'కాన్సెప్ట్, కమర్షియల్ అంశాలను బాగా బ్యాలెన్స్ చేయాలి. అయితే నా గత చిత్రాలకు ఈ బ్యాలెన్స్‌ను మిస్సయ్యానని అనుకుంటున్నా. బాలచందర్‌గారివంటి పెద్ద దర్శకుల కమర్షియల్ చిత్రాలు ఆడియన్స్‌ను అలరిస్తూనే కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉండేవి. ‘సర్కిల్’ సినిమాకి ఆ బ్యాలెన్స్ మిస్ కాకుండా జాగ్రత్త తీసుకుని, చేశాను' అన్నారు దర్శకుడు నీలకంఠ.
సాయిరోనక్, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. ఎమ్‌వీ శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నీలకంఠ మాట్లాడుతూ– ‘‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్. విధి వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి వారి జీవితాలను ఎలా అల్లకల్లోలం చేసింది? అన్నదే కాన్సెప్ట్.
ఈ చిత్రంలో ఫొటోగ్రాఫర్ పాత్రలో నటించిన సాయి రోనక్ అనూహ్యమైన ఘటనల్లో ఎలా చిక్కుకున్నాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియన్స్ సినిమాలను చూసే విధానంలో మార్పు వచ్చింది. నా తరహా సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో.. ఇది నా టైమ్ ఏమో అనిపిస్తోంది. ‘సర్కిల్’ ప్రేక్షకులకు నచ్చుతుందనే అనుకుంటున్నాను.
ఇక నా కెరీర్‌లో నేను గ్యాప్ ఇవ్వలేదు... ఇవ్వబడింది. ‘మాయ’ సినిమాను మహేశ్ భట్‌గారు హిందీలో తీయాలనుకున్నారు.. కుదర్లేదు. ఓ రెండు ప్రాజెక్ట్స్ సెట్స్‌కు వెళ్లే టైమ్‌లో ఆగిపోయాయి. స్వామి వివేకానందగారి జీవితంతో వెంకటేశ్‌గారితో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాను.. కుదర్లేదు. కానీ ఆయన నటించిన ‘ఈనాడు’కు డైలాగ్స్ రాశాను. హిందీ ‘క్వీన్’ మలయాళ రీమేక్ చేశాను. ఓ సోషల్ డ్రామా, పీరియాడికల్ సబ్జెక్ట్స్‌తో వెబ్ సిరీస్‌ల్లానే ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment