joins in BJP
-
కాంగ్రెస్‌కు లీడర్ లేడు, గెలిచే సత్తా లేదు.. పార్టీకి సీనియర్ నేత గుడ్ బై
దేశంలో కాంగ్రెస్ పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పటికే సీనియర్ నేతలు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడిన అనంతరం వారు పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మరోవైపు.. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజాగా హాస్తం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ లీడర్ హర్ష మహాజన్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాషాయతీర్థం తీసుకున్నారు. కాగా, ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో మహాజన్ బీజేపీలో చేరారు. ఇక, మహాజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున.. చంబా అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1993, 1998, 2003 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఈ సందర్భంగా మహాజన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సుమారు 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఎన్నికల్లో ఓడిపోలేదు. దివంగత మాజీ కాంగ్రెస్ సీఎం వీరభద్ర సింగ్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కానీ, నేడు కాంగ్రెస్ దిశానిర్దేశం లేకుండా ఉంది. ప్రస్తుత కాంగ్రెస్‌కు నాయకత్వం లేదు, ముందుచూపు లేదు. వీరభద్ర సింగ్ మృతిచెందిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. హిమాచల్‌లో కాంగ్రెస్ గెలవదు. మళ్లీ బీజేపీనే గెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకుళ్తున్నారు. బీజేపీ అద్భుత పాలన అందిస్తోంది’ అని అన్నారు. Harsh Mahajan, Himachal Pradesh Congress Committee working president, joins BJP https://t.co/TTqsG0FhfI — TOI Cities (@TOICitiesNews) September 28, 2022 -
పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌కు భారీ ఎదురుదెబ్బ..
చంఢీఘడ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, శిరోమణి అకాళీదళ్ కీలకనేత మాజిందర్ సింగ్ సిర్సా బుధవారం బీజేపీ కండువ కప్పుకున్నారు. కాగా, సిర్సా... కేంద్రం హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అదే విధంగా .. ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షేకావత్ కూడా పాల్గోన్నారు. సిర్సా.. ఢిల్లీ సిఖ్ గురుద్వారా మెనెజ్‌మెంట్ కమిటీ (డీఎస్‌జిఎంసీ)కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మాజిందర్ సిర్సా మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీతో కలిసి సిక్కుల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. కాగా సిర్సా డీఎస్‌జిఎంసీకు రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. అదే విధంగా సిక్కుల అభివృద్ధికి నిష్పక్షపాతంగా, విలువలతో పనిచేస్తానని తెలిపారు. -
కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోను అనూహ్యమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సులోచనా రావత్, తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆమె.. బీజేపీ కండువ కప్పుకున్నారు. సులోచనా రావత్... జోబాత్ (ఎస్టీ) రిజర్వుడ్ నియోజక వర్గం నుంచి 1998, 2008లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అందిస్తున్న పారదర్శక పాలన, గిరిజనుల అభివృద్ధి చేస్తున్న కృషి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్శించబడి పార్టీలో చేరినట్లు సులోచనా రావత్ తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ, ఒక లోకసభ స్థానానికి అక్టోబరు 30న ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించనుంది. అయితే, జోబాట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కళావతి భూరియా ఆకస్మిక మరణం వలన ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. జోబాట్ స్థానానికి బీజేపీ నుంచి.. సులోచన రావత్ బరిలో ఉండవచ్చని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నివారీపూర్లోని పృథ్వీపూర్ నుంచి కాంగ్రెస్ నేత నితేంద్ర సింగ్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ మరణంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదే విధంగా, సత్నాజిల్లాలోని రాయగావ్ ఎమ్మెల్యే జుగల్ కిషోర్ మరణంతో ఖాళీ ఏర్పడింది. ఖాండ్వా లోక్‌సభ నుంచి కేంద్ర మంత్రి అరుణ్‌యాదవ్ ఎంపీ పదవికి బరిలో నిలబడనున్నారు. చదవండి: Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
కమ్యూనిజం నుంచి కాషాయానికి.. ఈటల రెండో ఇన్నింగ్స్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వామపక్ష సిద్ధాంతాలతో విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ చివరికి కాషాయగూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఈటల తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చదువుకునే రోజుల్లో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడిగా ఉంటూనే కమ్యూనిస్టు సిద్ధాంతాలు గల జమునను ప్రేమ వివాహం చేసుకున్నారు. తదుపరి పౌల్ట్రీ వ్యాపారంలోకి ప్రవేశించి, వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యారు. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. ► 2002లో టీఆర్ఎస్లో చేరిన ఈటల అనతి కా లంలోనే ఆ పార్టీలో కీలక నాయకుడిగా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ► 2004లో కమలాపూర్ నుంచి పోటీచేసి తొలియత్నంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 2008 ఉపఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన ఆయన 2009లో తన కార్యక్షేత్రాన్ని హుజూరాబాద్‌కు మార్చి 2018 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తూ వచ్చారు. ► టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఆయన నెలరోజుల క్రితం భూకబ్జా ఆరోపణలతో బర్తరఫ్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వంతో తలెత్తిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల సోమవారం కమలంతీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఈటల రాజకీయ జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలైంది. ఈటలకు బాసటగా తుల ఉమ, గండ్ర నళిని కరీంనగర్ రాజకీయాల్లో సుమారు 20 ఏళ్లుగా చక్రం తిప్పిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన సమయంలో కొందరు నాయకులే అండగా నిలిచారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలలో దాదాపుగా ఎవరూ ఆయన వెంట బీజేపీలోకి వెళ్లలేదు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డితో పాటు ఆయన అభిమానులు, అనుయాయులు ఢిల్లీకి వెళ్లి బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారిలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ ఒక్కరే ఈటలకు బాసటగా నిలిచారు. 2004లో టీడీపీ నుంచి కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన గండ్ర నళిని తరువాత కాలంలో టీఆర్ఎస్లో ముఖ్య నాయకురాలిగా ఉన్నారు. ఆమె కూడా ఈటలతోపాటు బీజేపీలో చేరారు. గతంలో ఈటల వర్గీయులుగా, ఆయన సన్నిహితులుగా పేరున్న ఉమ్మడి కరీంనగర్ నాయకులెవరూ ఆయన వెంట లేకపోవడం గమనార్హం. బీజేపీకి కరీంనగరే పెద్దదిక్కు ►ఉమ్మడి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ ముఖ్యమైన కేంద్రంగానే ఉంది. ►1985లోనే ఉమ్మడి కరీంనగర్‌లోని మెట్పల్లి నుంచి సీహెచ్ విద్యాసాగర్‌రావు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. ►1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ►1998, 1999లలో కరీంనగర్ ఎంపీగా గెలి చి కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. ► విద్యాసాగర్‌రావుతోపాటు గుజ్జుల రామకృష్ణారెడ్డి సైతం 1999 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ► 2014, 2018లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ కుమార్ 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. ► తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై, ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కీలకంగా మారారు. ఈ క్రమంలో బీజేపీలో చేరిన పేరున్న పెద్ద నాయకుడు ఈటల రాజేందర్ కావడం గమనార్హం. టీఆర్ఎస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఆరుసార్లు గెలిచిన ఈటల అటుఇటుగా రెండు దశాబ్దాలకు పార్టీ మారి బీజేపీలో చేరారు. బీజేపీలో కొత్త అధ్యాయం మొదలైందని ఆయన భావిస్తున్నారు. తన రాజీనామా నేపథ్యంలో ఆర్నెల్లలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నిక ఈటలకే కాక బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సొంత జిల్లాలో సీనియర్ నేత ఈటల బీజేపీ నుంచి పోటీ పడుతున్న నియోజకవర్గంగా రాష్ట్ర ప్రజలను ఆకర్షించబోతోంది. చదవండి: పార్టీ మార్పుపై ఎల్.రమణ కీలక వ్యాఖ్యలు -
బెంగాల్ దీదీ.. ఇది ఆరంభమే: అమిత్ షా
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బెంగాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పలువురు టీఎంసీ నేతలను తమ వైపుకు తిప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో టీఎంసీ మంత్రి సువెందు అధికారి శనివారం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. మిడ్నాపూర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ర్యాలీలో సువేందు, సుదీప్ ముఖర్జీ సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు కాషాయ గూటికి చేరారు. వీరిలో ఆరుగురు టీఎంసీ పార్టీకి చెందినవారే. మరో ఎంపీ సునీల్ మండల్ కూడా షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీలోని విభేదాల కారణంగా టీఎంసీకి గుడ్‌బై చెప్పిన సువేందు..తన రాజీనామా లేఖలో పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే టీఎంసీ సభ్యునిగా ఇప్పటివరకు తనకు ఇచ్చిన అవకాశాలకు మమతా బెనర్జీకి కృతఙ్ఞతలు తెలిపారు. (మమతకు వరుస షాక్‌లు.. బీజేపీ సెటైర్లు! ) కాగా సువెందు అధికారికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నిర్ణయించింది. బీజేపీలో చేరిన వెంటనే ఈ ఉత్తర్వులు రావడం గమరార్హం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకనేతలు పార్టీని వీడటంతో మమతాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సహా మిడ్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్ రాయ్‌ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు మరికొంతమంది టీఎంసీ ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు పావులు కదుపుతోంది. ముకుల్ రాయ్ సహకారంతో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. (కేంద్రంపై మండిపడ్డ మమతా బెనర్జీ ) -
జిల్లాలో టీడీపీ ఖాళీ ?
సాక్షి, కొత్తగూడెం : మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మరో రెండు వారాల్లో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసేందుకు చిన్ని వెళ్లారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న కోనేరు చిన్నిని వేదికపైకి పిలిచినా ఆయన స్టేజీ ఎక్కలేదు. బీజేపీలో చేరే విషయంలో మరోసారి ఆలోచించి.. వచ్చే రెండు వారాల్లో ప్రకటిస్తానని ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. ఏది ఏమైనా కోనేరు సత్యనారాయణ బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ హవా తగ్గిపోవడంతో జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గతంలోనే టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల్లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు సత్యనారాయణ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ టికెట్‌ను కాంగ్రెస్‌కు కేటాయించారు. దీంతో మనస్తాపానికి గురైన కోనేరు.. అప్పుడే మరో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం బలంగా సాగింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చిన్నిని ప్రత్యేకంగా అమరావతికి పిలిపించి బుజ్జగించారు. ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులోకి తీసుకుంటారనే ప్రచారం కూడా సాగింది. కానీ అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఆపార్టీ ప్రాబల్యం తగ్గడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం మరో పార్టీని చూసుకోక తప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్ని టీడీపీని వీడితే ఇక జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైనట్టేనని, జిల్లాలో ఆ పార్టీకి నాయకత్వం వహించేవారు ఇక లేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నా జీవితం బీజేపీకి అంకితం: ప్రముఖ నటి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద (56) బీజేపీలో చేరారు. గతంలో పలు పార్టీలకి పని చేసిన ఆమె తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకుని కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తన పూర్తి జీవితం బీజేపీకి అంకితమని పేర్కొన్నారు. బీజేపీ నేత ఉపేంద్ర యాదవ్ ఆమెకు కాషాయ కండువా కప్పి, సభ్యత్వాన్నిచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పుర్ నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా 1994లో తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన జయప్రద ఆ తరువాత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2009 మధ్య ఎంపీగా కొనసాగారు. ఇప్పుడిదే స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ఆజంఖాన్‌పై గతంలో జయప్రద చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారం లేపాయి. మొత్తానికి జయప్రద చేరికతో రాంపూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. -
బీజేపీలో చేరిన తృణమూల్ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ బీజేపీ శిబిరంలో జోష్ నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌమిత్ర ఖాన్ బుధవారం బీజేపీలో చేరారు. గతంలో బెంగాల్ ఎమ్మెల్యేగానూ వ్యవహరించిన ఖాన్ ప్రస్తుతం విష్ణుపూర్ నుంచీ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఖాన్ బీజేపీలో అధికారికంగా చేరే కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బెంగాల్ బీజేపీ నేత ముకుల్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఖాన్ రాక బెంగాల్లో పార్టీ పటిష్టతకు ఉపకరిస్తుందని కమలనాధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
కమలం గూటికి చాగండ్ల!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాగండ్ల నరేంద్రనాథ్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి పోటీ చేసిన విషయం విదితమే. సొంత పార్టీలో తన సేవలకు గుర్తింపు లేకపోవడంతో పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు. కాకపోతే ఏ పార్టీలోకి వెళుతున్నదీ త్వరలోనే చెబుతానన్నారు. ఇదిలా ఉండగా చాగండ్ల బీజేపీలోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నట్టు ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. కమలనాథుల రాష్ట్ర నాయకులతో సైతం చాగండ్ల వారం రోజులుగా విస్తృతంగా చర్చలు జరిపినట్టు సమాచారం. చాగండ్ల రాకపై బీజేపీ రాష్ట్ర నాయకులు, స్థానిక నేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ సమక్షంలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే మెదక్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఓవైపు కమలనాథులు, మరోవైపు నరేన్ ట్రస్ట్ కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. భారీ ఎత్తున నిర్వహించే బహిరంగ సభకు సుష్మాస్వరాజ్‌ను అహ్వానించేందుకు రాష్ట్ర కమిటీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ కీలకమనే అంశాన్ని సైతం ఈ ప్రాంత ప్రజలకు వివరించి రాజకీయ లబ్ధి పొందాలన్నది కూడా వారి ప్రయత్నం. ఈ క్రమంలో జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరి ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించేందుకు నరేంద్రనాథ్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ, జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సుష్మాస్వరాజ్‌కు నరేంద్రనాథ్ చేరిక విషయాన్ని వివరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి నరేంద్రనాథ్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖరారైనట్టేనని సమాచారం.