
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోను అనూహ్యమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సులోచనా రావత్, తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆమె.. బీజేపీ కండువ కప్పుకున్నారు. సులోచనా రావత్... జోబాత్ (ఎస్టీ) రిజర్వుడ్ నియోజక వర్గం నుంచి 1998, 2008లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
బీజేపీ అందిస్తున్న పారదర్శక పాలన, గిరిజనుల అభివృద్ధి చేస్తున్న కృషి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్శించబడి పార్టీలో చేరినట్లు సులోచనా రావత్ తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ, ఒక లోకసభ స్థానానికి అక్టోబరు 30న ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించనుంది. అయితే, జోబాట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కళావతి భూరియా ఆకస్మిక మరణం వలన ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది.
జోబాట్ స్థానానికి బీజేపీ నుంచి.. సులోచన రావత్ బరిలో ఉండవచ్చని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నివారీపూర్‌లోని పృథ్వీపూర్ నుంచి కాంగ్రెస్ నేత నితేంద్ర సింగ్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ మరణంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదే విధంగా, సత్నాజిల్లాలోని రాయగావ్ ఎమ్మెల్యే జుగల్ కిషోర్ మరణంతో ఖాళీ ఏర్పడింది. ఖాండ్వా లోక్‌సభ నుంచి కేంద్ర మంత్రి అరుణ్‌యాదవ్ ఎంపీ పదవికి బరిలో నిలబడనున్నారు.
చదవండి: Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం