భర్త బాటలో... సైన్యంలో... | in husbend root in army.... | Sakshi
Sakshi News home page

భర్త బాటలో... సైన్యంలో...

Published Wed, May 7 2014 12:19 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM

భర్త బాటలో... సైన్యంలో... - Sakshi

భర్త బాటలో... సైన్యంలో...

స్ఫూర్తి
ప్రియా సెమ్‌వల్‌ని సైనిక దుస్తుల్లో చూడగానే బంధువులు, స్నేహితులు.. సంతోషంతోపాటు ఒకింత గర్వంగా భావించారు. తోటి సైనికులు మాత్రం ఆమెలో నాయక్ అమిత్ శర్మను చూసుకుని ఆనందపడ్డారు. ‘‘అమిత్ శర్మ తన భార్య ప్రియ చదువు గురించి చెప్పినప్పుడల్లా ‘ఆమెను కూడా సైనికురాలిని చెయ్యాలి నువ్వు’ అనే వాడిని. బిడ్డను చదివించే మగాళ్లుంటారు కానీ అంతే ఇష్టంతో భార్యను చదివించడం అరుదు కదా! అమిత్ స్థానాన్ని ప్రియ భర్తీ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియా సెమ్‌వల్‌లో అమిత్‌ని చూసుకుంటాం’’ కల్నల్ ఆఫీసర్  అగర్వాల్ అన్న ఆ మాటలు ప్రియ కళ్లనే కాదు...ఆమెతోపాటు నిలబడ్డ 194మంది జవాన్ల కళ్లనూ చెమ్మగిల్లేలా చేశాయి.

అరుణాచల్ ప్రదేశ్ దగ్గర తవాంగ్ కొండప్రాంతంలో పనిచేస్తున్న అమిత్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అమిత్ శర్మ భార్య ప్రియా సెమ్‌వల్‌ని భారత సైనికదళంలో షార్ట్ సర్వీస్ ఆఫీసర్‌గా నియమించడం సైనికవిభాగాన్నే కాదు సామాన్యుల్ని కూడా ఆశ్చర్యపరచింది.  మొదటిసారి ఓ అమరవీరుని భార్యకు సైనిక ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించడంతో అందరి దృష్టి ప్రియపై పడింది.

చిన్న వయసులోనే...
ఇరవై ఆరేళ్ళ వయసుకే భర్తను కోల్పోవడం అంటే చిన్న కష్టం కాదు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ప్రియా సెమ్‌వల్‌కి అమిత్ శర్మతో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత భార్య ఇష్టాన్ని గౌరవించి పై చదువులు చదివించాడు అమిత్. గణితంలో ిపీజీ పూర్తిచేసిన ప్రియా ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ మంచి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తుండగా భర్త మరణవార్త చెవిన పడింది. ‘‘పాతికేళ్ల అమ్మాయి భర్తలేడన్న వార్తని ఎలా జీర్ణించుకోగలదు. మా చెల్లి మామూలు మనిషి కావడానికి చాన్నాళ్లు పట్టింది.

భర్తను తలచుకుని ఆరేళ్ల బిడ్డను చూసుకుంటూ బాధపడుతున్న ప్రియకు భారత సైనికవిభాగం నుంచి పిలుపువచ్చింది. అమిత్ స్థానంలో ప్రియకు ఉద్యోగం ఇప్పిస్తామన్న కబురు వినగానే మేమంతా చాలా సంతోషించాం. మొదట్లో కొద్దిగా భయపడ్డా...ప్రియలోని ధైర్యం మమ్మల్ని గర్వపడేలా చేసింది’’ అని చెప్పాడు ప్రియ అన్న ప్రవేశ్ సెమ్‌వల్. కాశ్మీర్ పరిధిలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సైనిక విభాగంలో పనిచేయడానికి గత నెలలో వెళ్లిన ప్రియా ప్రస్తుతం తన విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. మన దేశ 62వ మహిళా జవానుగా, ఓ సైనికుని భార్యగా ప్రియ అందిస్తోన్న సైనిక సేవలు మహిళలకే కాదు మగవారికీ స్ఫూర్తిదాయకమే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement