రంగుల రాగం సంజీవదేవ్
ముప్పయి ఐదేళ్ళ క్రితం – నేను వ్యవసాయ కళాశాల చదువులో పచ్చదనంలో విద్యార్థిగా వున్న రోజుల్లో మిత్రుల ద్వారా సంజీవదేవ్ గురించి మొదటిసారి విన్నాను. అçప్పుడే ‘సంజీవదేవ్ లేఖలు,’ ‘లేఖల్లో సంజీవదేవ్’ చదివాను. ఒక అపురూపమైన అనుభవానికి లోనయాను. నా చదువు పూర్తయాక ఉద్యోగరీత్యా కోల్‌కతా, హుబ్లీలో పని చేసి బదిలీ మీద ‘నిడుబ్రోలు’కు 1985లో వచ్చాక తెలిసింది, దగ్గర్లోనే తుమ్మపూడి అనే పల్లె్లటూళ్ళో సంజీవదేవ్ వుంటారని. అదే సంవత్సరం ఆయన్ని కలవడానికి మిత్రుల్తో కల్సి ఆ వూరెళ్ళాను.
ఇంట్లోకి వెళ్తూండగా ద్వారం దగ్గర ‘రసరేఖ’ అనే అక్షరాలు తళుక్కుమంటూ కన్పించాయి. ఇంటికి ఆయన పెట్టుకున్న పేరది. చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించారు. చాలాసేపు మాట్లాడుకున్నాం. మధ్యలో తన శ్రీమతి సులోచనను పరిచయం చేశారు. అట్లాగే ముందుగదిలో గోడమీద కాంతులీనుతున్న ఓ పెయింటింగ్‌నూ పరిచయం చేశారు. అది నికొలస్ రోరిక్ గీసిన చిత్రం. సంజీవదేవ్‌కు బహుమానంగా దక్కింది. ఆ రోజు సంజీవదేవ్‌తో నా పరిచయం కూడా నా జీవనయానంలో నాకు దక్కిన బహుమానంగా భావిస్తాను.
ఆయన్ని చూసొచ్చాక ఓ ఉత్తరం రాసాను. వెన్వెంటనే ఆయన నుంచి ఉత్తరం అందుకున్నాను. ఎంత అందమైన దస్తూరి! సరిగ్గా ఆయన లానే వుంది. తదాదిగా ఉత్తరాలు రాస్తూ పోయాను. ఆయనా బదులిచ్చారు. నాకు అందిన ఆ ఉత్తరాలు ఒక సాంస్కృతిక సంపద. నా మొదటి కవితా సంపుటి ‘జీవన వీచిక’ను 1987లో వేద్దామనుకున్నపుడు ఆయనను కలిసి ముందుమాట రాయమన్నాను. ‘ధ్వని’ శీర్షికతో రాసిన ముందుమాటలో ఓ చోట ఆయనన్నారు: ‘నిత్యజీవితంలో ఒక సత్యమైన ఆనందం కవితను రచించటం, కవితను చదవటం, కవితను గురించి రచించటం’. ఆ వాక్యంలోని ‘సత్యమైన ఆనందం’ అనే పదబంధం ఇప్పటికీ నన్నాలోచింపజేస్తుంది.
1914 జూలై మూడో తేదీన కన్ను తెరిచిన సంజీవదేవ్ బాల్యంలోనే తల్లి వెంకాయమ్మను పోగొట్టుకున్నారు. తండ్రి రామదేవరాయలు. ఆయనతో చనువు తక్కువ. ఈ నేపథ్యంలో చదువు మొదలెట్టారుగానీ అది ఆరో తరగతి దాకానే సాగింది. ఆ పైన బడికెళ్ళింది లేదు. ఐనా స్వయంకృషితో ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచి, జపనీస్ భాషల్ని నేర్చుకున్నారు. కాల్పనిక భాషగా రూపొందిన ‘ఎస్పిరాంటో’ను కూడా ఆసక్తితో తెలుసుకున్నారు. ఈ భాషా పరిజ్ఞాన పటిమ ఆయనకు ఉపకరణమైంది, మానవ సంబంధాల్ని విస్తారం చేయడానికి.
చిన్న వయసు నుంచే యాత్రాభిలాషి ఐన సంజీవదేవ్ తన పద్నాలుగోయేట స్వామి రామతీర్థ జీవితాన్నీ రచనల్నీ చదవడం ఒక మలుపు. రామతీర్థ హిమాలయ పర్యటనలూ, ఆయన చేసిన హిమాలయ వర్ణనలూ సంజీవదేవ్‌ను ఆకట్టుకున్నాయి. స్వామి సత్యదేవ్ రాసిన ‘మేరీ కైలాస్ యాత్ర’ తెప్పించుకుని చదివాక ఆయన యాత్రాసక్తి మరింత పెరిగింది. రామకృష్ణ మిషన్ వారి ఆంగ్ల మాసపత్రిక ‘ప్రబుద్ధ భారత్’ సంపాదకులుగా వున్న స్వామి పవిత్రానందకు లేఖ రాసారు, తన యాత్రాభిరుచిని చెబుతూ. ఆయన రమ్మని చెప్పడం సంజీవదేవ్‌కు సంతోషాన్నిచ్చింది. అలా హిమాలయ ప్రాంతాలకు మొదటిసారి వెళ్లడం ఆయన జీవన పరిధిని పెంచింది. హిందీ రచయిత ప్రేమ్‌చంద్, చిత్రకారుడు అసిత్‌కుమార్ హాల్దార్, విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్‌లను ఈ యాత్రలోనే ఆయన కలుసుకోగలిగారు.
టాగూర్‌తో ఆయన బెంగాలీలో మాట్లాడ్డమే కాదు, టాగూర్ కవితల్ని రెండింటిని తన స్వరంతో వినిపించి ఆయన్ని ఆకట్టుకున్నారు. వ్యక్తుల పరిచయమే కాక, మంచుకొండల పరిచయం కూడా సంజీవదేవ్‌ను మోహనపరిచింది. లోయలూ, శిఖరాలూ, దేవదారు వృక్షాలూ ఆయన మదిలో ముద్రలైనాయి. అవన్నీ ఆ తదుపరి కాలంలో ఆయన చిత్రాల్లో దర్శన మిచ్చాయి. ‘ఆ హిమాలయ సంధ్యలో ఆ ఎత్తున కూర్చుని క్రమేణా పొగమంచుతో కప్పబడుతూ వస్తున్న ఆ దూరపు రహస్యమయ ప్రకృతిని చూస్తుంటే కళ్ళు వాటంతటవే నిమీలితాలైపోయి, హృదయం ఏదో అనిర్వచనీయ ఆనందాన్ని అనుభవించేది. ఏదో కనిపించని రూపలావణ్యం కనిపిస్తున్నట్టు, ఏదో వినిపించని శబ్దమాధురి వినిపిస్తున్నట్టు తట్టేది’. అదీ ఆయన రసదృష్టి!
ప్రధానంగా సంజీవదేవ్ కళాజ్ఞాని. కళ మీద అనేక వ్యాసాలు రాశారు. తెలుగులో రాయకమునుపే ఆంగ్లంలో రాశారు. తెలుగులో ఆయన ప్రథమ రచన ‘కళ–విజ్ఞానము’. 1961లో చిత్రకళలో సాధన మొదలెట్టి అనేక చిత్రాలు గీసారు. వాటిల్లో కొండలూ, చెట్లూ, జలాలూ, కాంతులూ ఇవేనా అంటే మానవరూపాలూ వుంటాయి అక్కడక్కడ. పోస్టుకార్డు సైజు చిత్రాల్ని ఉత్తరాల్తో పాటు పంపే వారు మిత్రులకు. అలా నేను కూడా ఒకట్రెండు అందుకున్నాను. నా వివాహానికి ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్ళినపుడు ప్రత్యేకంగా రెల్లు నిగనిగలాడే ఓ చిత్రాన్నిచ్చారు కానుకగా. అది ఇవాళ్టికీ మా ఇంట్లో భద్రంగా వుంది.
చిత్రరచన మీదే కాక ఫొటోగ్రఫీ మీదా ఆయనకు ఆసక్తి వుండేది. బెంగళూరులోని విఖ్యాత ఫొటోగ్రాఫర్ డాక్టర్ జి.థామస్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఫొటోగ్రఫీకి సంబంధించిన వివిధ విషయాలను తెలుసుకున్నారు. ఐతే క్రమంగా దాని మీద వ్యామోహాన్ని తగ్గించుకున్నారు. తన విద్యా వ్యాసంగాన్ని, తార్కిక సత్తాను అది తీసివేసేటట్టు గోచరించింది కనుక. సంజీవదేవ్ అంటే చాలామందికి ఆయన ఉత్తరాలే. ఉత్తరాలు రాసే ప్రక్రియను కళాత్మకం చేసారాయన. ఉత్తరం అందగానే వెన్వెంటనే జవాబు రాయడం, రంగురంగుల కాగితాల మీద రాయడం ఆయన ప్రత్యేకతలు. ఆయన నుంచి నేనందుకున్న యాభైకి పైగా ఉత్తరాల్లో ఒకచోట రాశారు: ‘జీవితాన్ని సజీవంగా జీవించడమే ఆనందం, ఆనందమే జీవనావగాహన’.
ఆయన వ్యాసాలూ, సంక్షిప్త రచనలూ ‘రసరేఖలు’, ‘దీప్తి ధారలు’, ‘తేజో రేఖలు, ‘రూపారూపాలు’ పేర్లతో పుస్తకాలుగా వచ్చాయి. ‘గ్రీన్ అండ్ బ్లూ’, ‘బ్లూ బ్లూమ్స్’, ‘డస్ట్ అండ్ మిస్ట్’, ‘హర్ లైఫ్’ లాంటి ఆంగ్ల రచనల్ని వెల్వరించారు. ఆయన తాత్విక దర్శనం ‘బయో సింఫనీ’లో కనపడుతుంది. అనేక కళల్తో పాటు సంజీవదేవ్‌కు ఆతిథ్య కళ బాగా తెలుసు. తుమ్మపూడిలోని ఆయన ఇంటిని సందర్శించిన వాళ్ళెందరో. రాహుల్ సాంకృత్యాయన్ లాంటి ఉత్తర భారతీయులూ తుమ్మపూడి వచ్చి వెళ్ళారు. భిన్న భావజాలాల్తో వున్నా, ఎవరితోనైనా కలిసిపోగల స్నేహగుణం ఆయనలో వుండటం అటు ఆయన వికాసానికీ ఇటు ఇతరుల వికాసానికీ దోహదం చేసింది.
సంజీవదేవ్ తన స్వీయచరిత్రను మూడు దశల్లో రాసుకున్నారు. 1951 వరకూ సాగిన జీవితాన్ని ‘తెగిన జ్ఞాపకాలు’గా, 1951–58 వరకూ సాగిన ప్రయాణాన్ని ‘స్మృతిబింబాలు’గా, 1959–65 వరకూ గడిచిన జీవితాన్ని ‘గతం లోకి’గా రాసుకున్నారు. వీటన్నిటినీ కలిపి ‘తుమ్మపూడి’ పేరుతో సమగ్రంగా ముద్రించిన రాజాచంద్ర ఫౌండేషన్ వారు అభినందనీయులు.వివిధ అభిరుచుల్తో, ప్రయాణాల్తో, వ్యాపకాల్తో, సాహచర్యాల్తో రసవంతంగా సుదీర్ఘకాలం పాటు జీవనయానం చేసిన సంజీవదేవ్ 25–8–1999న ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఆయన జ్ఞాపకమంటే ఒక తుమ్మపూడి, ఒక హిమాలయ చిత్రం, ఒక సరళ కవిత, ఒక పొందికైన ఉత్తరం, ఒక మెత్తని పలకరింపు, ఒక రంగుల రాగం!
నాకు రాసిన ఒక ఉత్తరంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఉటంకించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ‘చిరకాలమైన ఏకైక లçక్ష్యం ఏ మనిషికైనా ఒకటే – బాధల నుండీ, దుఃఖాల నుండీ బయటపడి ఆనందంలో జీవించాలని, లేక ఆనందం తనలో జీవించాలని. కనుక మానవులందరికీ ఏదైనా ఒక లక్ష్యం మాత్రమే ఉన్నదనుకుంటే అది Release from sorrow and suffering, living in peace and bliss. మానవ జీవితపు చరమలక్ష్యం, పరమలక్ష్యం ఆనందం అన్నమాట.’
దర్భశయనం శ్రీనివాసాచార్య
9440419039