నన్ను అలా గుర్తుంచుకొంటే చాలు..!
నీలకంఠ పరిచయం అక్కర్లేని దర్శకుడు. ‘షో’ సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకొని మిస్సమ్మ, సదా మీ సేవలో, మిస్టర్ మేధావి, మాయ వంటి సినిమాలతో తన ప్రస్థానాన్ని ప్రత్యేకంగా కొనసాగిస్తున్న దర్శకుడు. ఆయనతో ఈ వారం ‘అంతర్వీక్షణం’
దర్శకుడిగా సినిమా పట్ల మీ దృక్పథం..
పాత్రలు సహజంగా ప్రవర్తించాలి... నిజజీవితంలోని సంఘటనలు, మనకు కనిపించే వ్యక్తిత్వాలు సినిమాలో కనిపించాలి... అని అనుకొంటాను. అలాంటి సినిమాలే ఇష్టపడతాను. అలాంటి సినిమాలే తీస్తాను. ప్రేక్షకుడిని సినిమా ఎగ్జైట్ చేయాలి. నా సినిమాను చూడటానికి వచ్చే ప్రేక్షకుడు ఆ విషయంలో సంతృప్తి పడాలని భావిస్తాను.
సైకలాజికల్ థ్రిల్లర్స్ అనదగ్గ సినిమాలు తీస్తుంటారు. మీ సినిమాలోని పాత్రలకు, మీరు వ్యక్తులను చూసే దృష్టికీ సంబంధం ఉంటుందా..
కచ్చితంగా... మనలోకి మనం చూసుకొంటే చాలు చాలా కథలు జనిస్తాయి. మన మనసును మనం స్టడీ చేసుకొంటే కొత్త పాత్రలు పుట్టుకొస్తాయి. మనకు కనిపించే వారిని పరిశీలించి చూడటమే చాలా కథలకు ముడిసరుకు. మనస్తత్వాల పరిశీలన చాలా ముఖ్యం.
పుస్తకాలు బాగా చదువుతారా? ఇష్టమైన పుస్తకం?
మంచి రీడర్‌ని. ఇంగ్లిష్ పుస్తకాలే ఎక్కువగా చదువుతాను. ఇష్టమైన పుస్తకం అంటే ఒకటని చెప్పడానికి లేదు. ఏదో ఒకదాని పేరు చెప్పలేను.
నిర్మాతగా భారతీరాజా వంటి దర్శకుడితో పనిచేయడం ఎలాంటి అనుభవం?
దక్షిణాదిలోని బ్రిలియంట్ దర్శకుల్లో భారతీరాజా ఒకరు. ఆయనతో పనిచేయడం నా అదృష్టం. ఆయనతో పని నాకు లెర్నింగ్ లెసన్.
నిర్మాతగా చేసిన కాలానికీ, దర్శకుడిగా మారిన సమయానికీ కొంత గ్యాప్ ఉందే!
ఆ సమయాన్ని నన్ను నేను మలుచుకోవడానికి ఉపయోగించుకొన్నాను. దర్శకుడు కావాలనే లక్ష్యాన్ని పెట్టుకొని దాని మీదే దృష్టి నిలిపాను.
మీ సినిమాల్లో వ్యాపారదృక్పథం కొంచెం తక్కువగా ఉంటుంది.. కారణం?
నేను ప్రతి సినిమానూ కమర్షియల్ విలువలతోనే రూపొందిస్తాను. చెప్పాలనుకొన్న పాయింట్‌లో మాత్రం వైవిధ్యం ఉంటుంది. దాంట్లోనే కమర్షియల్ ఎలిమెంట్స్ నింపి సినిమాను రూపొందించి విజయం సాధించాలని అనుకొంటాను. ఆ విషయంలో విజయవంతం కావడం హ్యాపీ.
ఒక ఆఫీసులో ఉద్యోగిగా ఎలా నడుచుకోవాలి? వ్యక్తిగా సామాజిక బాధ్యత ఏమిటి? వంటి విషయాలను మీ సినిమాల్లో ప్రస్తావిస్తుంటారు... కారణం?
సినిమా అనేది ఎమోషన్‌ను ప్రతిబింబించడం అంతే. భావోద్వేగాలను చిత్రిక పట్టే ప్రక్రియలో పాత్రల సృష్టి జరుగుతుంది. నేటి కార్పొరేట్ ప్రపంచానికి కూడా ఆ సందర్భోచిత పాత్రలు చాలా నచ్చుతాయి.
‘సదా మీ సేవలో..’ సినిమాలో చూపినట్టుగా సమాజాన్ని సంస్కరిస్తూ, దాన్నే కెరీర్‌గా ఎంచుకొనే యువత ఉందంటారా..?!
కచ్చితంగా ఉంది. వాళ్లెవరో మనకు తెలియకపోవచ్చంతే.ఇటీవలే నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందిన కైలాష్ సత్యార్థి గురించి ఇంతకుముందు ఎంతమందికి తెలుసు? అలాంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. వారికి తగిన గుర్తింపు లేకపోవచ్చు.
పస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ‘మిస్టర్ మేధావి’ అంటే ఎలా ఉండాలంటారు?!
లౌక్యం ఉండాలి. అతి లౌక్యం పనికిరాదు. ప్రతిచోటా క్యాలిక్యులేషన్లు పనికిరావు. సహజంగా స్పందిస్తూ... మనస్ఫూర్తిగా జీవించాలి. అలా చేయగలిగేవారే నిజమైన ‘మిస్టర్ మేథావులు’
నీలకంఠను ఏ విధంగా గుర్తుంచుకోవాలి?
సినిమా మాధ్యమంగా నా ప్రయత్నం నేను చేశాను. ఒక గుడ్ ఫిలిమ్ మేకర్‌గా గుర్తుంచుకొంటే చాలు.
సంభాషణ : బీదాల జీవన్‌రెడ్డి