సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద (56) బీజేపీలో చేరారు. గతంలో పలు పార్టీలకి పని చేసిన ఆమె తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకుని కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర‍్భంగా జయప్రద మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తన పూర్తి జీవితం బీజేపీకి అంకితమని పేర్కొన్నారు. బీజేపీ నేత ఉపేంద్ర యాదవ్ ఆమెకు కాషాయ కండువా కప్పి, సభ్యత్వాన్నిచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పుర్ నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా 1994లో తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన జయప్రద ఆ తరువాత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2009 మధ్య ఎంపీగా కొనసాగారు. ఇప్పుడిదే స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ఆజంఖాన్‌పై గతంలో జయప్రద చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారం లేపాయి. మొత్తానికి జయప్రద చేరికతో రాంపూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment