న ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఆయన జ్ఞాపకమంటే ఒక తుమ్మపూడి, ఒక హిమాలయ చిత్రం, ఒక సరళ కవిత, ఒక పొందికైన ఉత్తరం, ఒక మెత్తని పలకరింపు, ఒక రంగుల రాగం! నాకు రాసిన ఒక ఉత్తరంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఉటంకించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ‘చిరకాలమైన ఏకైక లçక్ష్యం ఏ మనిషికైనా ఒకటే – బాధల నుండీ, దుఃఖాల నుండీ బయటపడి ఆనందంలో జీవించాలని, లేక ఆనందం తనలో జీవించాలని. కనుక మానవులందరికీ ఏదైనా ఒక లక్ష్యం మాత్రమే ఉన్నదనుకుంటే అది Release from sorrow and suffering, living in peace and bliss. మానవ జీవితపు చరమలక్ష్యం, పరమలక్ష్యం ఆనందం అన్నమాట.’ దర్భశయనం శ్రీనివాసాచార్య 9440419039 -
మీసంపెంగ వాసనలు!
హ్యూమర్ మీసాలకూ... కవులకూ ఒకింత దగ్గరి సంబంధం ఉంది. దీనికి చాలా దృష్టాంతాలూ, బోల్డన్ని తార్కాణాలూ ఉన్నాయి. దాదాపు మీసాల్లోని కేశాలెన్నో ఈ దృష్టాంతాలూ అన్నే ఉన్నాయని కవులనూ, మీసాలనూ నిశితంగా పరిశీలించిన వారు అంటుంటారు. ఉదాహరణకు తిరుపతి వెంకట కవులిద్దరూ కూడబలుక్కొని మీసాలు పెంచారు. ‘సినిమాలకు హాలీవుడ్ హీరోలెలాగో, కావ్యాల్లో కవులలాగ. వాళ్లకు మీసాలెందుకు’ అంటూ కొందరు పెద్దలు కోప్పడ్డారు. అప్పుడు సదరు జంటకవులు కాస్తా పద్యంతో బదులిచ్చారు. ‘మేమే కవీంద్రులమని తెల్పడానికి మీసాలు పెంచాం. రోషం కలిగిన వాళ్లెవరైనా మమ్మల్ని గెలిస్తే ఈ మీసాలు తీసి మీ పద సమీపాలలో ఉంచి, మొక్కుతాం. కాబట్టి దుందుడుకుగా ఇలా మీసాలు పెంచాం’ అంటూ మీసాలెందుకు పెంచుతున్నారంటూ అడిగిన వాళ్లను కవిత్వంలో నిరసించారు. ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోఫోండి...’ అన్నట్టుగా పద్యంతో ఫెడీ ఫెడీమని కొట్టి చెప్పారు. కాస్త వయసు మీరాక ఈ బాడీ జాడీలోని జీవితప్పచ్చడికి మొదట ఉన్నంత టేస్టు ఉండదు. ఈ లోతైన ఫిలాసఫీని చాలా తేలిక మాటల్లో తెలిపాడు శ్రీశ్రీ. ‘మీసాలకు రంగేస్తే యౌవనం వస్తుందా... సీసా లేబుల్ మారిస్తే సారా బ్రాందీ అవుతుందా’ అన్నాడాయన. అంటే యుక్త వయసులోనూ.. ముదిమిలోనూ మీసం ఈక్వలే అయినా ఆ తర్వాతి సీక్వెల్లో అవి తెల్లబోతాయనీ... తద్వారా తదుపరి దశలో తెల్లబడి వెలవెలబోతాయనీ తేటతెల్లం చేశాడు. ఆ విషయం గుర్తెరిగిన జ్ఞాని కాబట్టే ఆయన మీసాలు పెంచలేదు. చౌడప్ప అనే మరో కవి... ‘మీసాలూ-అవి పెంచాల్సిన వారి లక్షణాలూ’ అనే అంశం మీద పద్యం రాశాడు. ‘ఇవ్వగల, ఇప్పించగల అయ్యలకే మీసాలుండాలనీ, మిగతావాళ్లకు ఉన్నా అవి పెద్ద లెక్కలోకి రావ’ని కరాఖండీగా చెప్పాడు. మీసాలు ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనే అంశాన్ని నిమ్మకాయ నిలబెట్టిన మీసమంత పవర్‌ఫుల్‌గా చెబుతూ... ‘ఆ మాటకొస్తే రొయ్యకు లేవా బారెడు’ అంటూ మిగతా మీసగాళ్లను అలా తీసిపడేశాడు. అత్యద్భుత కావ్యాలు రాసి... తన పద్యాలతో పండిత-పామరులతో ‘వన్స్‌మోర్’ అంటూ జేజేలు చెప్పించుకున్న జాషువా గారికి తన మీసాల పట్ల మోజు ఎక్కువ. ఒకసారి ప్రముఖ రచయిత, చిత్రకారుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సంజీవ్‌దేవ్‌గారు జాషువాను చూసి ‘ఇంతటి గుబురు మీసాలు లేకపోతే మీరు ఇంకెంత అందంగా ఉండేవారో కదా’ అన్నార్ట. వెంటనే జాషువా గారు తన వేళ్లతో ఒకసారి ఆ మీసాలను పైకి దువ్వుతూ, గట్టిగా నవ్వుతూ ‘నాలో కవిత్వం లేకపోయినా సహించగలను. కానీ మీసాలు లేకపోతే మాత్రం సహించ లేను’ అన్నార్ట. జాషువా గారు తన ఇష్టాన్ని అంత పవర్‌ఫుల్‌గా చెప్పారని అంటారు సంజీవ్‌దేవ్ గారు ‘కవి, మనీషి, జాషువాతో’ అనే తన వ్యాసంలో. జాషువా వంటి మహానుభావుడు మీసాలకు అంత ప్రాధాన్యం ఇచ్చాడంటే కవిత్వం కంటే బలమైనది ఏదో మీసాల్లో ఉండే ఉంటుందని ఆ మీస వ్యాస రత్నాకరాన్ని పరిశీలిస్తే మనకు తెలిసి వస్తుంది. అలాంటి జాషువాగారు వృద్ధాప్యంలో పక్షవాతం వచ్చి మాట్లాడలేకపోయేవారట. ఎవరైనా వచ్చి ‘కవిగారూ... ఎలా ఉన్నారు’ అని పలకరిస్తే... హుందాగా మీసం తిప్పి తాను మానసికంగా దృఢంగా ఉన్నానంటూ బదులిచ్చేవారట. అంటే సదరు పలుకుతో వచ్చే జవాబు కంటే మీసం దువ్వడం ద్వారా ఇచ్చే ఆన్సరే బలమైనదని తెలియడం లేదూ. ‘మెలిదిరిగిన మీసాలను సవరించుకుంటూ జాషువా కవిగారు కలియదిరుగుతుంటే చూస్తున్నవారికి శ్రీనాథ మహాకవి తలపునకు రాకమానడు’ అనుకుంటూ ఆయన మీసాలను తలచుకుంటూ ఉంటారు ఆయనతో కలిసి తిరిగినవారు. అంతెందుకు... ‘వియన్నా సులోచనాలూ, స్విట్జర్లాండు రిస్ట్ వాచి, ఫారెన్ డ్రస్, ఫ్రెంచి కటింగు మీసాలును, ఫారిన్ ఫ్యాషన్ లేనిచో...’ సొంత పెళ్లాలయినా మొగుణ్ణి పెద్దగా లెక్కచేయరని మృత్యుంజయ శతకం వంటి మహాద్భుత రచనలు చేసిన మాధవపెద్ది సుందరరామశాస్త్రి అనే కవిగారు మీసాల గొప్పదనాన్ని సెలవిచ్చారు. ‘మీసము పస మగ మూతికి’ అంటూ ఒక పక్క ఒక కవి అంటున్నా... ఇంకెవరో అజ్ఞాత కవి అధిక్షేపణ పూర్వకంగా పవర్‌ఫుల్‌గా తిడుతూ... ‘మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె’ అనే సామెతను పుట్టించాడు. ఇంచుమించూ ఇలాంటి అర్థమే వచ్చేలా ‘అంబలి తాగే వాడికి మీసాలెత్తే వాడు ఒకడు’ అంటూ మరొకరు కాస్త గట్టిగానే కోప్పడ్డాడు. అంటే... మన పస తెలియజేయడానికి మీసాలు పెంచవచ్చు... కావాలంటే వాటికి సంపెంగ నూనె కూడా రాసుకోవచ్చు గానీ... మొదట ఉదర పోషణ జరగాలనీ, ఆ తర్వాతే మీస పోషణకు రావాలని సామెతలు సృష్టించిన ఆయా ప్రజాకవుల భావం. ఎవరేమనుకున్నా క్యాలెండర్ అన్నాక మాసాలూ... మగాడన్నాక మీసాలూ ఉండి తీరాల్సిందేనని కొందరు పురుషపుంగవుల అభిప్రాయం. కానీ పెంపుడు జంతువుల్లాగానే వాటినీ దువ్వుడానికే తప్ప మరో ఉపయోగం లేదని క్లీన్షేవోత్తములు వాకృచ్చుతూ ఉంటారు. పోనీ మీరూ పెంచరాదా అంటే... ‘ఎందుకు పెంచం’ అంటారే తప్ప గబుక్కున పెంచలేరు. మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి అలా క్యాట్ఫిష్షుల్లా ‘మీనమీసాలు’ లెక్కబెడుతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. - యాసీన్