Neelakanta
-
నో ఫ్యాట్, నో షుగర్.. మార్కెట్లోకి ‘నీలకంఠ’ ఆలూ!
మనం పలు రకాల బంగాళ దుంపలను(ఆలూ) చూసేవుంటాం. అయితే ఇప్పుడు తాజాగా నీలకంఠ ఆలూను మార్కెట్లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగు బంగాళాదుంప. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు. దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా ఈ నీలకంఠ ఆలూలో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బంగాళదుంపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపలను తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి. ఈ బంగాళదుంప వైరస్ రహితమని, ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
‘సర్కిల్’మూవీ రివ్యూ
టైటిల్: సర్కిల్ నటీనటులు: సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై , నైనా తదితరులు నిర్మాణ సంస్థ: ఆరా ప్రొడక్షన్స్ నిర్మాతలు: ఎమ్వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ దర్శకత్వం: నీలకంఠ సంగీతం: ఎస్ఎస్ ప్రశు సినిమాటోగ్రఫీ: రంగనాత్ గోగినేని విడుదల తేది: జులై 7, 2023 కథేంటంటే.. కైలాష్ (సాయి రోనక్) ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్. కానీ ఓ కారణంగా మద్యానికి బానిసవుతాడు. ఓ రోజు బాగా తాగి ఇంట్లోకి వెళ్లగా, కిరాయి హంతకుడు పొత్తూరి గణేష్(బాబా భాస్కర్) అతనిపై దాడి చేస్తాడు. కైలాష్ని చైర్‌కి కట్టేసి.. బ్రహ్మ ముహూర్తం వచ్చే వరకు చంపనని, ఆలోపు తనను చంపేందుకు ఎవరు సుపారి ఇచ్చారో గెస్ చేస్తే అతనితో ఫోన్లో మాట్లాడించడంతో పాటు కుదురితే వదిలేస్తానని ఆఫర్ ఇస్తాడు. దీంతో కైలాష్ గెస్ చేసేందుకు ట్రై చేస్తాడు. మొదట తన మాజీ ప్రియురాలు అరుంధతి(రిచా పనాయ్) పేరు చెబుతాడు. ఆమెలో ప్రేమాయణం..బ్రేకప్‌కి గల కారణాలు చెబుతాడు. అయితే తనకు సుపారీ ఇచ్చింది అరుంధతి కాదని అంటాడు పొత్తూరి గణేష్. దీంతో ఎంపీ కూతురు మాళవిక(అర్షిత్ మెహతా), యువరాణి హిమాని రాజ్‌పుత్(నైనా)ల లవ్‌స్టోరీలు రివీల్ చేస్తాడు. ఈ ముగ్గురి ప్రేమకథలు ఏంటి? అసలు కైలాష్ ఈ ముగ్గురితో ఎందుకు విడిపోయాడు? కైలాష్ని చంపేందుకు పొత్తూరి గణేష్‌కి సూపారీ ఇచ్చిందెవరు? అనేది తెలియాలంటే థియేటర్లో ‘సర్కిల్’ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వైవిధ్యమైన చిత్రాల రూపకర్తగా పేరు సంపాదించుకున్న అతి కొద్దిమంది దర్శకుడు నీలకంఠ ఒక్కరు. ఆయన సినిమాల్లో కంటంటే హీరో. ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఆడకపోయినా.. ఆయన దర్శకత్వ ప్రతిభపై మాత్రం విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆయన తెరకెక్కించిన `షో` చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు వచ్చింది. అలాంటి గొప్ప డైరెక్టర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అంచనాలు పెంచుకోవడం సర్వసాధారణం. గత సినిమాల మాదిరే ‘సర్కిల్’కూడా డిఫరెంట్‌గా ఉంటుందని అంతా ఆశించారు. కానీ నీలకంఠ మాత్రం ఓ రొటీన్ పాయింట్‌తో ‘సర్కిల్’ని తెరకెక్కించాడు. పాత కథే అయినా తనదైన శైలీ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. ప్రాణం విలువ తెలియజేసే సందేశాత్మక చిత్రమిది. దానికి క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేసి యూత్‌ని ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో మొత్తం మూడు ప్రేమ కథలు ఉంటాయి. అవన్నీ రోటీన్‌గా ఉన్నప్పటికీ రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం యూత్‌ని ఆకట్టుకుంటాయి. అదే సమయంలో అసలు కైలాష్ని చంపేందుకు సూపారీ ఇచ్చిందెవరనేది చివరకు వరకు తెలియకపోవడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఫస్టాఫ్‌లో కిల్లర్, హీరో మధ్య ఆసక్తికరమైన సంభాషణ, రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో మొత్తం మళ్లీ రొటీన్ లవ్‌స్టోరీతోనే నడవడం మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఫోటోగ్రాఫర్ కైలాష్ పాత్రలో సాయి రోనాక్ ఒదిగిపోయాడు. ఇలాంటి లవర్‌బాయ్ తరహా పాత్రలు చేయడం అతనికి కొత్తేమి కాదు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. సుపారీ కిల్లర్‌గా బాబా భాస్కర్ నటన కూడా ఆకట్టుకుంటుంది. . హీరోయిన్లుగా నటించిన రిచా పనయ్, అర్షితా మెహతా, నైనా ముగ్గురూ చాలా చక్కగా నటించారు. తెరపై అందంగా కనిపించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఎస్ఎస్ ప్రశు సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా, వినసొంపుగా ఉన్నాయి. రంగనాత్ గోగినేని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా నిర్మాణ విషయంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీ పడలేదు. చిన్న సినిమా అయినా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా తెరపై కనిపిస్తుంది. -
గతంలో నా చిత్రాల్లో ఈ బ్యాలెన్స్ లేదు: ప్రముఖ డైరెక్టర్
'కాన్సెప్ట్, కమర్షియల్ అంశాలను బాగా బ్యాలెన్స్ చేయాలి. అయితే నా గత చిత్రాలకు ఈ బ్యాలెన్స్‌ను మిస్సయ్యానని అనుకుంటున్నా. బాలచందర్గారివంటి పెద్ద దర్శకుల కమర్షియల్ చిత్రాలు ఆడియన్స్‌ను అలరిస్తూనే కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉండేవి. ‘సర్కిల్’ సినిమాకి ఆ బ్యాలెన్స్ మిస్ కాకుండా జాగ్రత్త తీసుకుని, చేశాను' అన్నారు దర్శకుడు నీలకంఠ. సాయిరోనక్, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. ఎమ్వీ శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నీలకంఠ మాట్లాడుతూ– ‘‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్. విధి వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి వారి జీవితాలను ఎలా అల్లకల్లోలం చేసింది? అన్నదే కాన్సెప్ట్. ఈ చిత్రంలో ఫొటోగ్రాఫర్ పాత్రలో నటించిన సాయి రోనక్ అనూహ్యమైన ఘటనల్లో ఎలా చిక్కుకున్నాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియన్స్ సినిమాలను చూసే విధానంలో మార్పు వచ్చింది. నా తరహా సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో.. ఇది నా టైమ్ ఏమో అనిపిస్తోంది. ‘సర్కిల్’ ప్రేక్షకులకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇక నా కెరీర్లో నేను గ్యాప్ ఇవ్వలేదు... ఇవ్వబడింది. ‘మాయ’ సినిమాను మహేశ్ భట్‌గారు హిందీలో తీయాలనుకున్నారు.. కుదర్లేదు. ఓ రెండు ప్రాజెక్ట్స్ సెట్స్‌కు వెళ్లే టైమ్‌లో ఆగిపోయాయి. స్వామి వివేకానందగారి జీవితంతో వెంకటేశ్‌గారితో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాను.. కుదర్లేదు. కానీ ఆయన నటించిన ‘ఈనాడు’కు డైలాగ్స్ రాశాను. హిందీ ‘క్వీన్’ మలయాళ రీమేక్ చేశాను. ఓ సోషల్ డ్రామా, పీరియాడికల్ సబ్జెక్ట్స్‌తో వెబ్ సిరీస్‌ల్లానే ఉంది’’ అన్నారు. -
సర్కిల్లోనూ ఆ ప్రయత్నం కొనసాగించా
‘‘నా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తాను. ‘షో’లో మంజుల, ‘మిస్సమ్మ’లో లయ, భూమిక, ‘సదా మీ సేవలో’ చిత్రంలో శ్రియ.. ఇలా నా హీరోయిన్ల క్యారెక్టర్స్ బాగుంటాయని అందరూ చెబుతారు. ‘సర్కిల్’లోనూ ఆ ప్రయత్నాన్ని కొనసాగించాను. ఈ సినిమాలో అరుంధతి పాత్రలో రిచా పనై కొత్తగా కనిపిస్తుంది. అర్షిణ్, సాయి రోనక్, బాబా భాస్కర్ కూడా చక్కగా నటించారు’’ అని డైరెక్టర్ నీలకంఠ అన్నారు. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్.వి శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం జూలై 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘నీలకంఠగారితో పని చేయడం ఒక ఛాలెంజ్. ఈ సినిమా షూటింగ్‌ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు సాయి రోనక్. ‘‘ఇదొక డిఫరెంట్ మూవీ.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శరత్ చంద్ర. -
‘సర్కిల్’తో అవకాశాలు పెరుగుతాయి : అర్షిణ్ మెహతా, రిచా పనై
‘నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో సినిమా అవకాశం రావడం మా అదృష్టం. నటన పరంగా అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ‘సర్కిల్’ విడుదల తర్వాత మాకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అశిస్తున్నాం’అని హీరోయిన్లు అర్షిణ్ మెహతా, రిచా పనై అన్నారు. నీలకంఠ దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం ‘సర్కిల్’. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రలు పోషించారు. జూలై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్స్ అర్షిణ్ మెహతా, రిచా పనై మీడియాతో ముచ్చటించారు. (చదవండి: డ్రెస్ కవర్ చేసుకోలేక ఇబ్బంది పడ్డ శ్రియా.. వైరల్ అయిన వీడియో) అర్షిణ్ మెహతా మాట్లాడుతూ - సల్మాన్ హీరోగా నటించిన భజ్రంగీ భాయిజాన్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రతో నా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. నీలకంఠ గారు క్యారెక్టర్, నటన విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఈ సినిమాతో నటిగా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్ర నాది. హీరో ఫొటోగ్రాఫర్. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది.సాయి రోనక్ మంచి కోస్టార్. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో కలిసి నటించాం. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’అన్నారు. రిచా పనై మాట్లాడుతూ .. యముడికి మొగుడు, చందమామ కథలు చిత్రాల్లో నటించాక మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదు. ఇండస్ట్రీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు సర్కిల్ చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో దర్శకుడు నీలకంఠ నా క్యారెక్టర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. బోల్డ్ గా కనిపించే పాత్ర నాది. అయితే డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తేవడంతో పాటు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. -
Circle:శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో ఏం చేశాడు?
ఓ ఫొటోగ్రాఫర్ తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో ఉంటాడు. అప్పుడు అతనేం చేశాడు? అనేది ‘సర్కిల్’ చిత్రం ప్రధాన ఇతివృత్తం. సాయి రోనక్, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా, పార్థవ సత్య కీలక పాత్రలు చేశారు. ఫొటోగ్రాఫర్‌గా సాయి రోనక్ చేశారు. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్వీ శరత్ చంద్ర, టి. సుమలత, అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం జూలై 7 రిలీజ్ కానుంది. ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ అల్లుకున్న కథతో ‘సర్కిల్’ సినిమా తెరకెక్కింది. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో కథానాయకుడు ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతున్నారు. -
ఆకట్టుకుంటున్న ‘సర్కిల్ ఆఫ్ లైఫ్’ సాంగ్
సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకుడు.ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగాఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ 'సర్కిల్ ఆఫ్ లైఫ్', అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేసారు. జీవితం మరియు దాని అనిశ్చితి గురించి మాట్లాడే పెప్పీ ఫాస్ట్ బీట్ నంబర్ గా వచ్చిన ఈ పాట అందరిని అలరిస్తోంది. ఇక ఈ సింగల్ వీడియో సినిమాలోని విభిన్న సన్నివేశాల విజువల్స్‌ని చూపించి, సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మహిళల నేపథ్యంలో...
విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టారు. డైరెక్టర్ నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సుమన్ స్క్రిప్ట్‌ని అందించారు. ‘‘స్త్రీలకు తల్లవ్వడం అనేది అదృష్టం. ఆ లక్‌ని సరిగ్గా వినియోగించుకోక΄ోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కథ’’ అన్నారు. ‘‘జూలైలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు చంద్ర ఓబుల్ రెడ్డి, రమేష్. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ. -
‘100 ఎకరాలు దానంగా ఇచ్చారు, ఆయనది గొప్ప చరిత్ర’
‘‘వెదిరె రామచంద్రా రెడ్డిగారు ఇచ్చిన మొదటి భూదానం భారతదేశానికే కొత్త అర్థం చెప్పింది. ఆయనది గొప్ప చరిత్ర. ఆయన జీవితాన్ని తెరకెక్కించే బాధ్యతను నాపై పెట్టిన చంద్రశేఖర్‌రెడ్డికి ధన్యవాదాలు’’ అని దర్శకుడు నీలకంఠ అన్నారు. పోచంపల్లికి చెందిన ప్రథమ భూదాత వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం తెరపైకి రానుంది. నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. అరవింద్ రెడ్డి(రామచంద్రా రెడ్డి మనవడు) సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆచార్య వినోబా బావే 127వ జయంతి సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘1951లో గాంధీజీ ప్రియ శిష్యుడైన ఆచార్య వినోబా భావే పిలుపు మేరకు 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు రామచంద్రా రెడ్డిగారు. ఆ చరిత్ర నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోబా భావే ఆశయాలతో పని చేశారు రామచంద్రారెడ్డి.. అందుకే వినోబా భావే జయంతి సందర్భంగా నివాళులు అర్పించాం’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. 1951సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలకు జరుగుతున్నాయి. -
తెరపైకి వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం
తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి జీవితాన్ని ప్రముఖ దర్శకుడు నీలకంఠ తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ) నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే పేదలకు భూ పంపిణీ కోసం అడగ్గానే ప్రథమ భూదాతగా వంద ఎకరాల భూమిని వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన ఆయన జీవిత కథతో సినిమా తెరకెక్కించనున్నాం. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయాలనుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: తోలుపునూరి కృష్ణగౌడ్, గడ్డం రవికుమార్. -
దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేస్తారా.?
ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో వివాదాస్పదంగా మారిన సినిమా మణికర్ణి. ఈ సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించటం ప్రధా పాత్రధారి కంగనాతో వివాదం కారణంగా క్రిష్ తప్పుకోవటంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో సినిమా టైటిల్స్‌లో దర్శకులుగా కంగనా, క్రిష్ పేర్లు కనిపించాయి. అయితే మేజర్ పార్ట్ డైరెక్ట్ చేసిన తనకే ఎక్కువ క్రెడిట్ దక్కాలంటూ సోషల్ మీడియా వేదిక గొడవపడుతున్నారు. అలాంటి పరిస్థితే ఓ సౌత్ సినిమాకు కూడా ఏర్పడింది. బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సౌత్ సినిమా దట్ ఈజ్ మహాలక్ష్మీ. ఈసినిమాకు ముందుకు షో ఫేం నీలకంఠ దర్శకత్వం వహించాడు. తరువాత లీడ్ యాక్టర్ తమన్నాతో వివాదం కారణంగా నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో మిగతా భాగానికి అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో సినిమాకు దర్శకుడిగా క్రెడిట్ ఎవరికి ఇస్తారు. ఇద్దరికీ క్రెడిట్ ఇచ్చేట్టయితే ముందుగా ఎవరి పేరు వేస్తారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన దట్ ఈజ్ మహాలక్ష్మీ టీం పోస్టర్లు, టీజర్లను దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేసింది. మరి సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారా లేక మరో వివాదానికి తెరతీస్తారా చూడాలి. -
క్వీన్ కోసం ‘అ’ దర్శకుడు
బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. అయితే తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇతర భాషల్లో రీమేక్ పనులు జరుగుతున్నా తెలుగు వర్షన్‌ను మాత్రం పక్కన పెట్టేశారు. తాజా మరో దర్శకుడితో క్వీన్ తెలుగు రీమేక్‌ను కొనసాగించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. నాని నిర్మాతగా మారి రూపొందించిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ, క్వీన్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా ప్రశాంత్ వర్మ టేకింగ్ కు మంచి స్పందన వచ్చింది. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. -
ఆ డైరెక్టర్‌తో మళ్లీ గొడవ?
హిందీలో మంచి హిట్ సాధించిన ‘క్వీన్’ సినిమాను ప్రస్తుతం దీన్ని తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగు వర్షన్‌కు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆమెకు, నీలకంఠకు మధ్య విభేదాలు వచ్చాయని ఇదివరకే పుకార్లు వచ్చాయి. సెట్స్ మీద ఒకరంటే ఒక్కరికి పడటం లేదని సమాచారం. దీంతో తెలుగు రీమేక్ ‘క్వీన్’ ఆలస్యం అవుతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ విషయంపై నిర్మాతలు స్పందించారు. తమన్నా, నీలకంఠ మధ్య ఎటువంటి గొడవలు లేవు.. సినిమా ఘాటింగ్ జరుగుతోందని గతంలో వారు చెప్పారు. ప్రస్తుతం మళ్లీ అవే రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. వారి మధ్య తాజాగా విభేదాలు చోటుచేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘క్వీన్’ చిత్రం ఘాటింగ్ ఆగిపోయిందని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. అసలు వీరి గొడవకి కారణం.. క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెబుతున్నారు. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించలేదు. -
టాలీవుడ్ 'క్వీన్'..!
చాలారోజులుగా ఊరిస్తున్న క్వీన్ తెలుగు రీమేక్ ప్రారంభమైంది. ఎంతో మంది హీరోయిన్ల పేర్ల చర్చకు వచ్చిన ఈ ప్రాజెక్ట్ లో ఫైనల్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేశారు. షో, మిస్సమ్మ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు నీలకంఠ క్వీన్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు వర్షన్ కు కూడా క్వీన్ అనే టైటిల్ నే నిర్ణయించారు. ఇప్పటికే 'బటర్ ఫ్లై' పేరుతో తెరకెక్కుతున్న కన్నడ క్వీన్ షూటింగ్ పూర్తి కాగా, కాజల్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' ఇటీవలే ప్రారంభమైంది. ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో క్వీన్ తెలుగు రీమేక్ షూటింగ్ ప్రారంభించనున్నారు. మనుకుమరన్ నిర్మిస్తున్న ఈసినిమాను రెగ్యులర్ షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది. On the way to launch #Queen #Queenonceagain Telugu @mediente pic.twitter.com/hbMuoUSQgA — Tamannaah Bhatia (@tamannaahspeaks) 1 October 2017 -
షో డైరెక్టర్‌తో క్వీన్..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు కేవలం కన్నడ రీమేక్ మాత్రమే మొదలైంది. తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. తాజాగా క్వీన్ రీమేక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. షో, మిస్సమ్మ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు నీలకంఠ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడట. తమన్నా లేదా కాజల్ లలో ఒకరు లీడ్ రోల్ లో నటించే అవకాశం ఉంది. అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తారా..? లేక కేవలం తెలుగు వర్షన్ మాత్రమే రూపొందిస్తారన్న అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారన్న టాక్ వినిపిస్తోంది. -
15 ఏళ్ల తరువాత 'సెకండ్ షో'
2002లో కేవలం రెండే పాత్రలతో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా షో. సూపర్ స్టార్ వారసురాలు మంజుల, విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన షో విశ్లేషకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సినిమా దర్శకుడు నీలకంఠ ఒక్కసారి సినీవర్గాల దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్సమ్మ మంచి విజయం సాధించినా.. ఆ ఫాం కంటిన్యూ చేయలేకపోయాడు. చమ్మక్ చల్లో, మాయ లాంటి సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో కొంత గ్యాప్ తీసుకున్న నీలకంఠ, మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన షో సినిమాకు సీక్వల్ రూపొందించే పనిలో ఉన్నాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత సెకండ్ షో పేరుతో షో సినిమాకు సీక్వల్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
నన్ను అలా గుర్తుంచుకొంటే చాలు..!
నీలకంఠ పరిచయం అక్కర్లేని దర్శకుడు. ‘షో’ సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకొని మిస్సమ్మ, సదా మీ సేవలో, మిస్టర్ మేధావి, మాయ వంటి సినిమాలతో తన ప్రస్థానాన్ని ప్రత్యేకంగా కొనసాగిస్తున్న దర్శకుడు. ఆయనతో ఈ వారం ‘అంతర్వీక్షణం’ దర్శకుడిగా సినిమా పట్ల మీ దృక్పథం.. పాత్రలు సహజంగా ప్రవర్తించాలి... నిజజీవితంలోని సంఘటనలు, మనకు కనిపించే వ్యక్తిత్వాలు సినిమాలో కనిపించాలి... అని అనుకొంటాను. అలాంటి సినిమాలే ఇష్టపడతాను. అలాంటి సినిమాలే తీస్తాను. ప్రేక్షకుడిని సినిమా ఎగ్జైట్ చేయాలి. నా సినిమాను చూడటానికి వచ్చే ప్రేక్షకుడు ఆ విషయంలో సంతృప్తి పడాలని భావిస్తాను. సైకలాజికల్ థ్రిల్లర్స్ అనదగ్గ సినిమాలు తీస్తుంటారు. మీ సినిమాలోని పాత్రలకు, మీరు వ్యక్తులను చూసే దృష్టికీ సంబంధం ఉంటుందా.. కచ్చితంగా... మనలోకి మనం చూసుకొంటే చాలు చాలా కథలు జనిస్తాయి. మన మనసును మనం స్టడీ చేసుకొంటే కొత్త పాత్రలు పుట్టుకొస్తాయి. మనకు కనిపించే వారిని పరిశీలించి చూడటమే చాలా కథలకు ముడిసరుకు. మనస్తత్వాల పరిశీలన చాలా ముఖ్యం. పుస్తకాలు బాగా చదువుతారా? ఇష్టమైన పుస్తకం? మంచి రీడర్ని. ఇంగ్లిష్ పుస్తకాలే ఎక్కువగా చదువుతాను. ఇష్టమైన పుస్తకం అంటే ఒకటని చెప్పడానికి లేదు. ఏదో ఒకదాని పేరు చెప్పలేను. నిర్మాతగా భారతీరాజా వంటి దర్శకుడితో పనిచేయడం ఎలాంటి అనుభవం? దక్షిణాదిలోని బ్రిలియంట్ దర్శకుల్లో భారతీరాజా ఒకరు. ఆయనతో పనిచేయడం నా అదృష్టం. ఆయనతో పని నాకు లెర్నింగ్ లెసన్. నిర్మాతగా చేసిన కాలానికీ, దర్శకుడిగా మారిన సమయానికీ కొంత గ్యాప్ ఉందే! ఆ సమయాన్ని నన్ను నేను మలుచుకోవడానికి ఉపయోగించుకొన్నాను. దర్శకుడు కావాలనే లక్ష్యాన్ని పెట్టుకొని దాని మీదే దృష్టి నిలిపాను. మీ సినిమాల్లో వ్యాపారదృక్పథం కొంచెం తక్కువగా ఉంటుంది.. కారణం? నేను ప్రతి సినిమానూ కమర్షియల్ విలువలతోనే రూపొందిస్తాను. చెప్పాలనుకొన్న పాయింట్లో మాత్రం వైవిధ్యం ఉంటుంది. దాంట్లోనే కమర్షియల్ ఎలిమెంట్స్ నింపి సినిమాను రూపొందించి విజయం సాధించాలని అనుకొంటాను. ఆ విషయంలో విజయవంతం కావడం హ్యాపీ. ఒక ఆఫీసులో ఉద్యోగిగా ఎలా నడుచుకోవాలి? వ్యక్తిగా సామాజిక బాధ్యత ఏమిటి? వంటి విషయాలను మీ సినిమాల్లో ప్రస్తావిస్తుంటారు... కారణం? సినిమా అనేది ఎమోషన్‌ను ప్రతిబింబించడం అంతే. భావోద్వేగాలను చిత్రిక పట్టే ప్రక్రియలో పాత్రల సృష్టి జరుగుతుంది. నేటి కార్పొరేట్ ప్రపంచానికి కూడా ఆ సందర్భోచిత పాత్రలు చాలా నచ్చుతాయి. ‘సదా మీ సేవలో..’ సినిమాలో చూపినట్టుగా సమాజాన్ని సంస్కరిస్తూ, దాన్నే కెరీర్‌గా ఎంచుకొనే యువత ఉందంటారా..?! కచ్చితంగా ఉంది. వాళ్లెవరో మనకు తెలియకపోవచ్చంతే.ఇటీవలే నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందిన కైలాష్ సత్యార్థి గురించి ఇంతకుముందు ఎంతమందికి తెలుసు? అలాంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. వారికి తగిన గుర్తింపు లేకపోవచ్చు. పస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ‘మిస్టర్ మేధావి’ అంటే ఎలా ఉండాలంటారు?! లౌక్యం ఉండాలి. అతి లౌక్యం పనికిరాదు. ప్రతిచోటా క్యాలిక్యులేషన్లు పనికిరావు. సహజంగా స్పందిస్తూ... మనస్ఫూర్తిగా జీవించాలి. అలా చేయగలిగేవారే నిజమైన ‘మిస్టర్ మేథావులు’ నీలకంఠను ఏ విధంగా గుర్తుంచుకోవాలి? సినిమా మాధ్యమంగా నా ప్రయత్నం నేను చేశాను. ఒక గుడ్ ఫిలిమ్ మేకర్‌గా గుర్తుంచుకొంటే చాలు. సంభాషణ : బీదాల జీవన్‌రెడ్డి -
అప్పుడే హిందీలోతీయాలనుకున్నా: నీలకంఠ
‘‘నా అభిమాన దర్శకుల్లో మహేష్ భట్ ఒకరు. ఆయన ‘మాయ’ చిత్రం చూసి, హిందీలో నిర్మించాలనుకుంటున్నాననడంతో పాటు నన్నే డెరైక్షన్ చేయమన్నారు. వాస్తవానికి ‘మాయ’ పాయింట్ అనుకున్నప్పుడే తెలుగు, హిందీ భాషల్లో చేయాలనుకున్నాను. కానీ, బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని విరమించుకున్నాను. ఇప్పుడు హిందీలో చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు నీలకంఠ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాతలు మహేష్ భట్, విక్రమ్ భట్ ‘మాయ’ చిత్రాన్ని హిందీలో ‘మర్డర్ 4’గా పునర్నిర్మించనున్నారు. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘జోష్ మీడియా ప్రతినిధులు వీరేన్, వందనలకు మహేష్ భట్‌గారితో మంచి అనుబంధం ఉంది. వాళ్ల ద్వారానే ‘మాయ’ చిత్రం మహేష్‌భట్ దృష్టికెళ్లింది. తెలుగువారికి నచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ‘మర్డర్ 4’ నిలుస్తుందనే నమ్మకాన్ని వీరేన్ వెలిబుచ్చారు. ఈ చిత్రంతో దర్శకుడిగా నీలకంఠ బాలీవుడ్లో స్థిరపడతారని నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
మహేశ్‌భట్ మాయ
నీలకంఠ ‘మాయ’ చిత్రానికి సుప్రసిద్ధ హిందీ దర్శకుడు మహేశ్‌భట్ ప్రశంసలు లభించాయి. ఇటీవలే ఈ చిత్రాన్ని నిర్మాతలు ముఖేష్‌భట్, విశేష్భట్లతో కలిసి మహేశ్‌భట్ వీక్షించారు. దర్శకుడు నీలకంఠ, చిత్ర నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ‘మాయ’ ఓ వినూత్న ప్రయత్నమనీ, ఈ కథాంశాన్ని హిందీలో నిర్మిస్తామనీ, త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తామనీ మహేశ్‌భట్ తెలిపారు. -
ఇమ్రాన్ హష్మీతో హిందీలో ‘మాయ’!
‘‘విభిన్న తరహాలో సాగే సినిమాలు చేయడం నాకు ఆసక్తి. అందుకే ఎప్పటికప్పుడు వినూత్న కథాంశాలు ఎన్నుకుంటాను. ఈ చిత్రం విడుదలైన రోజున కాస్త టెన్షన్ పడ్డాను. కానీ, ఆదివారం హౌస్‌ఫుల్ కావడంతో రిలీఫ్ అనిపించింది. సినిమా చూసినవాళ్లందరూ వినూత్న అనుభూతికి గురి చేసిందని, కథ కొత్తగా ఉందని అంటుంటే ఆనందంగా ఉంది’’ అని నీలకంఠ చెప్పారు. ఆయన దర్శకత్వంలో మధుర శ్రీధర్, ఎమ్.వి.కె. రెడ్డి నిర్మించిన ‘మాయ’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు పెరిగాయని మధుర శ్రీధర్ చెబుతూ - ‘‘కన్నడ నిర్మాత శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఒరియా, బెంగాలీ భాషల రీమేక్ హక్కులకు సంప్రతింపులు జరుగుతున్నాయి. హిందీలో ఇమ్రాన్ హష్మీతో రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలుపెట్టాం’’ అన్నారు. -
సినిమా రివ్యూ: కొద్దిసేపే ‘మాయ’
విభిన్నమైన కథలు, వాటిని విచిత్రంగా నడిపిస్తూ తెరపై చూపే శైలి హాలీవుడ్ చిత్రాలకు అలవాటే. కానీ, అలాంటి దోవలో ప్రయాణించడం తెలుగు తెరపై అరుదు. అలాంటి అరుదైనయత్నం చేయడానికి సిద్ధపడినప్పుడు, ప్రేక్షకుడికి ఆశ్చర్యమో, ఆనందమో కలగాలి. అలాకాక, కేవలం ఇంగ్లీష్ చిత్రాల అనుసరణే వరకే ఆ ప్రయోగశీలతను పరిమితం చేస్తే, ఇబ్బంది. ఈ నేపథ్యంలో నుంచి ‘మాయ’ను చూడాలి. కథలోకి వస్తే... జరగబోయేది ముందే తెలిస్తే..? అలాంటి దృష్టి ఎవరికైనా ఉంటే..? మేఘన (అవంతికా మిశ్రా)కు చిన్నప్పటి నుంచి అతీంద్రియ దృష్టి (ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ - ఇ.ఎస్.పి) ఉంటుంది. చిన్నప్పుడు ఓ దుర్ఘటనలో అమ్మ ప్రాణాలు కోల్పోనుందన్న సంగతి కూడా చిన్నప్పుడే తెలిసిన అమ్మాయి ఆమె. పెద్దయ్యాక ‘టీవీ 21’లో రిపోర్టర్‌గా సామాజిక అంశాలపై పోరాటం చేస్తుంటుంది. ఆమె జీవితంలోకి ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ వర్మ అలియాస్ సిద్ధూ (హర్షవర్ధన్ రాణే) ప్రవేశిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇంతలో అతనికి కాబోయే భార్యనంటూ మేఘన చిన్నప్పటి ఫ్రెండ్ పూజ (సుష్మా రాజ్) ప్రవేశిస్తుంది. పూజ జీవితంలో జరగబోయే ఓ ఘటన మేఘన ఇ.ఎస్.పికి ముందే అందుతుంది. సిద్ధూకు ఓ భయంకరమైన గతం ఉందని తెలుస్తుంది. అప్పుడేమైందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... కాస్తంత నెగటివ్ టచ్ ఉన్న పాత్రలకు ఇప్పుడిక హర్షవర్ధన్ రాణే కొత్త చిరునామాగా మారాడనుకోవచ్చు. ముగ్గురు కొత్త నాయికలూ చూడడానికైతే బాగానే ఉన్నారు. అంతకు మించి ఆశిస్తే కష్టం. సస్పెన్స్‌తో నిండిన ఈ థ్రిల్లర్‌కి సంగీతం, కెమేరా వర్క్, సౌండ్ ఎఫెక్ట్లు ప్రాణం పెట్టాయి. సందర్భోచిత గీతాలు కొన్ని పెట్టారు కానీ, అందులో ఒకటి రెండైతే నిడివినీ, ప్రేక్షకుల అసహనాన్నీ పెంచడానికే ఉపకరించాయి. ఏ సీనుకు ఆ సీనే... ఆసక్తికరమైన ప్రారంభ దృశ్యంతో వెండితెరపై ‘మాయ’ మొదలవుతుంది. అక్కడ చిన్నారి మేఘన పాత్రధారితో చేయించిన అభినయం, సౌండ్ ఎఫెక్ట్లు బాగున్నాయి. అలా ఆసక్తికరమైన అనుభవం కోసం మొదలైన ప్రేక్షకుల జర్నీ కాసేపటికే ఇది ప్యాసింజర్ బండిలో ప్రయాణంగా మారుతుంది. అప్పుడే ప్రథమార్ధం అయిపోయిందా అనిపించే ఈ సినిమా ఆ తరువాత క్రమంగా గాడి తప్పుతుంది. ఆ తరువాత మళ్ళీ మునుపటి ‘మాయ’ కనిపించే ఘట్టాలు తక్కువే. దర్శక, రచయిత ఏ సీను రాసుకున్నప్పుడు ఆ సీనుకు తగ్గట్లు పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి. సిద్ధూ పాత్ర లాంటివి పాజిటివ్, నెగటివ్‌లకు రెంటికీ కాకుండా పోయాయి. అప్పటి దాకా జరగబోయేది తెలుస్తున్న నాయికకు ఉన్నట్టుండి, జరిగిపోయిన సంఘటన తెలియడమనేది నప్పని విషయం. కథ నడిపించడం కోసం దర్శక, రచయిత తనకు తాను కల్పించుకున్న ఓ వెసులుబాటు. అలాగే, ఎన్నో ఏళ్ళ క్రితం చిన్నప్పటి ఫ్రెండైన కథానాయికను పూజ పాత్ర చటుక్కున ఎలా గుర్తించేస్తుందని అడగకండి. ఇక, ద్వితీయార్ధంలో ఫ్యాషన్ షో ఎపిసోడ్ దగ్గర ‘ఢిల్లీ, రాత్రి వేళ...’ అంటూ వేసిన లొకేషన్ ఇండికేషన్ టైటిల్ మరింత గందరగోళం రేపింది. కథ ఆ క్షణానికి జరుగుతున్నది ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా అన్నది అర్థం కాదు. సిద్ధూ పాత్ర, పోలీసు అధికారి కలసి చివరలో వెతుకులాట, ‘చంపడం మినహా మరో మార్గం లేద’నుకోవడం లాంటి వాటికి కథలో సరైన భూమిక లేదు. చివరలో నాయిక పాత్ర ద్వారా వేరొకరి ద్వారా సస్పెన్స్ ముడిని విప్పించడం తృప్తినివ్వదు. వెరసి, మూడు ముఖ్య పాత్రలు, వారి వారి కోణాల నుంచి కథ నడవడమనే అంశం బాగుందనిపించినా, రెండు గంటల సినిమా చూశాక, అర్ధాకలితో బయటకొచ్చిన భావనే మిగులుతుంది. తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, కెమేరా: బాల్‌రెడ్డి, నిర్మాతలు: ఎం.వి.కె. రెడ్డి, ‘మధుర’ శ్రీధర్, రచన,దర్శకత్వం: నీలకంఠ బలాలు: విలక్షణమైన కథాంశం. సౌండ్ ఎఫెక్ట్లు తెరపై సినిమాను రిచ్‌గా కనిపించేలా చూపిన నాణ్యమైన నిర్మాణం బలహీనతలు: అతి నిదా...నంగా సాగే చిత్ర కథనం అందరూ కొత్త ముఖాలే కావడం ఆకట్టుకోని హీరోయిన్ నటన ఖంగాళీగా సాగే ద్వితీయార్ధం. - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ: మాయ
నటీనటులు: హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి నిర్మాత: మధుర శ్రీధర్ దర్శకుడు: నీలకంఠ ప్లస్ పాయింట్స్: కథనం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాల్లో ఉండే వేగం లేకపోవడం, వినోదం లేకపోవడం షో చిత్రంతో జాతీయ అవార్డు, మిస్సమ్మ చిత్రంతో ప్రేక్షకులు అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నీలకంఠ తాజాగా హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందిని రాయ్ లతో 'మాయ'చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్, థ్రిలర్ రూపొందిన ఈ చిత్రం మాయ చేసిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఓ టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసే మేఘన (అవంతిక మిశ్రా) చిన్నతనం నుంచి జరగబోయే సంఘటనలు ముందే తెలిసే ఈఎస్పీ (ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్) అనే వ్యాధితో బాధపడుతుంటుంది. వృత్తిలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ వర్మ (హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధూ, మేఘన ఒకర్నిమరొకరు ప్రేమించుకుంటారు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు పూజా(సుష్మా రాజ్)కు సిద్దూకి పెళ్లి కుదిరిందనే నిజం తెలుస్తుంది. అంతేకాకుండా సిద్దూ ఫస్ట్ లవర్ వైశాలి (నందిని రాయ్) రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందుతుంది. వైశాలి మృతి విషయంలో సిద్దూపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలా ఉండగా పూజాను సిద్దూ చంపబోతున్నట్టు మేఘనకు ముందే తెలుస్తుంది. పూజాను సిద్దూ నిజంగానే చంపుతాడా? పూజాను సిద్దూ ఎందుకు చంపాల్సి వస్తుంది? తన స్నేహితురాలు పూజాను మేఘన రక్షించుకుంటుందా? వైశాలి మృతి వెనుక కారణాలేంటి? వైశాలి మృతి విషయంలో సిద్దూపై ఎందుకు అనుమానాలు తెలుత్తాయి అనే ప్రశ్నలకు సమాధానమే 'మాయ'. మేఘన పాత్రలో అవంతిక మిశ్రాకు ఈ చిత్రంలో కీలకపాత్ర లభించింది. గ్లామరస్ గా కనిపించింది. కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రను పర్వాలేదనిపించే స్థాయిలో పోషించింది. ఫ్యాషన్ డిజైనర్ పాత్రను పోషించిన హర్షవర్ధన్ రాణేకు ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కించుకున్నారు. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో తడబాటుకు గురైనాడు. కాని మిగితా చిత్రాలతో పొల్చుకుంటే హర్షకు ఇంపార్టెంట్ పాత్రనే ఈ చిత్రంలో లభించింది. యాక్టింగ్, హావభావాలు పలికించడంలోను మరికొంత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిత్రంలో పూజా పాత్రలో సుష్మా రాజ్ కనిపించింది. చిత్రంలో మరో కీలక పాత్రలో సుష్మా తన మార్కును ప్రదర్శించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆకట్టుకుంది. సిద్దూకి ప్రియురాళిగా నటించిన నందిని రాయ్ ది అంతగా ప్రాధాన్యత లేని పాత్రే. నాగబాబు, ఝాన్సీ అతిధి పాత్రలకే పరిమితమయ్యారు. టెక్నికల్: ఓ హారర్, థ్రిల్లర్ చిత్రాలకు అవసరమయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించి శేఖర్ చంద్ర ఆకట్టుకున్నారు. పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. బాల్ రెడ్డి ఫోటోగ్రఫి క్వాలిటీ పరంగా బాగుంది. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎప్పుడూ విభిన్న కథాంశంతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు నీలకంఠ తాజాగా మరో ప్రయోగం మాయతో ముందుకొచ్చారు. తొలి సీన్ లోనే థ్రిల్ కలిగించి నీలకంఠ ఆకట్టుకున్నారు. ఆతర్వాత కథ నత్తనడక సాగడంతో తొలి భాగం కొంత విసుగు పుట్టించే విధంగా ఉంటుంది. ఇక రెండవ భాగంలో హీరోపై అనుమానాలు రేకెత్తించి కొంత ఆసక్తిని రేపాడు. క్లైమాక్స్ లో ఊహించని విధంగా కథను కీలక మలుపు తిప్పి నీలకంఠ తన మార్కును చూపించారు. ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టి ఉంటే కొంత వేగం పెరిగి ఉండేది. ప్రేక్షకుడ్ని థియేటర్ కు రప్పించే బలమైన అంశాలు లేకపోవడం కొంత నిరాశే. ఓవరాల్ గా వినోదమే ప్రధానంగా రూపొందుతున్న ప్రస్తుత ట్రెండ్ లో నీలకంఠ తాజా థ్రిల్లర్ చిత్రం 'మాయ' చేస్తుందా అనే విషయం తెలుసుకోవాలంటే కొద్ది రోజులాగాల్సిందే. -
మాయ మూవీ ప్రెస్ మీట్
-
ధోతీ పాట హంగామా
‘‘అతీంద్రియ దృష్టి నేపథ్యంలో ఇతర భాషల్లో పలు చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది తొలి ప్రయత్నం కాదు. కానీ, ఓ కొత్త అంశంతో ఈ సినిమా చేశాను. వైవిధ్యభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే చక్కని థ్రిల్లర్ ఇది. సినిమా విజయం మీద పూర్తి నమ్మకం ఉంది’’ అని దర్శకుడు నీలకంఠ చెప్పారు. హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా, నందినీరాయ్ ముఖ్య తారలుగా షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై ఎమ్వీకే రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మాయ’. నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 1న విడుదల కానుంది. ఈ సందర్భగా శుక్రవారం లగడపాటి శ్రీధర్ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ -‘‘ఈ కథతో పాటు ‘పోకిరి రాజా..’ పాట కూడా ముందుకు నడుస్తుంది. దాన్ని రీమిక్స్ చేశాం. అతి తక్కువ సమయంలో ఈ ‘ధోతీ సాంగ్..’ను చిత్రీకరించాం. ఇది ఇతివృత్తం మీద ఆధారపడిన చిత్రం’’ అన్నారు. ప్రచార గీతం చాలా బాగుందనీ, ఈ చిత్రం నీలకంఠకు మంచి పేరు తెస్తుందనీ లగడపాటి శ్రీధర్ చెప్పారు. ఇంకా హర్షవర్ధన్ రాణే, సిరాశ్రీ, రమ తదితరులు పాల్గొన్నారు. -
'నీలకంఠ' మాయా ప్రోమోసాంగ్ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్